
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ కాముని చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను స్వయంగా గంగపుత్ర సంఘం సభ్యులే తొలగించుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదమని తెలిసినా.. వారే ఆ పని చేసుకుంటున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ సర్వే నంబర్190లో 54 ఎకరాల విస్తీర్ణంలో కాముని చెరువు ఉంది. సగం రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు. మిగతా చెరువులో పోచమ్మ బస్తీకి చెందిన 50 కుటుంబాలు 30 ఏండ్ల నుంచి చేపలు పట్టుకుని బతుకుతున్నాయి. కొంతకాలంగా చెరువులో గుర్రపు డెక్క పెరిగిపోయింది. చుట్టుపక్కల నుంచి వచ్చే మురుగునీరు చెరువులో కలుస్తోంది. లాడ్జీలు, హోటల్స్ నుంచి వ్యర్థాలు తీసుకువచ్చి పడేస్తున్నారు. దీంతో చెరువు కలుషితమై చేపలు చనిపోతున్నాయి. మున్సిపల్ అధికారుకు చెప్తే పట్టించుకోవడం లేదని, అందుకే తామే చెరువులోకి దిగి గుర్రపు డెక్క తొలగించుకుంటున్నామని చెప్తున్నారు.