ఆత్మగౌరవం అంగడి సరుకు కాదు

  ఆత్మగౌరవం అంగడి సరుకు కాదు

తెలంగాణ ఓ ఆత్మగౌరవ నినాదం. 6 దశాబ్దాలు సాగిన అస్తిత్వ పోరాటం. మన  భాషను, మన కళా వైభవాలను, మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించుకునే  స్వయంపాలన కోసం సబ్బండ వర్గాల ప్రజలు ఊదిన జంగు సైరన్. ఇచ్చిన మాటకు కట్టుబడి,  తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి,  సోనియా గాంధీ  నాయకత్వంలో  దశాబ్దాల  తెలంగాణ కల నెరవేరింది.  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం, 2014లో అధికారం చేపట్టిన కేసీఆర్, తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను, అస్తిత్వపు ఆనవాళ్లను  గాలికి వదిలేశాడు. 

తెలంగాణ  అస్తిత్వాన్ని  నిలబెట్టే  ప్రయత్నం కేసీఆర్  ఏనాడూ చేయలేదు. ఉద్యమ కాలంలో చేసిన డిమాండ్లను మీరు 10 ఏండ్లపాటు నిర్లక్ష్యం చేస్తే,  మేం అధికారంలోకి వచ్చినంక  ఒక్కొక్కటి  సాకారం చేస్తుంటే.. కేసీఆర్​ ఆ పార్టీ నాయకులకు ఇప్పుడు గుర్తొచ్చిందా ఆత్మగౌరవం?  అమర వీరుల సమాధుల మీద కుర్చీలు వేసుకుని అధికారంలో  కూర్చున్నరు, 10 ఏండ్లలో ఏనాడూ తెలంగాణ ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా?  గద్దర్,  విమలక్క,  అందెశ్రీ,  ఎక్క యాదగిరి లాంటి  తెలంగాణ కవులు,  కళాకారులపై  కేసీఆర్ పాలనలో దాష్టీకాలు జరిగినాయి. తెలంగాణ కవి గూడ అంజన్న కడు పేదరికంలో మరణిస్తే  ఆయనకు నివాళులు అర్పించలే.  

అధికారం వచ్చాక ఆత్మగౌరవం మరిచిన కేసీఆర్

తెలంగాణ  కోసం  పదవులను త్యాగం చేసి చివరి శ్వాస దాకా కొట్లాడిన బహుజన వర్గాల బిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మరణిస్తే నివాళులర్పించడానికి రాని చరిత్ర  కేసీఆర్​ది కాదా?  మలిదశ  తెలంగాణ  ఉద్యమంలో  ప్రాణత్యాగం చేసుకున్న తొలి అమరుడు  శ్రీకాంతాచారి కుటుంబాన్ని రాజకీయంగా అనాథలను చేసిన విషయం  కేసీఆర్​కు గుర్తు చేస్తున్నా. ఓయూలో  తెలంగాణ  కోసం  ప్రాణార్పణ చేసిన వేణుగోపాల్ రెడ్డి,  ఇషాంత్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య,  పోరాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ కుటుంబాలు ఏమైపోయినాయ్?  తెలంగాణ సిద్ధాంతకర్త  ప్రొఫెసర్ జయశంకర్ కుటుంబ సభ్యులు కలవడానికి వస్తే  కనీసం అపాయింట్​మెంట్​ ఇవ్వలేదు?  దొరగారికి వీళ్లు గుర్తున్నారా? తెలంగాణ ఆత్మగౌరవం సగర్వంగా చాటి చెప్పే రాష్ట్రీయ గీతం, తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తున్నా లేకపోవడం కేసీఆర్ గడీల పాలనకు నిదర్శనం. 

