హైవే 44పై నగదు.. మద్యం పట్టివేత

పెద్దమందడి, వెలుగు : పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, లిక్కర్​ పట్టుబడుతోంది. మంగళవారం హైవే 44పై వెల్టూర్  గ్రామం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్​లో కారులో తరలిస్తున్న రూ.26.50 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన  రాజేశ్​ పడ్డర్  కర్నూల్  నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా డబ్బు పట్టుకున్నట్లు కొత్తకోట సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తనిఖీల్లో అబ్జర్వర్​ జయశంకర్, ఎస్ఐ హరిప్రసాద్  పాల్గొన్నారు.

ఆమనగల్లు : పట్టణంలోని బస్టాండ్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న కడ్తాల్ మండలం రావిచేడు గ్రామానికి చెందిన చేగూరు మహేశ్​ వద్ద రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ బలరాం నాయక్ చెప్పారు. పెట్రోలింగ్  కానిస్టేబుళ్లు మహేశ్​ను తనిఖీ చేసినట్లు చెప్పారు. 

బెల్ట్​ షాపులపై దాడి..

చిన్నచింతకుంట : మండలంలోని మద్దూరు గ్రామంలో బెల్ట్​షాపులపై ఎస్ఐ ఆర్.శేఖర్ఆధ్వర్యంలో దాడులు చేశారు. గ్రామానికి చెందిన మహమ్మద్  కిరాణ షాపులో 12 లిక్కర్ బాటిళ్లు, రాజుగౌడ్  షాపులో 32 బీర్లు, 30 క్వార్టర్​​బాటిళ్లు​స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు.

అలంపూర్ : ఉండవెల్లి మండలం బసాపురం గ్రామంలో బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. శ్రీనివాసులు దగ్గర 24 బీర్లు, 5 క్వార్టర్  బాటిళ్లు, మద్దిలేటి దగ్గర 9 బీర్లు, 7 క్వార్టర్​ బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు.