![గాజుల వ్యాపారం పేరుతో గంజాయి అమ్మకం](https://static.v6velugu.com/uploads/2023/07/Selling-ganja-in-the-name-of-bangles-business-in-gandipet_pgL7wIlVzr.jpg)
- గాజుల వ్యాపారం పేరుతో గంజాయి అమ్మకం
- ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
- 40 గంజాయి ప్యాకెట్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం
గండిపేట్, వెలుగు : ఒడిశాకు చెందిన గంజాయి స్మగ్లర్ మహిళ యశోరిబాయ్, మహారాష్ట్రకు చెందిన అప్పాగులాబ్ పాండేలు మరో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులతో కలిసి గాజుల వ్యాపారం చేస్తున్నట్టు నటిస్తూ గంజాయి అమ్ముతున్నారు. మంగళవారం ఉదయం కాటేదాన్ లో గులాబ్‌పాండేతో పాటు అర్జున్ అలియాస్ అశోక్(3), సంతోష్ శివాజీ పాండే(22), సల్మాబేగం(32), స్వప్న గంగాధర్(33) లు 80 కిలోల గంజాయి సంచులతో రోడ్డు పక్కన నిలిచి ఉన్నారు. సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు వారిని పట్టుకొని ప్యాక్ చేసిన 40 గంజాయి ప్యాకెట్లు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని రిమాండ్‌కు పంపినట్టు రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.
రెండు లీటర్ల హాష్ ఆయిల్ , గంజాయి పట్టివేత
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ముచ్చంగిపుట్ట మండలానికి చెందిన బి.సురేంద్ర గంజాయి వ్యాపారి. ఇదే ప్రాంతానికి చెందిన ఏపీ సెక్రటేరియట్‌లో కాంట్రాక్టు ఉద్యోగి బి.ఆనంద్‌రావు(27)తో అతనికి పరిచయమైంది. చెడు అలవాట్లకు బానిసగా మారిన ఆనంద్‌రావు డబ్బు కోసం సురేంద్రతో కలిసి గంజాయితో తయారైన హాష్ ఆయిల్‌ను హైదరాబాద్ కు తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఆనంద్‌రావు మరో ఇద్దరు ఎం.రాధాకృష్ణ(28), ఎన్.బాలకృష్ణ(20)తో కలిసి సురేంద్ర నుంచి రెండు లీటర్ల హాష్ ఆయిల్‌తో పాటు గంజాయిని తీసుకొని సోమవారం రాత్రి సిటీకి బయలు దేరారు.
మంగళవారం తెల్లవారుజామున రాజేంద్రనగర్ ఓఆర్‌ఆర్ ప్రాంతానికి వచ్చారు. సురేంద్రకు ఆనందరావు ఫోన్ చేసి ఎవరికి ఇవ్వాలో చెప్పమని అడిగాడు. సురేంద్ర అక్కడే ఉండాలని తాను ఓ వ్యక్తిని పంపిస్తానని తెలిపాడు. సమాచారం అందడంతో రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు ముగ్గురుని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. రెండు లీటర్ల హాష్ ఆయిల్‌తో పాటు గంజాయి స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించినట్టు డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.