ఇటీవల తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్రామ్మోహనరావు రాసిన ఆత్మకథ ‘గవర్నర్‌పేట టు గవర్నర్స్ హౌజ్’ అనే పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రముఖులు పాల్గొన్నారు. వాళ్లంతా ఢిల్లీలో తెలుగువారి ఆత్మ గౌరవం దెబ్బతిన్నది అని వాపోయారు. మరీ ముఖ్యంగా జైపాల్‌రెడ్డి, వెంకయ్యనాయుడు తర్వాత ఆ స్థాయిలో ఎవరూ నడపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి జైపాల్‌రెడ్డి మరణించాక ఓ ప్రముఖ స్వయం ప్రకటిత మేధావి వ్యాసం రాస్తూ ‘జైపాల్‌రెడ్డి లేనందున ఢిల్లీకి వెళ్లేందుకు, అక్కడ వ్యవహారాలు చేసుకోవడం కష్టం అయ్యింది’ అన్నాడు. ఇటీవల కొందరు వెంకయ్యనాయుడుపై కూడా ప్రేమ ఒలకబోస్తున్నారు. ఆయన రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు ఆయన పార్టీ చెడ్డదని తిడుతూ ఆయనతో పనులు చేయించుకున్నారని అర్థమవుతుంది. అలాగే జైపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నా ఇక్కడి లిబరల్స్‌కు ఢిల్లీలో పనులు జరిగేవని అర్థం అవుతోంది. నిజానికి తెలుగువారి గౌరవం పోయేందుకు నాయకులు, రాజకీయాలు కారణమా.. మేధావులు, లాబీయిస్టులు కారణమా.. అన్నది క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
అసలు తెలుగువారి ఆత్మగౌరవం అంటే అది భాషా, సాంస్కృతికపరమైందా, రాజకీయ సంబంధమైనదా అని స్పష్టం చేయాలి. అసలు తెలుగువారు అనే ముద్ర వేసుకుని తిరుగుతున్నవారు ఎప్పుడైనా మన తెలుగువాళ్ల వారసత్వం గురించి ఆలోచించారా.., తమిళవాళ్లను చూసి అనుకరించాలన్న పిచ్చిఊహ తప్ప ప్రాక్టికల్‌గా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, సంస్కృతి ఎవరైనా ఆలోచించారా?
ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం ఎందుకు?
ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించాక దేశమంతా ఓడిపోయినా ఇక్కడ ఉమ్మడి ఏపీలో గెలిపించిన ఘనత మన సొంతం. స్వాతంత్ర్య పోరాటంలో తన సర్వస్వం కోల్పోయిన ప్రకాశం పంతులును పట్టించుకోకపోవడం మన వారసత్వం. తొలి తెలంగాణ ఉద్యమంలో పిట్టల్లా కాల్చి చంపిన నేతలకు పట్టంగట్టిన మహా ఘనత మనది. 12వందల మంది అమరవీరులు త్యాగం చేస్తేకానీ తెలంగాణ ఇవ్వని నేతలను నమ్మిన చరిత్ర కూడా మనదే. అసలు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకు? అయినా కేంద్రంలో తన పరిమితులకు లోబడి రాజకీయాలు చేశాడు. నేషనల్‌ఫ్రంట్ కన్వీనర్‌గా తనకు తాను హద్దుల్లో ఉండి గౌరవం పొందాడు. అలాగే రాజశేఖర్‌రెడ్డి కూడా ప్రభావవంతమైన రాజకీయం చేయగలిగినా తన పాత్రను గుర్తెరిగాడు. మాట్లాడితే చక్రాలు తిప్పుతా అంటూ బయల్దేరిన చంద్రబాబు పరిస్థితి ఎలా అయిందో చూశాం. దేశ్ కా నేతా అంటూ తమకు తామే బిరుదు తగిలించుకుని దేశమంతా తిరిగిన కేసీఆర్ ప్రస్తుతం అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. చెన్నారెడ్డి, పీవీ నరసింహారావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఎన్టీఆర్ తమకున్న పరిధులను గుర్తుంచుకుని రాజకీయాలు చేశారు. కాబట్టే వాళ్లవరకు ఎంతో కొంత సక్సెస్ అయ్యారు. ఇందులో పీవీ, చెన్నారెడ్డి ఇద్దరూ ఆయా సందర్భాలనుబట్టి తగ్గారు. నెగ్గారు. ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవం తమిళంవారిని చూసి చేసినా తనదైన ముద్ర వేయగలిగారు. వైఎస్ కథకు మధ్యలోనే తెరపడింది. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ రాజకీయాల్లో ‘ఎకో సిస్టం’ సృష్టించుకొన్నారు. అందులో చాలామందిని పాత్రధారులను చేసి వ్యవస్థ అనిపించారు. కానీ, తమచుట్టూ ప్రదక్షిణ చేయించారు. మరీ ముఖ్యంగా అహంకారమే అధికారంగా భావించిన కేసీఆర్‌ను ప్రజలు ఆయన అహంకారానికి చరమగీతం పాడారు.
