హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మూడేళ్ల కింద అభ్యర్థులను సెలెక్ట్ చేసినా ఇంత వరకూ ఆఫర్ లెటర్లు ఇవ్వలేదు. దీంతో ఆ ఉద్యోగాలకు ఎంపికైన 72 మంది అభ్యర్థులకు నిరీక్షణ తప్పడం లేదు. అధికారులను అడిగితే స్పందన లేదు. ఆఫర్ లెటర్లు ఇచ్చి కొలువులోకి తీసుకోవాలని అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. వారిని జాబ్ లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా ఆర్టీసీ మాత్రం సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతూ తప్పించుకుంటోంది. ఆర్టీసీలో 72 జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనో పోస్టులకు 2018 లో టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష నిర్వహించి 2020 మార్చ్ 21న ఫలితాలు ప్రకటించి సెలెక్ట్ అయినవారి మెరిట్ లిస్ట్ ను విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి 72 మంది ఎంపికయ్యారని ప్రకటించింది. అయితే ఇంత వరకూ తమకు ఆఫర్ లెటర్లు ఇవ్వలేదని సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సీరియస్ అయి వారిని ఉద్యోగాల్లో తీసుకోవాలని ఆదేశించింది. ఆ ఆదేశంపై ఆర్టీసీ వివరణ ఇస్తూ కరోనా లాక్ డౌన్ వల్ల నష్టపోయామని, సంస్థ నష్టాల్లో ఉన్నందున రిక్రూట్మెంట్లను ఆపామని పేర్కొంది. ఈ కారణంగా ఆ అభ్యర్థులను విధుల్లోకి తీసుకోలేమని చెప్పింది.
రిక్రూట్మెంట్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ఆర్టీసీలో 2014 తర్వాత రిక్రూట్మెంట్ చేయడం లేదు. మరోవైపు ఉద్యోగులు ఎక్కువగా ఉండడంతో వీఆర్ఎస్కు అప్లై చేసుకుంటే అంగీకరిస్తామని కార్పొరేషన్ ప్రకటించటంతో సుమారు 1500 మంది వీఆర్ఎస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సంస్థలో అప్పుడు 4700కు పైగా ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన బోర్డు మీటింగ్ లో కొత్త ఉద్యోగాల రిక్రూట్ మెంట్‌పై ప్రపోజల్స్ పంపామని అధికారులు చెబుతున్నారు. ఇటీవలే కారుణ్య నియమాకాల కింద 166 మంది కానిస్టేబుళ్లను రిక్రూట్ చేసుకుంది. వారిని కూడా మూడేండ్ల ప్రొబేషన్ టైమ్ తో తీసుకున్నారు. ఈ టైమ్ లో వారి పనితీరుపై సంతృప్తి చెందితే రెగ్యులర్ చేస్తామని ఆఫర్ లెటర్ లో పేర్కొన్నారు. సాధారణంగా కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన తీసుకుంటుండగా తొలిసారి కాంట్రాక్ట్ పద్ధతిపై తీసుకోవడంపై ఉద్యోగులు ఫైర్ అవుతున్నారు.
మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
జాబ్‌లోకి తీసుకొమ్మంటే ఆర్టీసీ సమ్మె తరువాత , కరోనా తరువాత నష్టపోయామని అధికారులు చెబుతున్నారు. రెండు నెలల్లో ఉద్యోగాలు ఇవ్వమని హైకోర్టు చెప్పింది. అయినా లాస్ లో ఉన్నామని సంస్థ ఎండీ కోర్టుకు వివరణ ఇచ్చారు. జాబ్‌లు ఇవ్వాలని ప్రతి నెలా అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నం. రెండు నెలలు ఆగండని చెబుతున్నారు. మిగతా వారికి వేరే జాబ్‌లు వచ్చి జాయిన్ అయినరు. 2018 లో గ్రూప్ 4 తో పాటు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన్రు. ఇతర డిపార్ట్మెంట్లలో లేట్ చేయకుండా డ్యూటీలోకి తీసుకున్నరు. ఆర్టీసీలోనే ఆపిన్రు. మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి.
- సెలెక్టెడ్ క్యాండిడేట్, ఖమ్మం