రూ.15.31 కోట్లతో మెదక్ రైల్వే స్టేషన్​ ఆధునికీకరణ : రాజర్షి షా

రూ.15.31 కోట్లతో మెదక్ రైల్వే స్టేషన్​ ఆధునికీకరణ : రాజర్షి షా
  • వర్చువల్​గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

మెదక్​టౌన్,  మనోహరాబాద్, వెలుగు: మెదక్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ కు ఎంపిక కావడం శుభపరిణామమని ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి, కలెక్టర్​ రాజర్షి షా అన్నారు. అమృత్​ భారత్​ స్కీం కింద రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  వర్చువల్ గా ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఎమ్మెల్సీ, కలెక్టర్​ ఆవిష్కరించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమృత్​ భారత్​ స్కీంతో మెదక్ స్టేషన్​రూపురేఖలు మారిపోతాయని, ప్రయాణీకులకు సౌకర్యాలు మెరుగవుతాయని అన్నారు.  రైల్వేస్టేషన్ లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం వల్ల జిల్లాలో వ్యవసాయం, పారిశ్రామిక, ఉద్యోగ, ఉపాధి, అవకాశాలు పెరుగుతాయన్నారు. మహిళలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి లబ్ది చేకూరుతుందన్నారు. 

బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ.. మోదీ హయాంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మోదీ వచ్చాక రూ.206 కోట్లతో అక్కన్నపేట--మెదక్  రైల్వే లైన్, స్టేషన్ ప్రారంభించగా, ఎలాంటి వినతులు లేకుండానే అమృత్ భారత్​ కింద మెదక్ స్టేషన్ ఎంపిక చేయడం విశేషమన్నారు. ఈ సందర్భంగా వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొని గెలుపొందిన స్టూడెంట్స్​కు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమం లో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, రైల్వే సీనియర్ డీఈ శ్రీతేజ, అధికారులు రహమాన్, రాజు, నర్సింహరావు, వినయ్, మెదక్ స్టేషన్ సూపరింటెండెంట్​ రమేశ్, స్టేషన్ మాస్టర్ పద్మారావు, నవనీత్ పాల్గొన్నారు.

మాసాయిపేట, కూచారంలో..

మాసాయిపేట మండలం రామంతాపూర్ ఒక అండర్ పాస్​ నిర్మాణానికి, మనోహరాబాద్ మండలం కూచారంలో రెండు, పాలట వద్ద అండర్​ పాస్​ల  నిర్మాణానికి వర్చువల్ విధానంలో పీఎం మోదీ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వడియారం రైల్వే స్టేషన్ మాస్టర్ సయ్యద్ యాసోద్దీన్ పాల్గొన్నారు.