మూడు పార్టీల ముచ్చట

సెక్యులర్ పార్టీ, హిందూ పార్టీ, మరాఠా పార్టీ ….ఈ మూడింటి కాంబినేషన్ తో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడబోతోందంటే, విశ్లేషిం చడానికి కావలసినన్ని పాయింట్లు ఉన్నట్టే లెక్క. మూడు పార్టీలవి వేరు వేరు దారులే అయినా, వాటి కామన్ అజెండా అధికారానికి రావడమే. మరి, ఈ అధికారం ఐదేళ్లు ఉంటుందా ? మధ్యలోనే బంధం తెగిపోతుందా అనేది చూడాల్సిందే.

శివసేన: పట్టు నిలబెట్టుకోనీకే...

మహారాష్ట్ర  ప్రజల  ప్రయోజనాల కోసం పుట్టిన శివసేనకు గతంలో ముంబై సిటీతో పాటు థానే, ఔరంగాబాద్, నాసిక్ ప్రాంతాల్లో మంచి పట్టు ఉండేది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తరువాత పరిస్థితులు మారిపోయాయి. శివసేనకు బలమున్న ప్రాంతాల్లో బీజేపీ పాగా వేసింది. సీఎం పదవి తమ చేతిలో ఉంటే మహా రాష్ట్ర మొత్తంలో తమ పట్టు పెంచుకోవచ్చన్నది శివసేన ఆలోచన. అందుకే సీఎం పోస్టు కోసం పట్టుబట్టింది. దీంతోపాటు మరో రెండేళ్లలో రాబోతున్న మునిసిపల్ ఎన్నికల్లో కూడా గెలవాలంటే సీఎం పదవి చేతిలో ఉండడం అవసరం.

 

ఉద్ధవ్ థాక్రే ఓ ఫ్యాక్టర్ గా మారారా ?

శివసేన తరఫున సీఎం అభ్యర్థిగా మొదట ఆదిత్య థాక్రే పేరు తెర మీదకు వచ్చింది. లేటెస్ట్ ఎన్నికల్లో ఆయన వర్లి నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే రాజకీయంగా చాలా జూనియర్ అయిన ఆదిత్య ను సీఎంగా అంగీకరించడానికి కాంగ్రెస్, ఎన్సీపీ లీడర్లు ఇబ్బందిపడ్డట్లు తెలిసింది. తరువాత సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే పేరు వినిపించింది. ఉద్ధవ్ కు కూడా పాలనాపరమైన అనుభవం లేదు. ఈ ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. జీవితంలో ఏ రోజూ ఎమ్మెల్యేగా కూడా పనిచేయలేదు. అయితే బాల్ థాక్రే చనిపోయిన తరువాత అన్నీ తానై శివసేనను నడిపించారు. ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు శరద్ పవార్ తో పాటు కాంగ్రెస్ లోని అనేకమంది సీనియర్ లీడర్లతో మంచి సంబంధాలున్నాయి. అందుకే, ఆయన సీఎంగా బాగా పనిచేయగలరని నమ్ముతున్నారు.

కీలక సమయాల్లో కాంగ్రెస్ కు శివసేన మద్దతు

శివసేనతో సిద్దాంతాలపరంగా అనేక తేడాలు ఉన్నప్పటికీ గతంలో చాలాసార్లు ఆ పార్టీ మద్దతు కాంగ్రెస్ తీసుకుంది. పార్టీ చీఫ్ సోనియా గాంధీకి ఇదే విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వివరించినట్లు తెలిసింది. 1975లో ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు బాల్ థాక్రే కాంగ్రెస్ కు అండగా నిలిచిన విషయాన్ని  కాంగ్రెస్ లీడర్లు సోనియాకు గుర్తు చేసినట్లు రాజకీయవర్గాల కథనం. దేశాన్ని సంక్షోభం నుంచి బయటపడేయడానికి ఎమర్జెన్సీ మినహా మరో మార్గం లేదని అప్పట్లో బాల్ థాక్రే తన ‘మార్మిక్’ వీక్లీలో ఎడిటోరియల్ రాసిన విషయాన్ని వీరు గుర్తు చేశారు. అంతేకాదు అనేక సార్లు రాష్ట్ర పతి ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ ను శివసేన బలపరచింది. కాంగ్రెస్ కేండిడేట్లుగా 2007లో ప్రతిభా పాటిల్, 2012లో ప్రణబ్ ముఖర్జీ పోటీ చేసినప్పుడు శివసేన మద్దతు ఇచ్చింది.

