నెల్లూరు: దేశంలోనే ప్రముఖ పేరుపొందిన టాటా బ్రాండ్ పేరుతో నకిలీ టాటా విరాన్ చైన్ లింక్ ఫెన్స్ లు, బార్బ్‌డ్ వైర్లు తయారు చేసి డిస్ట్రిబ్యూటర్లకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఒరిజినల్ ను పోలిన తరహాలోనే తయారు చేస్తూ ఎవరూ గుర్తుపట్టని విధంగా నకిలీలు ఉత్పత్తి చేస్తుండడం చూసి పోలీసులు, నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి టాటా విరాన్ చెయిన్ లింక్ ఫెన్స్‌లు మరియు బార్బ్‌డ్ వైర్ ఉత్పత్తులను ప్రామాణీకరణ ప్యాకేజీలో లేకుండా విక్రయిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. నెల్లూరు నగరంలోని వేదాయపాలెం,వి. సతారం, సిదాపురం పోలీస్ స్టేషన్‌లలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం సహకారంతో ఏక కాలంలో నాలుగు ప్రాంతాలలో ఉమ్మడిగా దాడులు చేశారు. నెల్లూరు నగరంలోని పలు ఫ్యాక్టరీల్లో నకిలీలు ఉత్పత్తి చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
సదరు పరిశ్రమల యజమానులపై ఐపీసీ సెక్షన్ 420 తోపాటు కాపీరైట్ చట్టం సెక్షన్ 63 కింద కేసు నమోదు చేశారు. టాటా స్టీల్ ఉత్పత్తులకు నాణ్యమైన ఉత్పత్తులుగా మార్కెట్లో మంచి పేరు ఉన్న విషయం తెలిసిందే. తయారీ దారులు అసలును పోలిన తరహాలో నకిలీ ఉత్పత్తి చేసి టాటా స్టీల్ ట్రేడ్‌మార్క్స్, లోగోలను మరియు టాటా సన్స్ లోగోలు మరియు ట్రేడ్‌మార్క్స్‌ను అనధికారికంగా, ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు.