ప్రభుత్వ భూములను అమ్మడం సరికాదు.. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య

ప్రభుత్వ భూములను అమ్మడం సరికాదు..   రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఉన్న స్థలాలను వేలం వేసి అమ్ముకోవడం సరికాదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు 100 గజాల ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ స్థలాల వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. ఇండ్లు లేని పేదలకు 100 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం, గుడిసె వాసుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. 

నీల వెంకటేశ్, బాకి రవి అధ్యక్షత వహించగా, కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ దక్షిణాది రాష్ట్రాల చైర్మన్ రమేశ్ కుమార్ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. సిటీలోని కాచవాని సింగారం, తట్టిఅన్నారం, ఆర్కేనగర్ లో ప్రభుత్వం 4 వేల మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చి, పొజిషన్ ఇవ్వకుండా మొండిచేయి చూపిందని విమర్శించారు. వెంటనే స్థలాలు చూపించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఇందిరమ్మ ఇండ్ల హామీని నిలబెట్టుకోవాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలల గడుస్తున్నా ఏ ఒక్కరికీ ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. కార్యక్రమంలో సి.రాజేందర్, అనంతయ్య, గొరిగే మల్లేశ్​యాదవ్, పగిళ్ల సతీశ్, పేద ప్రజలు భారీగా పాల్గొన్నారు.