రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునే విషయంపై బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కనీసం బలం లేని పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కొంతమంది కల్పిత వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీతో బీజేపీ పొత్తు కోసం ఆలోచిస్తోందని తరుణ్ చుగ్ మాట్లాడినట్లు వచ్చిన వార్తలు ఏమాత్రం వాస్తవం కాదని కొట్టి పారేశారు. దీని కంటే పచ్చి అబద్ధం ఏదీ లేదని తేల్చేశారు. టీడీపీతో పొత్తుకు సంబంధించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తరుణ్ చుగ్ ఇప్పటికే వివరణ ఇచ్చారని చెప్పారు. టీడీపీతో బీజేపీ పొత్తు వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గతంలో పొత్తులతోనే తాము నష్టపోయామనే అభిప్రాయం పార్టీలో చర్చ జరుగుతోందని చెప్పారు. సామాన్య కార్యకర్తలు కూడా ఇలాంటి ఆలోచన చేయడం లేదన్నారు. తప్పుడు వార్తలు రాసే సంస్థల విశ్వసనీయత పోతుందంటూ చురకలంటించారు. పొత్తులకు వెళ్లేందుకు బీజేపీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ గెలుపు ఖాయమని ఇంద్రసేనారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను ఇంటికి పంపి ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీని గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.