- నేడు బోర్డు అపెక్స్ కౌన్సిల్ సమావేశం
న్యూఢిల్లీ : ఐసీసీ తదుపరి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జై షా ఇంకా బీసీసీఐ సెక్రటరీ పోస్టులోనే కొనసాగుతున్నారు. సెక్రటరీగా షా వారసుడి ఎంపిక మరింత ఆలస్యం కానుంది. బుధవారం జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎజెండాలో కొత్త సెక్రటరీ ఎంపిక ప్రస్తావన లేదు. బెంగళూరులో మరో ఐదు రోజుల్లో బీసీసీఐ 93వ వార్షిక సర్వసభ్య సమావేశానికి (ఏజీఎం) ముందు జరిగే చివరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఇదే కావడం గమనార్హం.
వాస్తవానికి జై షా స్థానంలో కొత్త సెక్రటరీ ఎంపిక అనివార్యం. అయితే, డిసెంబర్ 1 నుంచే ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఏజీఎంలోనూ జై షా బీసీసీఐ సెక్రటరీగానే వ్యవహరించనున్నారు. మరోవైపు అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో టీమిండియా జెర్సీ మాజీ స్పాన్సర్ బైజూస్ పేమెంట్ సెటిల్‌మెంట్ వివాదం అప్‌డేట్ సహా ఎనిమిది అంశాలపై బోర్డు పెద్దలు చర్చించనున్నారు.
బెంగళూరు శివార్లలో అత్యాధునిక నేషనల్ క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవం, ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం పునరుద్ధరణ పనులు, నార్త్‌ఈస్ట్ స్టేట్స్ క్రికెట్ డెవలప్‌మెంట్ అంశాలు కూడా చర్చకు రానున్నాయి.