కాంగ్రెస్​: బీజేపీకి చెక్​ పెట్టేటందుకే…

ఈమధ్య కాలంలో దేశంలో బీజేపీ దూకుడు కు ఎక్కడా చెక్ పెట్టే స్థాయిలో కాంగ్రెస్ లేదు. అలాంటిది మహారాష్ట్ర వంటి కీలకమైన రాష్ట్రంలో బీజేపీ స్పీడుకు బ్రేకులు వేసే అవకాశం రావడంతో దానిని కాంగ్రెస్ వదులుకోలేదు. మహారాష్ట్రలో అధికారంలో ఉండటం అంటే చిన్న విషయం కాదు. మహారాష్ట్ర పెద్ద రాష్ట్రమే కాదు.  ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబై నగరం కూడా మహారాష్ట్రలోనే ఉంది. . దీంతో మహారాష్ట్రలో అధికారంలో ఉండటమనేది కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షమైన ఎన్సీపీకి జాక్ పాట్ లాంటిదే. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పొత్తు చాలా ఏళ్ల నుంచి ఉన్నదే. రెండూ హిందూత్వ పార్టీలే. అనేక అంశాల్లో రెండు పార్టీల వైఖరి కూడా ఒకేలా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ నుంచి లాంగ్ టైమ్ ఫ్రెండ్ శివసేనను చీల్చామని కాంగ్రెస్ గొప్పగా చెప్పుకోవడానికి లేటెస్ట్ పరిణామాలు పనికొచ్చేలా ఉన్నాయి.

కేరళలో ముస్లింలీగ్ తో పొత్తు ఉంది కదా…….

హిందూత్వకు జై కొట్టే శివసేనకు  కాంగ్రెస్ కూటమి మద్దతు ఇవ్వడంపై విమర్శలొచ్చాయి. సెక్యులర్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్, రైటిస్ట్ పార్టీ గా పేరుపడ్డ శివసేన కు ఎలా మద్దతు ఇస్తుందన్న ప్రశ్న వచ్చింది. అయితే కేరళలో ముస్లింలీగ్ తో తమకు పొత్తు ఉందన్న విషయం కాంగ్రెస్ లీడర్లు గుర్తు చేస్తున్నారు. శివసేన మత సిద్దాంతాల వల్ల  ప్రజలు ఇబ్బందులు పడ్డప్పడు మాత్రమే ఆ విషయం తాము ఆలోచిస్తామని కాంగ్రెస్ లీడర్లు వివరణ ఇచ్చారు. గతంతో పోలిస్తే  హిందూత్వ అంశంపై  కాంగ్రెస్ లో కూడా మార్పు వచ్చింది. కొన్నేళ్ల కిందటి నుంచి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో గుళ్లు , గోపురాలు తిరగడం మొదలెట్టారు. ‘సాఫ్ట్ హిందూత్వ’ పేరుతో  హిందువులకు దగ్గర కావడానికి ప్రయత్నించారు. ఈ పరిస్థితుల్లో శివసేనకు మద్దతు ఇవ్వడం వల్ల  తాము కూడా హిందువులకు దూరం కాదన్న మెసేజ్ ను కాంగ్రెస్ ఇచ్చినట్లవుతుంది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంది.  మహారాష్ట్రలో  కాంగ్రెస్ కొన్నేళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. దీంతో పార్టీ పరిస్థితులు మారిపోయాయి. లోక్ సభ ఎన్నికల తరువాత పార్టీ చీఫ్ పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయటంతో కాంగ్రెస్ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. పార్టీ నుంచి చిన్నా చితకా లీడర్ల వలసలు జోరందుకున్నాయి. దీంతో  ప్రభుత్వంలో ఉండే అవకాశం రావడంతో దానిని ఉపయోగించుకుని ప్రజలకు దగ్గరవ్వాలన్నది కాంగ్రెస్​ ఆలోచన.

ఎన్సీపీ: సొంత ఎజెండా కొరకే…

అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ వర్గం ప్రజలు ఎన్సీపీ వైపు మొగ్గు చూపారని అంచనా. బీజేపీతో పోలిస్తే  తక్కువ సీట్లు వచ్చినప్పటికీ  మరాఠా కమ్యూనిటీ ఆదరణ శరద్ పవార్ పార్టీకే ఉందంటున్నారు ఎనలిస్టులు. మరాఠాల  ప్రయోజనాలే తనకు ముఖ్యమని శరద్ పవార్ చాలా సార్లు చెప్పారు. అంతేకాదు తమది సెక్యులర్ పార్టీ అని కూడా ఆయన ఏరోజూ చెప్పుకోలేదు. దీంతో శివసేనతో కలిసి నడవటంలో  ఎన్సీపీకి ఇబ్బందులు ఉండకపోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఎన్సీపీకి సహజంగా పశ్చిమ మహారాష్ట్రలో పట్టు ఉంది. మరాఠాలతో పాటు కొన్ని ముస్లిం వర్గాల మద్దతు శరద్ పవార్ పార్టీకి  ఉంది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటే తమకు మద్దతిచ్చే వర్గాలకు మరింత దగ్గరయ్యే  అవకాశాలుంటాయని, రూట్ లెవెల్లో  పార్టీని బలోపేతం చేసుకోవచ్చని ఎన్సీపీ లీడర్లు భావిస్తున్నారు.

కారణాలేంటి ?

