తెలుగు, తమిళ సినిమాలలో హీరోయిన్, క్యారెక్టర్ పాత్రలను పోషించిన నటి పుష్పలత (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నటి పుష్పలత చెన్నైలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు.
మంగళవారం (ఫిబ్రవరి4న) సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. నటి పుష్పలత మృతికి చిత్ర పరిశ్రమలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ఈమె తమిళ నటుడు ఎ.వి.ఎం.రాజన్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇందులో ఒక కూతురు హీరోయిన్ గా రాణించింది. కుమార్తె మహాలక్ష్మి పలు కన్నడ సినిమాలలో నటించింది.
తెలుగు, కన్నడ, తమిళం మరియు మలయాళ భాషలలో 100కు పైగా చిత్రాల్లో నటించింది. 1950లో విడుదలైన సంసారం సినిమాలో ANR, ఎన్టీఆర్ సరసన నటించింది. ఇదే ఆమె మొదటి తెలుగు సినిమా. ఇక ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాలలో నటించారు పుష్పలత.
అందులో పెద్దకొడుకు, మేము మనుషులమే, యుగపురుషుడు, రాజపుత్ర రహస్యం, శ్రీరామ పట్టాభిషేకం, కొండవీటి సింహం, అన్నదమ్ముల అనుబంధం, మూగవాని పగ, ఉక్కుమనిషి, రంగూన్ రౌడీ, ఇద్దరు కొడుకులు, విక్రమ్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.