ఆంధ్రా పాలిటిక్స్ వేరయా
నాయకులు తమకు అవసరం వచ్చినట్లు వాడేందుకు ‘తెలుగుదనం’ సృష్టిస్తారు. ఎన్టీఆర్ తెలుగుదనం పేరుతో బ్రాండ్ సృష్టించినా సామాజికంగా ఎన్నో మార్పులు తెచ్చాడు. ఆంధ్రాలోని కుల రాజకీయాలను తన ముద్రతో కప్పేయగలిగాడు. తెలంగాణలో బీసీ కులాలను ముందు పెట్టుకున్నాడు. ఈ కాంబినేషన్‌తో పాటు తెలుగువారి ఆత్మగౌరవం అనే నవీన సృష్టికి రంగులద్దాడు. అది కొన్నాళ్లపాటు నడిచింది. ఈ వ్యవస్థ చంద్రబాబు చేతుల్లోకి రాగానే పచ్చి పాలిటిక్స్ గా మారిపోయింది.
ఆత్మగౌరవ పదాన్ని రాజకీయ
వ్యాపారంగా మార్చేసుకున్నారు. ఆఖరుకు ఆర్ట్స్ సబ్జెక్టులు దండగ అనేవరకు వెళ్లింది. ఆర్థికసంబంధాలే మానవ సంబంధాలు అనే స్థాయికి తీసుకువెళ్లాడు. విచిత్రం ఏమిటంటే ఎన్టీఆర్ ‘నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా’ అంటూ కుల రాజకీయాలకు తెలంగాణ సెంటిమెంట్ కప్పేస్తే, చంద్రబాబు ప్రపంచ బ్యాంక్ జీతగాడు అనే అపప్రథ మూటగట్టుకున్నాడు. తెలంగాణ ఉద్యమంలోని ద్వంద్వ వైఖరి ప్రదర్శించినా ఆంధ్రాప్రజలు బాబును ఆదరించారు. 2014లో అధికారంలోకి రాగానే ‘అమరావతి’ భూముల చుట్టూ జరిగిన ట్రేడింగ్ 2019లో బాబును కిందకు తోసేసాయి. వాజ్‌పేయి కాలంలోని బీజేపీ అనుకుని కలిస్తే ఇది అమిత్‌షా కాలం బీజేపీ అని అర్థం అయ్యేటట్లు చేశారు. 2019 ఎన్నికలకు ముందే బాబు గుజరాత్, కర్నాటక వంటి రాష్ట్రాల్లో బీజేపీని దెబ్బ తీయాలని చూస్తే అది రాజసూయ యాగం చేస్తున్న మోదీ, షాలు గ్రహించారు. ఆగర్భ శత్రువైన కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు మోదీపై యుద్ధానికి దిగి భంగపడ్డాడు. మళ్లీ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పొర్లాడుతున్నాడు. ఇదంతా తెలుగువారి ఆత్మగౌరవమా.. అందుకే సాంస్కృతమైనదా, రాజకీయమైనదా అనేది స్పష్టత ఉండాలి.
