హనుమకొండ, వెలుగు: మనుషులు ఆరోగ్యానికి ఉపయోగపడాల్సిన మెడిసిన్ మరణాలకు కారణమవుతున్నాయి. క్షణికావేశంలో చేసే హత్యలు, ఆత్మహత్యలకు ఆయుధాలుగా మారుతున్నాయి. ఇందుకు మెడికల్ షాపుల ఇష్టారాజ్యమే కారణమని తెలుస్తోంది. సంబంధిత ఓనర్లు తమ బిజినెస్ నడవడానికి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే అడిగిన మందులన్నీ ఇస్తుండటం.. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది ప్రాణాలకు హాని కలిగించే మందులను కూడా తీసుకెళ్తుండడంతో క్షేత్రస్థాయిలో నేరాలు జరుగుతున్నాయి. నిషేధిత మందులను కూడా గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. వాటిపై నిఘా పెట్టాల్సిన ఆఫీసర్లు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం వల్లనే దారుణాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇష్టారీతిన అమ్మకాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 390 మెడికల్ఏజెన్సీలు, 1,622 మెడికల్ షాపులు ఉన్నట్లు డ్రగ్స్కంట్రోల్ఆఫీసుల రికార్డులు చెబుతున్నాయి. వీటితో పాటు ప్రైవేటు నర్సింగ్ హోమ్స్, ఆస్పత్రుల్లో ఉండే మెడికల్ షాపులు మరో వెయ్యి వరకు ఉంటాయని అంచనా. కాగా ఇందులో చాలా మెడికల్ షాపులు రూల్స్పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. కొన్ని రకాల నిషేధిత మాత్రలు, సిరప్లు కూడా ఇష్టమొచ్చినట్లు అమ్ముతున్నట్లు సమాచారం. ముఖ్యంగా స్లీపింగ్ పిల్స్ అడగగానే షీట్లకు షీట్లు చేతిలో పెడుతుండటంతో వాటితో కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా హత్యలు చేయడం, కొందరు ఆత్మహత్యలు చేసుకోవడానికి వాటిని వినియోగిస్తున్నారు. గత కొంతకాలంగా జిల్లాలో వెలుగు చూస్తున్న ఘటనలు చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోంది.
గొర్రెకుంట మృత్యు బావి ఘటన గుర్తుందా..?
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో తొమ్మిది శవాలు బయటపడిన ఘటనకు నిద్రమాత్రలే కారణమని తేలింది. బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్ అనే యువకుడు గోనె సంచుల ఇండస్ట్రీలో పని చేస్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన మహ్మద్ మక్సూద్ కుటుంబం మొత్తాన్ని హత్య చేశాడు. 2020 మే 20న వారు తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపి.. నిద్రమత్తులోకి జారుకున్న వారందరినీ పక్కనే ఉన్న పాడుపడ్డ బావిలో పడేసి ప్రాణాలు తీశాడు.
ఇందులో మక్సూద్ భార్య నిశా ఆలం, కొడుకులు షాబాజ్, సోహైల్, కూతురు బుస్రా ఖాతూన్, ఆమె మూడేండ్ల కొడుకు బబ్లు, వారితో కలిసి పని చేసే శ్యాం, శ్రీరాం, షకీల్ ప్రాణాలు కోల్పోయారు. నిశా ఆలం అక్క కూతురు రఫీకాతో అక్రమ సంబంధం పెట్టుకుని, చివరకు ఆమెను హత్య చేసి.. దాని నుంచి తప్పించుకునేందుకు ఈ 9 మందిని కూడా కడతేర్చినట్లు పోలీసులు నిర్ధారించగా.. కాగా బావిలో 9 డెడ్‌బాడీలు బయటపడటంతో ఈ ఘటన అందరినీ గగుర్పాటుకు గురిచేసింది.
కాగా వారందరినీ చంపడానికి సంజయ్ కుమార్ వాడిన అస్త్రం నిద్రమాత్రలు. నగరంలోని ఓ షాప్ నుంచి దాదాపు 60 నిద్రమాత్రలు కొనుగోలు చేసి తొమ్మిది మంది మరణానికి కారణమయ్యాడు. అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చిందెవరని పోలీసులు, మెడికల్, హెల్త్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు ఎంక్వైరీ పేరుతో అప్పట్లో పెద్ద హడావుడి చేశారు. ఆ ఎంక్వైరీని ఎందుకో మధ్యలోనే వదిలేశారు.
నో ఎంక్వైరీ.. నో యాక్షన్
డాక్టర్లు రాసిచ్చిన మందులను రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ మాత్రమే పరిశీలించి బ్యాచ్ నెంబర్, మెడిసిన్ వివరాలతో కూడిన కంప్యూటర్ జనరేటెడ్ బిల్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలాచోట్లా అదంతా ఏమీ జరగడం లేదు. దీంతోనే నిద్రమాత్రలు, నిషేధిత మందులతో ఆత్మహత్యలు, హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో ఎక్కడో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. కానీ ఈ విషయంలో ఎలాంటి ఎంక్వైరీలుగానీ, చర్యలు ఉండటం లేదు.
ట్యాబ్లెట్ షీట్ల మీద ఉండే బ్యాచ్ నెంబర్, వివరాల ఆధారంగా సంబంధిత ఏజెన్సీ, మెడికల్ షాపులను గుర్తించే వీలుంటుంది. అయినా ఎక్కడా అలాంటి చర్యలు కనిపించకపోవడం గమనార్హం. తాజాగా డీజిల్ కాలనీ యువకుడి హత్య కేసుతో పాటు ఇలాంటి ఘటనలు జరిగిన కేసుల్లో లోతుగా ఎంక్వైరీ చేస్తే మెడిసిన్ దందాకు సంబంధించిన వాస్తవాలు బయటపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన ఓ డిగ్రీ స్టూడెంట్ గత నెల సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకుని, కూల్ డ్రింక్‌లో నిద్రమాత్రలు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్ధన్న పేటలోని ఓ మెడికల్ షాపు నిర్వాహకులు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇవ్వగా.. వాటితోనే స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
పది రోజుల కింద వెలుగులోకి వచ్చిన కాజీపేట డీజిల్ కాలనీలో చిట్టీ వ్యాపారి వేణుకుమార్ హత్యకు కూడా అతడి మొదటి భార్య నిద్రమాత్ర లు ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. సేమియాలో మోతా దుకు మించి స్లీపింగ్ పిల్స్ కలిపి ఇవ్వగా.. వేణు నిద్రపోయాడు. అనంత రం ఆమె సుపారీ వ్యక్తులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి వేణును పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని మానేరు వాగులో హత్యచేశారు.