
ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఏ లో సెమీస్ కు చేరిన జట్లు ఏవో తెలిసిపోయాయి. భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ కు అర్హత సాధించగా .. పాకిస్థాన్, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. గ్రూప్ ఏ లో మరో రెండు మ్యాచ్ లు ఉన్నప్పటికీ వాటి ఫలితాలతో ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక గ్రూప్ బి విషయంలో ఏ జట్లు సెమీస్ కు చేరతాయనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ నాలుగు జట్లు సెమీస్ రేస్ లో ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ బి లో భాగంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ రద్దయింది.వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. ప్రస్తుతం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా 3 పాయింట్లతో సమంగా ఉన్నాయి. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో సౌతాఫ్రికా టాప్ లో ఉంది. రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్ లో గెలిస్తే ఎలాంటి సమీకరణం లేకుండా సెమీస్ కు చేరుతాయి. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడాల్సి ఉంటుంది.
Also Read:-పాకిస్థాన్‌పై సూపర్ సెంచరీ.. టాప్-5కి చేరిన విరాట్ కోహ్లీ..
మరోవైపు ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మాత్రం తాము ఆడే చివరి రెండు మ్యాచ్ ల్లో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. రెండు మ్యాచ్ ల్లో ఒకటి ఓడిపోయినా ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఇంటిదారి పడతాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తో ఇంగ్లాండ్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో గ్రూప్ లో ఎవరు సెమీస్ కు చేరతారో ఆసక్తికరంగా మారింది. నిన్న సౌతాఫ్రికా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడం ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లకు కలిసొచ్చింది. ముఖ్యంగా నెట్ రన్ రేట్ దారుణంగా ఉన్న ఆఫ్ఘన్ జట్టుకు ఇది పెద్ద ఊరట.