ఎవర్ని వాళ్లు ప్రేమించుకుంటున్నారా?

ఎవర్ని వాళ్లు ప్రేమించుకుంటున్నారా?

ప్రేమ ఎప్పుడూ మధురమే. కానీ, ఇక్కడ ఒక ప్రశ్న. ఇది చదువుతున్న వాళ్లలో ఎంతమంది తమని తాము ప్రేమించుకుంటున్నారు?  ఆ విషయాన్ని ఎవరికి వాళ్లు ఇప్పటివరకు ఎన్నిసార్లు చెప్పుకున్నారు? వినడానికే విచిత్రంగా ఉంది కదా! కానీ, ఇది చాలా అవసరం. ఎందుకంటే.. ఎవర్ని వాళ్లు ప్రేమించుకోకపోతే.. ఎవర్ని వాళ్లు అర్థం చేసుకోకపోతే.. ఎదుటి వాళ్లని ఎలా ప్రేమించగలుగుతారు?

ప్రేమని ఇద్దరు మనుషుల మధ్య ఉండే ఎమోషన్​గానే చూస్తుంటారు చాలామంది. కానీ, వీటన్నింటికన్నా ముందుంటుంది సెల్ఫ్​ లవ్.  దీని గురించి ఆలోచించకపోతే.. ఎన్ని ఉన్నా లైఫ్​లో ఏదో కోల్పోయినట్టే. ఏ సంతోషాన్నీ పూర్తిగా ఎంజాయ్​ చేయలేరు. అందుకే మొదట ఎవరికి వాళ్లు వాళ్లతో ప్రేమలో పడాలి. మరి ప్రేమంటే కేరింగ్​, షేరింగ్​, ప్యాంపరింగ్​...ఇలా మిక్స్డ్​ఎమోషన్స్​. వాటన్నింటినీ ఎవరికి వాళ్లు ఇచ్చుకోవాలి. అదెలా? అనే డౌట్ వస్తే... ఇది చదవండి.

‘నో ’ చెప్పాలి

అన్ని సందర్భాల్లో స్వార్థం చెడు చేసేదై ఉండదు. అసలు ఎవరికి వాళ్లు వాళ్ల గురించి ఆలోచించుకోవడం స్వార్థం కిందకే రాదు. అందుకే కాస్త సెల్ఫ్​ కేరింగ్​ అలవాటు చేసుకోవాలి. ప్రతి రిలేషన్​కి కొన్ని బౌండరీలు పెట్టుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఫ్రెండ్​ బాధ పడుతుందనో, చెల్లి ఏడుస్తుందనో  ఇష్టంలేకపోయినా అన్నింటికీ తలాడించకూడదు. వాళ్లందరికన్నా ముందు తమ ఎమోషన్స్​ గురించి ఆలోచించాలి. తమ బాధ గురించి ఆలోచించాలి. నచ్చని పని ఏదైనా సరే ‘నో’ చెప్పాలి. ఇదే సెల్ఫ్​ లవ్​కి తలుపులు తెరుస్తుంది. 

వాల్యూ ఇవ్వాలి

అందరూ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్​ కారు.. ఎప్పటికీ కాలేరు కూడా. కానీ, ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా చాలామంది ఇతరులతో పోల్చుకుంటూ వాళ్లని వాళ్లు తక్కువ చేసుకుంటారు. తమని తాము యాక్సెప్ట్​ చేయకుండా తిట్టుకుంటుంటారు. వేరొకరిలా ఉండటానికి ట్రై చేస్తుంటారు. ఈ సమస్యలన్నింటికీ కారణం సెల్ఫ్​ లవ్​ లేకపోవడమే. అందుకే ఎవర్ని వాళ్లు ప్రేమించుకోవాలి.. ఏ విషయంలోనూ వాళ్లని మరొకరితో పోల్చుకోకూడదు.  

క్షమించుకోవాలి

తప్పులు చేయడం సహజమే. కానీ, వాటిని సరిదిద్దుకోకపోవడమే తప్పు. వాటినే తలుచుకుంటూ  ఎవర్ని వాళ్లు ద్వేషించుకోవడం అంతకన్నా పెద్ద తప్పు. అందుకే తమకు తామే తప్పు చేస్తే ‘సారీ’ చెప్పుకోవాలి. వాళ్లని వాళ్లు క్షమించుకొని ఆ గిల్ట్​ నుంచి బయటికి రావాలి. తమని తాము మళ్లీ ప్రేమించుకోవాలి. 

గిఫ్ట్స్​ ఇచ్చుకోవాలి

లైఫ్​లో ఏదైనా సాధించినా లేదా హ్యాపీయెస్ట్​ మూమెంట్స్​లో​ తెలిసివాళ్లకి, ఫ్రెండ్స్​కి పార్టీలు​ ఇస్తుంటారు చాలామంది. కానీ, ఎప్పుడైనా ఎవరికి వాళ్లు పార్టీ​ ఇచ్చుకున్నారా? ఎవర్ని వాళ్లు కంగ్రాచ్యులేట్​ చేసుకున్నారా? సక్సెస్​ వచ్చినప్పుడు ఎవర్ని వాళ్లు పొగుడుకున్నారా?  ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. అయితే ఇక్కడ పార్టీ​ అంటే మనసు పరిగెత్తే చోటికి వెకేషన్​కి వెళ్లడం.. నోటికి నచ్చినవన్నీ తినిపించడం అన్నమాట. అలాగే ఎవరికి వాళ్లే గిఫ్ట్స్​ కూడా ఇచ్చుకోవాలి అప్పుడప్పుడు. 

ఎంజాయ్​ చేయాలి

ఫ్యామిలీ, ఫ్రెండ్స్​ హ్యాపీనెస్​ కోసం ఎన్నో చేస్తుంటారు కదా! అలాగే తమని తాము హ్యాపీగా ఉంచుకునేందుకు కాస్త టైం కేటాయించాలి. ఎవరి సంతోషాలకి వాళ్లు ప్రయారిటీ ఇచ్చుకోవాలి. అందుకోసం మనసుకి నచ్చిన పనులు చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా రోజులో కాసేపయినా తమ మనసుతో తాము మాట్లాడుకోవాలి. అప్పుడే ఎవర్ని వాళ్లు ప్రేమించుకోగలుగుతారు. 

ఐడెంటిఫై చేయాలి

బలహీనతలు, భయాలు, నెగెటివ్ థింకింగ్​ ఉన్న మనిషికి ఎవరూ త్వరగా దగ్గరవ్వరు. వీటివల్ల ‘మన’ అనుకున్న వాళ్లు కూడా దూరం జరుగుతారు. మరి వీటన్నింటి మధ్య  ఎవర్ని వాళ్లు ఎలా  ప్రేమించుకోగల గుతారు? ఎవరికి వాళ్లు ఎలా నచ్చుతారు?  అందుకే బలహీనతలు అన్నింటినీ దాటి ముందుకెళ్లాలి. వాటిని గెలవడానికి కష్టపడాలి. స్ట్రెంత్​పై ఫోకస్​ పెట్టాలి. నెగెటివ్​ థింకింగ్​కి పూర్తిగా దూరంగా ఉండాలి. అప్పుడే మనల్ని మనం మనఃస్ఫూర్తిగా  ప్రేమించగలుగుతాం.