తెలంగాణలో సరికొత్త రాజకీయాలు
నిజానికి తెలంగాణ నేల నమ్మకానికి, అమాయకత్వానికి నెలవు. ఇక్కడి ప్రజలు స్వామి రామానందతీర్థ వంటి జాతీయభావం కలవారు. అందుకే ఎన్టీఆర్ వచ్చేవరకు కాంగ్రెస్‌ను భుజస్కంధాలపై మోశారు. ఎమర్జెన్సీ తరువాత ఇందిరను దేశమంతా నియంతగా చూస్తే తెలంగాణ ప్రజలు ఆమెలో దేశభక్తి కలిగిన జాతీయవాదిని చూశారు. అందుకే ఆమెను ఇక్కడి నుంచి గెలిపించుకున్నారు. 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిచినా అదే అంతర్గత కారణం. కేసీఆర్ నియంత పోకడలతో సంతుష్టీకరణ ఇక్కడి ప్రజలకు నచ్చలేదు. 2019లో బీజేపీకి 4ఎంపీ స్థానాలు రావడానికి ఇదే కారణం. 2014 తర్వాత తెలంగాణ తెచ్చిన పేరు తెచ్చుకున్న కేసీఆర్ తనకు తానే విలన్‌గా మారిపోయారు. ఇక్కడ వేలమంది రైతులు చూస్తుంటే పంజాబ్‌కు వెళ్లి డబ్బులివ్వడం ఎంతవరకు కరెక్టు అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తెలంగాణ ఆత్మగౌరవంపేర స్వీయ గౌరవం కోసం ఆరాటపడ్డాడు. తెలంగాణ ముసుగులో ఆంధ్రా తత్వ రాజకీయాలు నడిపిన కేసీఆర్ ను ప్రజలు ఇంటికి పంపారు.
తెలుగు రాష్ట్రాలు ఎక్కడ?
ఓచోట కాళేశ్వరం.. మరోచోట పోలవరం.. ఇవి జీవితకాలం పూర్తికావు. అయినా లాభం కన్నా పెట్టుబడి ఎక్కువ. వేల కోట్ల డ్రగ్స్వ్యాపారం తెలుగురాష్ట్రాల్లో నడుస్తున్నదని ఇటీవల పోలీసులు ప్రకటించారు. మన యువత ధ్వంసం అయిపోతుందని ఒక్క నాయకుడూ మాట్లాడడం లేదు. మద్యం వ్యాపారంతో స్కీంలు పెట్టే దుస్థితి మనది. రోడ్డు ప్రమాదాల్లో ఏటా వేల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. సమాజంలో నేర వ్యవస్థ గురించి ఏ నాయకుడూ, ఏ మేధావీ ఇక్కడ ఆందోళన చెందడు. సాంస్కృతికంగా మనఅస్తిత్వాన్ని సంస్కరణల పేరుతో విధ్వంసం చేశారు. నాయకులు చండీయాగాలు, రాజశ్యామలాలు చేస్తారు. ప్రజల్ని మందు, కల్తీ కల్లులో ముంచుతారు. మన సంస్కృతి అంటే ప్రతాపరుద్రుడు, రుద్రాంబ, పాల్కృర్కి, దున్న ఇద్దాసు, కొమరం బీం, గోదావరి –కృష్ణా నదులు అని మనం ఎప్పుడో మర్చిపోయి ఢిల్లీలో లాబీయిస్టులను ఆత్మగౌరవం అనుకుంటున్నాం. అక్కడే దెబ్బతిన్నాం.
అసలైన ఆత్మగౌరవం–‘దేశమంతా ఒక్కటే’
దక్షిణాదిలో ద్రావిడ రాజకీయాలు చేసే తమిళుల కోసం ‘తమిళ–కాశీ సంగమం’ జరిగింది. రామేశ్వరం నుంచి వేలమంది ఇసుక తీసుకెళ్లి కాశీమట్టిలో కలిపారు. కాశీ నీళ్లు తెచ్చి రామేశ్వరుడికి అభిషేకం చేశారు. పురాతన దక్షిణ రాజవంశపు ధర్మదండం శూద్ర కులాలు నడిపే సన్యాసుల ఆధ్వర్యంలో పార్లమెంటులో స్థాపించారు. సమ్మక్క సారలక్క పేరుతో విశ్వవిద్యాలయం, రాంజీగోండు పేరున మ్యూజియం ఏర్పాటు అవుతున్నాయి. జీ.20 సదస్సులు దేశమంతా జరిగాయి. ఆయా ప్రాంతాల కళలను ప్రత్యేకతలను ప్రతిబింబించాయి. ప్రణాళిక సంఘం కబంధ హస్తాల నుంచి నీతి ఆయోగ్ సృష్టించి ఆన్ని రాష్ట్రాల సంపద సమానంగా పంచబడుతుంది. ధృవాలు లేకుండా పోతున్నాయి. అంతా సమానమనే రీతిలో కాలం నడుస్తోంది. కాకపోతే, దక్షిణాది లేదా తెలుగు వాళ్లు అనే భావన నాయకుల లబ్ధి పదాలుగా మారిపోయాయి తప్ప అవి ప్రజల లబ్ధి పదాలు కావు.
- డా. పి. భాస్కరయోగి,పొలిటికల్ ఎనలిస్ట్