అంగట్లో రూ.35కే బతుకమ్మ చీరలు..

అంగట్లో రూ.35కే బతుకమ్మ చీరలు..

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరలు ఇప్పుడు అంగట్లో దర్శనమిస్తున్నాయి. అంగట్లో కొందరు వ్యాపారులు కుప్పలుపోసి అమ్ముతున్నారు. జగిత్యాల జిల్లా అంగడి బజారులో బతుకమ్మ చీరలను మూటలతో తీసుకువచ్చి సేల్స్ చేస్తున్నారు. గ్రామాల్లో చీరలు కొంటామంటూ తిరుగుతూ పోగుచేసి..అలా తీసుకువచ్చిన వాటిని అంగట్లో 30 నుంచి 50 రూపాయలు అమ్ముతున్నారు. గ్రామాల్లో తిరిగి చీరలకు బదులు వంట పాత్రలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. బతుకమ్మ చీరలను వ్యాపారులు అంగట్లో  లాభంతో అమ్ముకుంటున్నారు. మరికొన్నిచోట్ల కూరగాయల తోటలకు చుట్టూ రక్షణగా కడుతున్నారు. ధర్మపురి పుణ్యక్షేత్రంలో స్వామి వారికి మొక్కల కింద బతుకమ్మ చీరలను సమర్పిస్తున్నారు. కోట్లు వెచ్చించిన బతుకమ్మ చీరల పథకం ఇలా వ్యాపారులకు లాభం తెచ్చి పెడుతోంది.

ప్రతి దసరా పండుగ సందర్భంగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చీరలను కానుకగా అందిస్తోంది. రేషన్ కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు పైబడిన అర్హులైన ప్రతి మహిళలకు చీరలు అందిస్తోంది. సిరిసిల్ల మరమగ్గాలపై నేతన్నలు చీరలను తయారు చేస్తుంటారు. ఇందుకు గాను ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. 2017లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. 2022 దసరా పండుగ సందర్భంగా చీరలను పంపిణీ చేసింది. కానీ..చీరల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ చీరలు కట్టుకోవడానికి కూడా పనికి రావని చెబుతూ.. వేర్వేరు అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.