నకిలీ డాక్యుమెంట్లతో ప్లాట్ల దందా

నకిలీ డాక్యుమెంట్లతో ప్లాట్ల దందా
  • ఎస్వోటీ పోలీసుల అదుపులో డాక్యుమెంట్ రైటర్, మరో నలుగురు
  •                 రెండు తెలుగు రాష్ట్రాల్లో బాధితులు, నిందితులు

నకిలీ ఆధార్, పాన్​కార్డులను సృష్టించి ఇతరుల ప్లాట్లను దశాబ్దకాలంగా అమ్మేస్తున్న ఓ రియల్​ఎస్టేట్, ప్రజాప్రతినిధుల ముఠాను రాచకొండ కమిషనరేట్​ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్​ సరిహద్దులోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​మండలం తుఫ్రాన్​పేట గ్రామంలో జరిగిన ఈ భూబాగోతానికి సంబంధించిన బాధితులు, నిందితులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. హైదరాబాద్​-విజయవాడ జాతీయ రహదారిపై, రాజధానికి సమీపాన తుఫ్రాన్​పేట గ్రామం ఉంది. రెండున్నర దశాబ్దాలుగా రియల్​ఎస్టేట్​వ్యాపారం ఇక్కడ జోరుగా సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రదేశ్​కు చెందిన పలువురు వ్యాపారులు ఇక్కడ భూములను కొనుగోలు చేసి ప్లాట్లను విక్రయించారు. తెలంగాణ వారికంటే హైదరాబాద్​లో స్థిరపడ్డ ఆంధ్రులే ఎక్కువగా ప్లాట్లను కొనుగోలు చేశారు. అప్పట్లో రిజస్ట్రేషన్​డాక్యుమెంట్లలో ఫొటోలు ఉండేవి కావు. సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయంలో ఫొటోలు లేని డాక్యుమెంట్ల సీసీ కాపీలను తీసుకుని ముఠా సభ్యులు అందులోని కొనుగోలుదారుల పేరున ఇతరుల ఫొటో పెట్టి ఆధార్​ కార్డును సృష్టిస్తున్నారు. ఆ ఆధార్​ కార్డు ఆధారంగా ప్లాట్లను అమ్మేస్తున్నారు. ఇలా తుఫ్రాన్​పేట గ్రామంలో పలువురు ప్రజాప్రతినిధులు, లోకల్​ లీడర్లు ప్లాట్లను అమ్మేసి కోట్లకు పడగలెత్తారు.

బయట పడిందిలా..

హైదరాబాద్​కు చెందిన టి.కిరణ్​కుమార్​గ్రీన్​ సిటీ వెంచర్​లో 266 గజాలు గల 1837 నంబరు ప్లాట్​ను 2016లో  కొనుగోలు చేశాడు. ఇతని పేరుతో ఖైతాపురం గ్రామానికి చెందిన వెల్మ రామలింగేశ్వరరెడ్డి ఫొటోను ఉపయోగించి నకిలీ పాన్​కార్డును సృష్టించారు. దీని ఆధారంగా తుఫ్రాన్​పేటకు చెందిన ఏనుగు మాధవరెడ్డి పేరున 2019లో ఈ ప్లాట్​ను రిజిస్ట్రేషన్​ చేయించారు.  తన పేరుతో నకిలీ ఆధార్​ కార్డును సృష్టించి ప్లాటును ఇతరులకు అమ్మేశారని గుర్తించిన కిరణ్​కుమార్​ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ కార్డుతో ప్లాట్ రిజిస్టర్​చేసిన ఖైతాపురం గ్రామానికి రామలింగేశ్వర్​రెడ్డి, రిజిస్ట్రేషన్​ చేసుకున్న తుఫ్రాన్​పేట గ్రామానికి చెందిన ఏనుగు మాధవరెడ్డి, అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా ఇదే తుఫ్రాన్​పేట గ్రామానికి చెందిన మరో నాయకుడిని, చౌటుప్పల్​సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయానికి చెందిన డాక్యుమెంట్ రైటర్ ఆకుల శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఆంధ్రావాళ్ల ప్లాట్లే టార్గెట్​

