యాదాద్రి, వెలుగు : యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో పోడు భూముల లబ్ధిదారుల ఎంపిక పూర్తైంది. జిల్లా, డివిజన్ స్థాయి మీటింగ్‌తో పాటు గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేశారు. రెండు జిల్లాల్లో కలిపి వేల సంఖ్యలో అప్లికేషన్లు రావడంతో ఆఫీసర్లు సర్వే నిర్వహించి అనర్హులే ఎక్కువ మంది ఉన్నట్లు తేల్చారు. యాదాద్రి జిల్లాలో 10 శాతం మంది ఎంపిక కాగా, సూర్యాపేట జిల్లాలో ఒక్క శాతం మందే అర్హులుగా తేలింది.
అప్లికేషన్లు 10,730.. అర్హులు 293 మంది
యాదాద్రి జిల్లా భువనగిరి డివిజన్‌లోని తుర్కపల్లి, చౌటుప్పల్ డివిజన్‌లోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లోని 11 గ్రామాల పరిధిలో 6,133 ఎకరాలకు 2,130 మంది అప్లై చేసుకున్నారు. గ్రామాలవారీగా అప్లై చేసుకున్న రైతుల ఆధార్ ఐడీలు తీసుకున్న ఆఫీసర్లు 2005 డిసెంబర్ 13 నాటికి సర్వే నంబర్ల వారీగా ఎంత మేరకు పోడు సాగు చేస్తున్నారు ? భూ విస్తీర్ణం ఎంత ? నాలుగు వైపులా ఎవరెవరు ఉన్నారన్న వివరాలను సేకరించారు. తర్వాత గ్రామ, డివిజన్, జిల్లా స్థాయి మీటింగ్‌లలో స్క్రీనింగ్ ప్రక్రియ చేపట్టి 218 ఎకరాల్లో 209 మంది పోడు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. అర్హులకు పంపిణీ చేసేందుకు పాస్‌బుక్స్ ప్రింటింగ్ కూడా పూర్తైంది. అయితే పోడు భూములకు సంబంధించి సర్కారు నుంచి ఎలాంటి ఆర్డర్స్ రాకపోవడంతో పాస్‌బుక్స్ పంపిణీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాగే సూర్యాపేట జిల్లాలో మొత్తం 8,600 మంది అప్లై చేసుకుంటే ఇందులో 86 ఎకరాలకు సంబంధించి 84 మందే అర్హులని గుర్తించారు.
అవగాహన లేక కొందరు..
విషయం తెలియక మరికొందరు..
పోడు భూములు పొందేందుకు అర్హత ఉన్న చాలా మంది అవగాహన లేకపోవడంతో అనర్హులుగా మిగిలిపోయారు. భూమిలో, రైతు బంధులో వాటా రాదన్న ఆలోచనతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు, ముగ్గురు పోడు భూమి కోసం అప్లై చేసుకున్నారు. దీంతో వారందరినీ అనర్హులుగా తేల్చారు. మరికొందరికి విషయం తెలియకపోవడంతో వారు అసలు అప్లికేషనే పెట్టుకోలేదు.
60 రోజుల్లో అప్పీల్ చేసుకునే చాన్స్
ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ రూల్స్ ప్రకారం 1930 నుంచి 2005 డిసెంబర్ 13 వరకు పోడు భూములు సాగు చేస్తున్న వారినే అర్హులుగా గుర్తించారు. ఒకవేళ ఎవరికైనా అర్హత ఉండి అనర్హులుగా రిజక్ట్ అయిన వారు 60 రోజుల్లోపు అప్పీల్ చేసుకునే చాన్స్ ఉందని ఆఫీసర్లు తెలిపారు.
నారాయణపురంలో
హద్దుల పంచాయితీ
చౌటుప్పల్ డివిజన్‌లోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని పలు తండాల్లో 2 వేల ఎకరాల భూమిపై రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ల మధ్య పంచాయితీ తెగడం లేదు. ఈ భూములకు సంబంధించి హద్దుల విషయంలో రెవెన్యూ, ఫారెస్ట్ ఆఫీసర్లు పలుమార్లు విభేదించారు. రెవెన్యూ ఆఫీసర్లు తమ పరిధిలో ఉన్న భూమి కంటే ఎక్కువ భూమికి పట్టాలు ఇవ్వడం వల్ల ఈ రెండు డిపార్ట్‌మెంట్ల పంచాయితీ పంచాయితీ తెగడం లేదని తెలుస్తోంది.