
హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. శుక్రవారం (సెప్టెంబర్ 27) సాయంత్రం సుల్తాన్ బజార్ పోలీసులు బొగ్గుల కుంటా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అబిడ్స్ వైపు నుండి అమిత్ అనే బట్టల వ్యాపారి చేతక్ స్కూటర్‌పై బొగ్గులకుంటా వైపు వస్తుండగా పోలీసులు ఆపి వెహికల్ చెక్ చేశారు. అమిత్ వద్ద ఉన్న ఓ బ్యాగ్‌లో రూ.50 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సుల్తాన్ బజార్ పోలీసులు డబ్బును సీజ్ చేసి ఇన్ కమ్ ట్యాక్స్‌కు సమాచారం అందించారు. అనంతరం సీజ్ చేసిన నగదును ఇన్కమ్ టాక్స్ అడిషనల్ డైరెక్టర్‌కు అప్పగించినట్లు సుల్తాన్ బజార్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ చారి మీడియాకు తెలిపారు.