పెగాసస్.. మొన్నమొన్నటిదాకా పెద్ద దుమారాన్ని రేపిన నిఘా మాల్వేర్. వాట్సాప్ వీడియో కాల్స్ చేసి, యూజర్ ఆ ఫోన్‌ను ఎత్తకున్నా హ్యాకర్లు స్పైవేర్‌ను పంపి గూఢచర్యం చేశారన్నది ఆరోపణ. ఇప్పుడు కాసేపు దాన్ని పక్కనపెడదాం. సెల్ఫీల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడున్న సెల్ఫీల మోజు అంతా ఇంతా కాదు. పెద్ద పెద్ద ఫోన్లన్నీ కూడా ఇప్పుడు కెమెరా ఫీచర్‌తోనే హైలైట్ అవుతున్నాయి. కానీ, ఆ సెల్ఫీ ముచ్చటే మనల్ని ముప్పులో పడేయొచ్చు. మనపై నిఘా పెట్టొచ్చు. అవును, సెల్ఫీ కెమెరాతోనే మనపై కొందరు హ్యాకర్లు నిఘా పంజా విసిరే ముప్పు పొంచి ఉంది. చెక్‌మార్క్స్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈ హెచ్చరిక చేసింది.
ఆండ్రాయిడ్ ఫోన్లలోని సెల్ఫీ కెమెరాలు నిఘాకు వల్నరబుల్గా మారిపోయాయని హెచ్చరించింది. శాంసంగ్, గూగుల్ పిక్సెల్ ఫోన్లలోని కెమెరాలను హ్యాకర్లు తమ కంట్రోల్లోకి తీసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్పింది. ‘‘గూగుల్ పిక్సెల్ 2ఎక్స్ఎల్, గూగుల్ పిక్సెల్ 3 ఫోన్లను తీసుకుని గూగుల్ కెమెరా యాప్‌తో మేం రీసెర్చ్ చేశాం. యూజర్ పర్మిషన్ లేకుండానే హ్యాకర్లు చొరబడిపోయేందుకు ఆ ఫోన్ల కెమెరాలు అనువుగా ఉన్నాయని తేల్చాం” అని కంపెనీ సెక్యూరిటీ రీసెర్చర్లు ఎరెజ్యెలోన్, పెడ్రో అంబెలినో తెలిపారు.
మన ప్రమేయం లేకుండానే ఫొటోలు, వీడియోలు
ఫోన్ల కెమెరాల్లోని సమస్యలతో హ్యాకర్లు ఈజీగా చొరబడిపోయి, ఫోన్ ఓనర్ ప్రమేయం లేకుండానే ఫొటోలు, వీడియోలు తీసే ముప్పు ఉందని నిపుణులు తేల్చారు. అందుకు ఓ మాల్వేర్ అప్లికేషన్‌ను హ్యాకర్లు వాడుకునే అవకాశం ఉందని చెప్పారు.
అంతేగాకుండా స్టోరేజీ పర్మిషన్ పాలసీల్లోని తేడాల వల్ల, ఫోన్లో దాచుకున్న ఫొటోలు, వీడియోలనూ హ్యాకర్లు దోచుకునే ముప్పుందంటున్నారు. కెమెరాలోని లొకేషన్ సెట్టింగ్స్, ఫొటోలపై ఉండే జీపీఎస్ మెటాడేటా ఆధారంగా ఫోన్ యూజర్ లొకేషన్‌నూ తెలుసుకునే ప్రమాదం ఉందంటున్నారు.
READ ALSO: రెడ్ అలెర్ట్: ఈ 40 రకాల మెయిల్స్ వస్తే ఓపెన్ చేయొద్దు
అలర్ట్ అయిన గూగుల్
ఈ వ్యవహారంపై గూగుల్ స్పందించింది. చెక్‌మార్క్స్ చేసిన రీసెర్చ్‌ను మెచ్చుకుంది. ఫోన్లలోని లోపాలపై సరిదిద్దేందుకు గూగుల్, యాండ్రాయిడ్ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని చెప్పింది. ఇప్పటికే ఆ ప్రభావం పడిన గూగుల్ డివైస్‌లలో సమస్యను పరిష్కరించామని తెలిపింది. జులైలో ప్లేస్టోర్ ద్వారా గూగుల్ కెమెరా అప్లికేషన్‌కు అప్డేట్ ఇచ్చామని చెప్పింది. సెక్యూరిటీ ప్యాచ్నూ తెచ్చామంది.