ప్రైవేట్ ల్యాండ్ పేరిట హరిణ వనస్థలి అమ్మకం

ప్రైవేట్ ల్యాండ్ పేరిట హరిణ వనస్థలి అమ్మకం
  • గుర్తించిన ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు 
  • అక్రమార్కుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచన

ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్​పరిధిలోని ‘హరిణ వనస్థలి నేషనల్ పార్క్’ను ప్రైవేట్ ల్యాండ్ గా చూపిస్తూ కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని శంషాబాద్ డీఎఫ్ఓ విజయానంద్, సరూర్ నగర్ ఎంఆర్ఓ వేణుగోపాల్ సూచించారు. గురువారం వారు హరిణ వనస్థలి పార్కులో మీడియాతో మాట్లాడారు. 

‘‘సరూర్ నగర్ మండలం మన్సూరాబాద్ లోని సర్వే నంబర్7లో 582 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ తమ తల్లిది అని యూసఫ్ ఖాన్, తులసమ్మ అలియాస్ సుల్తానా అనే భార్యాభర్తలు ప్రచారం చేసుకుంటున్నారు. గిఫ్ట్​డీడ్, సేల్ డీడ్, నోటరీ ప్లాట్ల పేరుతో డాక్యుమెంట్లు సృష్టించి అమాయకులకు అమ్ముతున్నారు. ఏ ఒక్కరూ ఆశ పడి కొనవద్దు. ఫారెస్ట్ ల్యాండ్​లోకి ఎవరైనా వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 

ఇప్పటివరకు 40 వేల నుంచి 50 వేల మందికి అక్రమార్కులు ఫేక్​డాక్యుమెంట్లతో విక్రయించినట్లు తెలుస్తుంది’’ అని చెప్పారు. ఫారెస్ట్ ల్యాండ్ లో ఎలాంటి ప్లాట్లు లేవని.. కొని మోసపోవద్దని సూచించారు. కోర్టు నుంచి, జిల్లా కలెక్టర్ నుంచి తమకు అనుకూలంగా ఆర్డర్ వచ్చిందని, ఈ నెల 26న సర్వే నంబర్ 7లో నేషనల్​ఫ్లాగ్​ఎగరవేయబోతున్నామని, ప్లాట్లు కొన్నవాళ్లు పెద్ద ఎత్తున హరిణ వనస్థలికి రావాలని అడ్వకేట్ మహ్మద్ జిలాని పేరుతో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయని, అలాంటి ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. 

సర్వే నంబర్ 7లోని 582 ఎకరాల భూమి ఫారెస్ట్ భూమిగా నోటిఫైడ్ రికార్డుల్లో ఉందన్నారు. అమాయకులకు అంటగట్టిన ఫేక్​డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్లు కావడం లేదని, ఈ ఇష్యూకు సంబంధించి బాధితులు ఇప్పటి వరకు కోర్టులో 280 ఫిటిషన్లు దాఖలు చేశారని, ఒక్కో ఫిటిషన్ లో 150కి పైగానే బాధితులు ఉన్నారని తెలిపారు. ప్రతి పిటిషన్ ను కోర్టు కొట్టివేసిందని వెల్లడించారు. సమావేశంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బి.సాయిప్రకాశ్, సెక్షన్ ఆఫీసర్ విద్యాసాగర్, నవీన్ రెడ్డి, కృష్ణవేణి, సుజాత, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.