మోసాలు రక రకాల రూపాలు మార్చుకుంటున్నాయి. తాజాగా కొందరు కేటుగాళ్ళు మోసాలు చేయడంలో రూటు మార్చారు. ఆర్మీ ఉద్యోగుల పేరుతో నకిలీ కార్డులు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్మీ క్యాంటీన్ లో తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు నమ్మించి... బ్రాండెడ్ టీవీ లోగో, స్టిక్కర్లను, ప్రత్యేక సాఫ్ట్ వేర్ అమర్చి అమ్ముతున్నారు. ఖమ్మం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.
యూపీకి చెందిన ఓ ముఠా..సోని టీవీల పేరుతో భారీ మోసానికి పాల్పడింది. అమాయక ప్రజలను మోసం చేస్తూ..వందల సంఖ్యలో టీవీలు అమ్మింది. ఇందుకోసం కేటుగాళ్లు ఆయా టీవీల్లో ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను అమర్చారు. టీవీ ఆన్ చేయగానే సోని పేరు పడేలా సాఫ్ట్ వేర్ ను అమర్చారు. అంతేకాదు..టీవీలపై సోని స్టిక్కర్లను అంటించారు. దీంతో ప్రజలు నిజమైన సోని టీవీలే అని నమ్మి భారీ మొత్తంలో కొనుగోలు చేశారు.
అనుమానిస్తే..ఆర్మీ పేరు..
అయితే సోని టీవీలు బయట షాపుల్లో..లేదా ఆన్ లైన్ లో భారీ ధరల్లో ఉంటాయి. అయితే ఈ ముఠా తక్కువ ధరకే అమ్ముతుండటంపై కొందరికి అనుమానం వచ్చింది. దీంతో తాము ఆర్మీ ఉద్యోగులమని..ఆర్మీ క్యాంటీన్ లో తమకు తక్కువ ధరకు లభిస్తాయని నమ్మబలికారు. దీంతో జనం నిజమే కావచ్చు అని కొనుగోలు చేశారు. అయితే కొందరు ఈ మాటలను కూడా నమ్మలేదు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బండారం బయటపడింది. ఈ ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 43 ఇంచుల 32 టీవీలు, రూ.2,91,000 నగదు , 4 యాక్టీవాలు, ఒక కారు, సోని డూప్లికేట్ స్టిక్కర్లు , సాఫ్ట్ వేర్ పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకున్నారు.