శివసేనకు మద్దతు ఇవ్వటానికి ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ’ (ఎన్సీపీ)కి కొన్ని కారణాలున్నాయి. మహారాష్ట్ర కో ఆపరేటివ్ సొసైటీల్లో సహజంగా ఎన్సీపీ హవా ఎక్కువగా ఉంటుంది. అనేక కో ఆపరేటివ్ సొసైటీల పాలక మండళ్లలో  శరద్ పవార్ పార్టీ నాయకులే ఉండేవా రు.  అయితే ఈ ఏడాది జనవరిలో  కో ఆపరేటివ్ సొసైటీస్ చట్టానికి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం సవరణలు చేసింది. దీంతో ఎన్సీపీ ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ అధికారంలో ఉంటేనే కోఆపరేటివ్ సెక్టార్ పై పట్టు బిగించలేమని ఎన్సీపీ అభిప్రాయపడింది. అంతేకాదు మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ  ఎన్సీపీకి ఆదరణ ఉంది. దీనిని కాపాడుకోవడానికి ప్రభుత్వంలో ఉండాలని ఎన్సీపీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వీటన్నిటికి తోడు ఈమధ్య ఎన్సీపీకి చెందిన చిన్నాచితకా లీడర్లు పార్టీకి గుడ్ బై కొట్టారు. దీంతో అధికారంలో ఉండటం తప్పనిసరి అయిన ఎన్సీపీకి తప్పనిసరి అని ఎన్సీపీ భావిస్తోంది. ఈ కారణంతో శివసేనకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంలో ఎన్సీపీ కీలకంగా వ్యవహరించింది. కొత్త ప్రభుత్వంలో పదికి పైగా మంత్రి పదవులు ఎన్సీపీకి రావొచ్చని అంచనా. అసలు అధికారమే రాదనుకున్న పరిస్థితుల్లో ఇన్ని మంత్రి పదవులు రావడమంటే ఆ పార్టీకి లక్కీ డిప్​లో ప్రైజ్​ కొట్టడంతో సమానమే.

చిత్రమైన పొత్తులు

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్​, ఎన్​సీపీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకి ముందుకు రావటం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్​లో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​, ఎన్సీపీలను తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు మళ్లీ అదే పార్టీల పంచన చేరింది. పొలిటికల్ పార్టీలు ఇలా అవకాశవాద పొత్తులు కుదుర్చుకోవటం ఇదే తొలిసారి కాదు.

మిజోరంలో: 20 మంది సభ్యులు గల ‘చక్మా అటానమస్​ డిస్ట్రిక్ట్​ కౌన్సిల్​’(సీఏడీసీ)కి పోయినేడాది ఎలక్షన్​ జరిగింది. 8 మందిని గెలిపించుకున్న ‘మిజో నేషనల్​ ఫ్రంట్’​(ఎంఎన్​ఎఫ్​) సింగిల్​ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కాంగ్రెస్​కి 7, బీజేపీకి 5 సీట్లు వచ్చాయి. పాలక మండలి ఏర్పాటుకు ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవటంతో కాంగ్రెస్​, బీజేపీ ‘యునైటెడ్​ లెజిస్లేచర్​ పార్టీ’ పేరిట కూటమి కట్టాయి. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పోటీ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్​.. లోకల్​ స్థాయిలో కలిసి నడవటం విశేషం.

జమ్మూకాశ్మీర్​లో: సిద్ధాంతాలపరంగా తీవ్రంగా వ్యతిరేకించుకునే బీజేపీ, పీడీపీ జమ్మూకాశ్మీర్​లో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం చెప్పుకోదగ్గ విషయం. పీడీపీని వేర్పాటువాద పార్టీగా విమర్శించే బీజేపీ 2014 అసెంబ్లీ ఎలక్షన్​ తర్వాత సర్కార్​ ఏర్పాటుకోసం అదే పార్టీతో పొత్తు పెట్టుకుంది. అయితే ఆ దోస్తానా చివరి దాక కొనసాగలేదు.

ఢిల్లీలో: ఆరేళ్ల క్రితం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​), కాంగ్రెస్​ కొట్లాడాయి. ఆ పార్టీలే ఎలక్షన్​ తర్వాత తిరిగి జట్టు కట్టాయి. బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచినా ఆ పార్టీని పవర్​కి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆప్​, కాంగ్రెస్​ అలా విచిత్రంగా వ్యవహరించాయి.

కర్ణాటకలో: కిందటేడాది కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినా రెండో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్​.. మూడో స్థానానికే పరిమితమైన జేడీఎస్​కి మద్దతిచ్చింది. జేడీఎస్​ నేత కుమార స్వామిని ముఖ్యమంత్రిని చేసింది. జేడీఎస్​ ఏర్పడిన నాటి నుంచి ఆ పార్టీ పెద్దలను (హెచ్​డీ దేవెగౌడ, కుమార స్వామిలను) బద్ధ వ్యతిరేకులుగా భావించిన చేయి పార్టీ బీజేపీపై వైరంతో ఆ పార్టీని అధికారానికి దూరంగా ఉంచింది.

యూపీలో: 1993 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ ఎలక్షన్​కి ముందే కూటమిగా ఏర్పడ్డ బీఎస్పీ, ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. సీఎం ములాయంసింగ్​ యాదవ్​తో గొడవలు రావటంతో బీఎస్పీ ప్రెసిడెంట్​ మాయావతి మద్దతు ఉపసంహరించుకున్నారు.