క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో శ్రీలంక మాజీ ఆటగాడు సచిత్ర సేనానాయక్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. 2020 సంవత్సరంలో.. లంక ప్రీమియర్ లీగ్ (LPL) టోర్నమెంట్ జరిగింది. ఆ పోటీల్లో ఇద్దరు ఆటగాళ్లను ప్రలోభ పెట్టి.. డబ్బులు ఇచ్చి మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేశాడని సేనా నాయక్ పై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే సచిత్ర సేనా నాయక్ ను.. సెప్టెంబర్ 6వ తేదీన అరెస్ట్ చేశారు పోలీసులు.
సేనానాయక్ ను కోర్టులో హాజరుపరచగా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. మూడు నెలలు బ్యాన్ విధించింది కొలంబో చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు. విచారణ తీరును సైతం ప్రశ్నించింది కోర్టు. దీనిపై స్పందించిన క్రికెట్ బోర్డు.. ఇప్పటికే స్పోర్ట్స్ డిపార్ట్ మెంట్, అటార్నీ జనరల్ డిపార్ట్ మెంట్ విచారణ చేపట్టినట్లు తెలిపింది.
సచిత్ర సేనా నాయక్ శ్రీలంక అంతర్జాతీయ క్రికెట్ జట్టులో కూడా ఆడాడు. 49 వన్డే మ్యాచులు, ఒక టెస్ట్ మ్యాచ్, 24 టీ 20 మ్యాచుల్లో శ్రీలంక తరపున ఆడాడు. 38 ఏళ్ల సేనా నాయక్ అప్పట్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా గుర్తింపు పొందాడు. ముత్తయ్య మురళీధరన్ తర్వాత అంతటి ఆటగాడు అంటూ ప్రచారం జరిగినా.. ఆ తర్వాత కెరీర్ లో రాణించలేకపోయాడు. వివాదాలతో జట్టుకు దూరం అయ్యాడు. ఆ తర్వాత లంక ప్రీమియర్ లీగ్ మ్యాచుల్లో ఫిక్సింగ్ చేస్తూ పట్టుబడ్డాడు.