భీమదేవరపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరిగేలా ప్రభుత్వానికి సూచన చేస్తానన్నారు. గురువారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారంలో జేఏసీ రాష్ర్ట నేత బహుజనవాది చెప్యాల ప్రభాకర్సంస్మరణ సభకు హాజరై నివాళులర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నీలి జెండా పట్టుకొని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా బహుజన వాదాన్ని ప్రచారం చేసి స్వార్థం లేని నేతగా ప్రభాకర్ పేరుపొందాడని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై తాను అబద్దాలు ఆడుతున్నానని ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్నేతలకు కాగ్, ఇంజనీర్లు, డ్యాం సేఫ్టీ రిపోర్టులు కనబడటం లేదా అని ప్రశ్నించారు.
ఒకే సారి అన్ని వేల కోట్లు ఎందుకు పెంచారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మిగతా అప్పులతో పాటు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుకే ఏటా రూ. 13 వేల కోట్లు మిత్తి చెల్లించాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వంపై ఇంత భారం ఉన్నప్పటికీ రుణమాఫీ, ఇతర ప్రథకాల అమలుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాటిని అధిగమిస్తుండడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు డేగల సారయ్య, ఎదులాపురం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.