- దేశంలోనే తొలిసారి గాంధీ ఆస్పత్రిలో నిర్వహణ
- ఆన్లైన్, ఆఫ్ లైన్లో కలిపి 500 మంది డాక్టర్ల హాజరు
పద్మారావునగర్, వెలుగు:ట్రాన్స్ జెండర్ల వైద్యం, వారి శారీరక నిర్మాణంలో వ్యత్యాసాలు, మానసిక మార్పులు, హార్మోన్ల ప్రభావం తదితర అంశాల్లో డాక్టర్లకు అవగాహన కల్పించేందుకు గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియాలజీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్(సీపీడీ) పేరుతో ఒక రోజు సెమినార్ నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా జరిగిన ఈ రాష్ర్ట స్థాయి సెమినార్ లో రాష్ర్టంలోని పలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన ప్లాస్టిక్ సర్జరీ, సైకాలజీ, పిజియాలజీ, ఎండోక్రైనాలజీ, సైకియాట్రిక్, ఫోరెన్సిక్, తదితర విభాగాల డాక్టర్లు పాల్గొన్నారు. ఆఫ్ లైన్ లో 200 మంది, ఆన్ లైన్ లో 300 మంది డాక్టర్లు సెమినార్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ చైర్ పర్సన్, గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియాలజీ ప్రొఫెసర్ రమాదేవి మాట్లాడుతూ.. ట్రాన్స్ జెండర్లకు కూడా మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ర్టంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక వైద్య విభాగాలను ఏర్పాటు చేసిందన్నారు.
ట్రాన్స్ జెండర్ల సమస్యలపై ప్రసంగాలు..
సెషన్ కు హాజరైన డాక్టర్ ప్రాచీ రాథోడ్ మాట్లాడుతూ.. ట్రాన్స్ జెండర్ గా తనకు ఎదురైన ఆరోగ్య, మానసిక సమస్యలు, తదితర అంశాలను వివరించారు. యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ లావణ్య కౌసిల్మాట్లాడుతూ.. జెండర్ మార్పు తర్వాత వచ్చే లీగల్ సమస్యల గురించి తెలిపారు. హార్మోన్ల ప్రభావంపై ఉస్మానియా మెడికల్ కాలేజీ ఎండోక్రైనాలజీ ప్రొఫెసర్ రాకేశ్ కుమార్ సహాయ్ వివరించారు. సెమినార్ లో బీబీనగర్ఎయిమ్స్ సైకియాట్రిక్ అసోసియేట్ ప్రొఫెసర్ మాలతేశ్, ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్ పాలుకూరి లక్ష్మీ, సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ గైనకాలజీ హెచ్ఓడీ ప్రొఫెసర్ మహాలక్ష్మి, చేవేళ్ళ పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్డాక్టర్ .జోయారాణి కూడా ట్రాన్స్ జెండర్లకు సంబంధించిన అంశాలపై ప్రసంగించారు.