తుఫ్రాన్​పేట, మల్కాపురం గ్రామాలకు చెందిన పలువురు లోకల్​ లీడర్లు ఇలాగే ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్ల ప్లాట్లను ఎంపిక చేసుకొని నకిలీ ఆధార్, పాన్, ఓటర్​ కార్డులను సృష్టిస్తున్నారు. స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లకే ఈ ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఇలా ఇప్పటికే వందలాది ప్లాట్లను విక్రయించినట్టు తెలుస్తోంది. ఎస్వోటీ పోలీసులు విచారణలో మాధవరెడ్డి నుంచి దాదాపు 50 ప్లాట్లకు చెందిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అదే విధంగా తుఫ్రాన్​పేటకు చెందిన పలువురు పెద్ద మొత్తంలో ప్లాట్లను అమ్మేసినట్టు తెలుస్తోంది. మరికొందరు ఖాళీగా ఉన్న ఫ్లాట్లను కబ్జా చేసి లే అవుట్లు మార్చి అమ్మేస్తున్నారు. తుఫ్రాన్​పేటలోని 27వెంచర్లలో సామాజికి అవసరాల కోసం వదిలేసిన 10శాతం భూమిని కూడా ప్లాట్లుగా చేసి విక్రయించారు. లేఅవుట్లలోని రోడ్లను సైతం అమ్మేశారు. ఇలా నకిలీ ఆధార్​ కార్డులతో ప్లాట్లు, లే అవుట్లలోని పార్క్ స్థలాలను అమ్మేసి రూ. కోట్లు కొల్లగొట్టారు.

విజయవాడ నుంచి పిలిపించి…

తుఫ్రాన్​పేట గ్రామానికి చెందిన లోకల్​ లీడర్​కు విజయవాడకు చెందిన యువతితో వివాహమైంది. ఆ పెళ్లి ఫొటోలను అక్కడి నుంచి ఓ ఫొటోగ్రాఫర్​తీశాడు. ఇతని ద్వారా అక్కడి వారిని ఇక్కడికి రప్పించి, వారి పేరు మీద నకిలీ ఆధార్​కార్డులు, పాన్​కార్డులు, ఓటర్​ కార్డులు, డ్రైవింగ్​ లైసెన్స్ లు సృష్టిస్తున్నారు. వారితో ప్లాట్లను  అమ్మేస్తున్నారు. ఇలా ఒక్కరిని ఒక్క ప్లాట్​కే వినియోగిస్తున్నారు. ఇంకో ప్లాట్​ను గుర్తించాక ఇంకొకరిని రప్పిస్తున్నారు. ఆడవాళ్లను సైతం రప్పించి ఆధార్​ కార్డులు సృష్టించి ప్లాట్​లను అమ్మేస్తున్నారు. వారికి రానుపోను ఖర్చులను భరించడంతోపాటు ఎంతోకొంత ముట్టజెప్పుతున్నారు. ఇదే క్రమంలో గుంటూరుకు చెందిన షేక్​ఖాదర్​ పాషాను ఇక్కడికి రప్పించి కాకాని ప్రసాద్​గా ఆధార్​ కార్డు సృష్టించి ఓ ప్లాట్​ను అమ్మేశారు.

ఒకటే నంబరు అటూ ఇటు మార్చి..

పక్కనున్న మూడు ఆధార్​ నంబర్లు గమనించారా… అన్నింటిలోనూ ఒకే నంబర్లు ఉన్నాయి. కాకపోతే కాస్త అటు ఇటుగా మార్చేశారు. ఆ నకిలీ కార్డులను చూపించి ఇతరుల ప్లాట్లు ఆధార్​కార్డులో ఉన్నవారివేనంటూ అమ్మేస్తున్నారు.