 ప్రజా పాలన చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజాకవి అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ను  రాష్ట్ర గీతంగా  జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల సాక్షిగా జాతికి అంకితం చేశారు.  తెలంగాణ ఆత్మగౌరవం సగర్వంగా చాటి చెప్పిన మహోన్నత ఘట్టమది. కేసీఆర్ తన 10 ఏండ్ల పాలనలో,  తను ఉండడానికి 10 ఎకరాలలో  ప్రగతి భవన్ అనే కోటను, వందల ఎకరాలలో ఫామ్ హౌస్,  పాత సెక్రటేరియట్  కూలగొట్టి కొత్త సెక్రటేరియట్,  జన్వాడలో చిన్న దొర ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు.  కానీ, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు నిర్మించలేదో సమాధానం చెప్పాలె? మా  ప్రభుత్వం ఏర్పడినంక తెలంగాణ తల్లి  విగ్రహాన్ని అంబేద్కర్  సచివాలయం ముఖద్వారం ఎదురుగా ప్రతిష్ఠించాలని నిర్ణయించి, భూమి పూజ నిర్వహించి, విగ్రహం ఏర్పాటు చేసే పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాం.  తెలంగాణ తల్లి రూపం గడీల సంస్కృతి కాకుండా,  తెలంగాణ  పల్లెల్లో  తల్లుల  రూపాలను  ప్రతిబింబించేలా రూపొందించే నిర్ణయం తీసుకున్నాం.

 కళాకారులకు గద్దర్​ పేరిట అవార్డులు

తెలుగు సినిమా రంగంలో అద్భుత ప్రతిభ కనబరిచే కళాకారులకు అందజేసే నంది అవార్డుల పేరును గద్దర్ పేరున మారుస్తూ సీఎం రేవంత్ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం.  తెలంగాణ  సిద్ధాంతకర్త,  ప్రొఫెసర్  జయశంకర్ సార్  పేరుమీద బడి-బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం సమాజం నుంచి తెలంగాణ ఉద్యమానికి దన్నుగా నిలిచిన సియాసత్ ఉర్దూ పత్రిక మాజీ ఎడిటర్ జహీర్ అలీఖాన్ గుర్తుగా  అమీర్ అలీఖాన్​ను  ఎమ్మెల్సీగా నియమించాం. 

ఉద్యమ సమయంలో జాక్ చైర్మన్ గా  క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్  కోదండరాంను గౌరవిస్తూ ఎమ్మెల్సీగా నియమించి ఉద్యమకారులకు సరైన గౌరవం దక్కేలా చర్యలు తీసుకున్నాం. నాడు తెలంగాణ ఉద్యమంలో మన భూములు, వనరులను చెరబట్టిన వాళ్ల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలని ప్రతిజ్ఞ చేశాం. కానీ,  కేసీఆర్  పదేండ్ల పాలనలో  సహజసిద్ధమైన సంపదలను రక్షించకపోగా బీఆర్ఎస్ నాయకులు భూముల కబ్జాకు తెగబడ్డారు.  రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే హైదరాబాద్​ నగర మణిహారమైన  ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న అన్ని చెరువులను,  కుంటలను కబ్జాల నుంచి విముక్తి చేసే హైడ్రా  అనే ఒక భూ-యజ్ఞం ప్రారంభించారు. 

తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది కాంగ్రెస్సే

పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క  సీటూ కూడా బీఆర్ఎస్ గెలవలేదు. చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్టు, ఆపార్టీ పేరు తిరిగి పాత టీఆర్ఎస్ అని మారుస్తారని వింటున్నాం.  ప్రభుత్వం చేపట్టే  పథకాల్లో  మీకు అభ్యంతరాలుంటే  రాజకీయ విమర్శలు చేయొచ్చు. కానీ, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి, మా ప్రభుత్వం చేస్తున్న కృషిని విమర్శిస్తున్న  బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్​లను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు.  కాంగ్రెస్​ ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడుతోంది. 

వీలైతే సహకరించండి లేదా సైలెంటుగా ఉండండి. అసెంబ్లీకి ముఖంచాటేసి ప్రధాన ప్రతిపక్ష పాత్రలో  విఫలమైన కేసీఆర్, తెలంగాణ అస్తిత్వం విరాజిల్లుతుంటే  కడుపు మంటతో ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు.  మీ బతుకుదెరువు కోసం, మళ్లీ ఆత్మ గౌరవ నినాదం ఎత్తుకోవడం కేసీఆర్ పచ్చి అవకాశవాద  రాజకీయాలకు నిదర్శనం. మీ కుట్రలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. మీ ఇష్టం ఉన్నట్టు వాడుకోవడానికి తెలంగాణ ఆత్మగౌరవం ‘అంగడి సరుకు’కాదని గుర్తు చేస్తున్నం.

- డా. కొనగాల మహేశ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి-