కేటీఆర్​ ఇలాకాలో బీఆర్ఎస్కు షాక్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో బీఆర్ఎస్‌‌కు షాక్​ తగిలింది. బలమైన పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన బీఆర్ఎస్​ సీనియర్​నేత, సెస్​ మాజీ చైర్మన్​ లగిశెట్టి శ్రీనివాస్​ శుక్రవారం బీజేపీలో చేరారు.  తొలుత సిరిసిల్ల పాత బస్టాండ్‌‌లో ఉన్న నేతన్న విగ్రహానికి పూలమాల వేసి సుమారు 500 మంది కార్యకర్తలతో 100 కార్లతో పెద్ద  కాన్వాయ్ తో హైదరాబాద్ వెళ్లారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్​ నేతృత్వంలో  ఆ పార్టీ ఆఫీస్ లో కాషాయ కండువా కప్పుకున్నారు.

కేటీఆర్‌‌‌‌కు ఎదురుదెబ్బ

బీజేపీలో లగిశెట్టి చేరికతో సిరిసిల్లలో కేటీఆర్‌‌‌‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మంత్రి కేటీఆర్​పలు సందర్భాల్లో ‘సిరిసిల్ల నాకు రాజకీయ జన్మనిచ్చింది. సిరిసిల్లలో ప్రతి కార్యకర్తను కాపాడుకుంటా’ అని చెప్పేవారు. ఈక్రమంలో కేటీఆర్ ప్రధాన అనుచరుడు, పద్మశాలీ నాయకుడు లగిశెట్టి శ్రీనివాస్ బీఆర్ఎస్‌‌ను వీడడం కేటీఆర్‌‌‌‌కు పెద్ద షాకే.  సిరిసిల్లలో ప్రధాన ఓటు బ్యాంక్ బీసీ సామాజికవర్గం.. ముఖ్యంగా పద్శశాలీలు. ఆ సామాజికవర్గానికి చెందిన కేటీఆర్​ ప్రధాన అనుచరుడు  బీజేపీలో చేరడం రూలింగ్​పార్టీలో ఆందోళన నెలకొంది. 

త్వరలోనే మరికొంతమంది

సిరిసిల్ల బీఆర్ఎస్‌‌ నుంచి మరికొంతమంది లీడర్లు, కార్యకర్తలు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. కారు ఓవర్‌‌‌‌లోడ్​కాగా.. చాలామంది లీడర్లు అసంతృప్తితో ఉన్నారు. పలు మండలాల్లోని  ఎంపీటీసీలు, సర్పంచులు లగిశెట్టితో టచ్‌‌లో ఉన్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన సెస్ ఎన్నికల్లో దాదాపు 7స్థానాల్లో బీఆర్ఎస్‌‌కు.. బీజేపీ ముచ్చెమటలు పట్టించింది. రూలింగ్​పార్టీకి, ప్రతిపక్ష బీజేపీకి మధ్య ఓట్ల తేడా కేవలం 17వేలే. దీంతో బీజేపీ సిరిసిల్లలో బలపడిందన్న సంకేతాలున్నాయి. ప్రస్తుతం లగిశెట్టి రాకతో సిరిసిల్ల బీజేపీ కార్యకర్తల్లో  నయా జోష్ ప్రారంభమైంది. 

బీసీ వర్సెస్ ఓసీ

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీసీ వర్సెస్ ఓసీ ఫైట్ నడుస్తోంది. ఇటీవల జగిత్యాల మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్  భోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే  సంజయ్​ వేధింపులతో పార్టీని వీడుతున్నా అంటూ బోరున విలపించిన విషయం తెలిసిందే.  మరోవైపు సిరిసిల్లలో లగిశెట్టి శ్రీనివాస్  రెండేండ్లుగా పార్టీగా దూరంగా ఉంటున్నారు.  బీఆర్ఎస్ లో ఆత్మగౌరవం లేకనే బీజేపీలో చేరుతున్నట్లు శ్రీనివాస్ చెప్పారు.  ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీకి బీసీలు దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సిరిసిల్లలో బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన చాలా మంది నేతలు బీజేపీలో యాక్టివ్‌‌గా ఉన్నారు. కరీంనగర్ లో బీజేపీ చీఫ్​బండి నాయకత్వంలో మున్నూరుకాపు సామాజికవర్గం బీజేపీ కి అనుకూలంగా ఉన్నారు. పెద్దపల్లిలో బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో బీజేపీ బలంగా ఉంది. 

బీఆర్ఎస్‌లో ఆత్మగౌరవం లేదు

బీఆర్ఎస్‌లో ఆత్మగౌరవం లేకనే బయటకు వచ్చాను.  బండి సంజయ్​ నాయకత్వంలో పని చేస్తాను. సిరిసిల్లలో పద్మశాలీలకు   బతుకమ్మ చీరల పేరుతో  నాలుగు నెలల పని ఇచ్చి మొత్తం ఉపాధి ఇచ్చినట్లుగా  కేటీఆర్ చెబుతున్నారు.  ఇది పూర్తిగా అబద్ధం. కేటీఆర్​సిరిసిల్లలో పద్మశాలీలకు అన్యాయం చేస్తున్నారు.  పద్మశాలీలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారు.  బండి సంజయ్​ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది.    

- లగిశెట్టి శ్రీనివాస్