
పద్మారావునగర్, వెలుగు: హైకోర్టులో వాదనలు వినిపిస్తూ గుండెపోటుతో వేణుగోపాల్ రావు అనే న్యాయవాది కుప్పకూలి మరణించిన ఘటన మరువక ముందే.. మరో అడ్వకేట్ కోర్టు ఆవరణలో కుప్పకూలి చనిపోయాడు. బుధవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ కోర్టు ఆవరణలోని బ్యాంకులో ఈ ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ చిలకలగూడ ప్రాంతానికి చెందిన అడ్వకేట్ వెంకటరమణ( 57)..సికింద్రాబాద్ సివిల్ కోర్టు పనుల నిమిత్తం సమీపంలోని ఇండియన్ బ్యాంక్ (మారేడు పల్లి శాఖ)కు వెళ్లారు.
బ్యాంకులో చలాన్కట్టడానికి ఓచర్ తీసుకుంటుండగా కుప్పకూలిపోయారు. తలకు గాయం కాగా.. సమాచారం అందుకున్న మారేడు పల్లి పోలీసులు వెంటనే 108 అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అడ్వకేట్ వెంకటరమణ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వెంకటరమణ కొన్ని ఏండ్లుగా సికింద్రాబాద్ సివిల్ కోర్టు సీనియర్ అడ్వకేట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
పెద్ద కూతురు అమెరికాలో ఉండగా, రెండో కూతురుకు త్వరలో వివాహం చేయడానికి నిర్ణయించినట్లు బంధువులు తెలిపారు. కాగా హైకోర్టులో మంగళవారం జడ్జి ఎదుట వాదనలు వినిపిస్తూ కుప్పకూలి, గుండెపోటుతో అడ్వకేట్ పసునూరు వేణుగోపాలరావు చనిపోయిన విషయం విదితమే. సిటీలో వరసగా వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరిగిపోవడం కలవర పరుస్తోంది. రెండురోజుల వ్యవధిలోనే వరుసగా ఇద్దరు న్యాయవాదులు హఠాన్మరణం చెందడంపై ఆందోళన వ్యక్తం అవుతుంది.