గ్రేటర్ బరిలో సీనియర్లు వర్సెస్​ జూనియర్లు

గ్రేటర్ బరిలో సీనియర్లు వర్సెస్​ జూనియర్లు

ఎన్నికల బరిలో 60 ఏండ్ల పైబడినవారు 27మంది

60 % మంది వయస్సు 45 ఏండ్లలోపే..

పోటీలో 21 ఏండ్లు ఉన్నవారు 8 మంది

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ ఎన్నికల్లో సీనియర్లు, జూనియర్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. మొత్తం 1,122 మంది క్యాండిడేట్లు పోటీ చేస్తుండగా ఇందులో 60 ఏండ్ల పైబడినవారు 27 మంది ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి 12 మంది పోటీ పడుతున్నారు.75 ఏండ్లున్న కాజా సూర్యనారాయణ జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న వారిలో పెద్ద వయస్సు ఈయనదే. ఇక 21ఏండ్లున్నవారు కూడా 8 మంది బరిలో ఉన్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో 60 శాతం మంది 45 ఏండ్లలోపువారు బరిలో ఉన్నారు.  ఎక్కువ శాతం  యువకులు పోటీలో ఉండటంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.  నూతన సాంకేతికతతో యువకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు డివిజన్లను పాలించిన సీనియర్లు వారికి దీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 15 నుంచి20 డివిజన్లలో సీనియర్లు వర్సెస్​ జూనియర్లు అనే విధంగా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది.

తప్పులను చూపుతూ యువత ప్రచారం

ఎన్నికల ప్రచారంలో సీనియర్లకంటే జూనియర్స్ కొన్ని డివిజన్లలో ముందంజలో ఉన్నారు. మొదటిసారి పోటీ చేస్తున్న యువ అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ప్రచారం చేస్తున్నారు. గతంలో కార్పొరేటర్లు చేసిన తప్పులను చూపుతూ జనంలోకి వెళుతున్నారు. ఏళ్లుగా పదవిలో ఉన్నా ఏం చేయలేకపోయారని, తమకు అవకాశం ఇస్తే 24 గంటలూ అందుబాటులో ఉండి డివిజన్​అభివృద్ధి చేస్తామని ఓటర్లను వేడుకుంటున్నారు. యువ నాయకత్వాన్ని ఆహ్వానించాలని కోరుతున్నారు. సీనియర్లు తమ అనుభవాన్ని గుర్తించి గెలిపించాలని ఓట్లు అడుగుతుండగా, జూనియర్లు మాత్రం వారు కష్టపడితే స్థానికంగా ఇన్ని సమస్యలు ఉండేవి కావని, మరోసారి వారికి వారికి అవకాశం ఇచ్చినా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. దీంతో సీనియర్లు చావో రేవో అన్నట్లు అన్ని హంగులు, అర్థ బలాన్ని వినియోగిస్తున్నా రు.

ఇదే మాకు ఆఖరు.. ఆశీర్వదించండి

యువత చేతిలో ఓటమిపాలైతే తమ పేరు పోతుందని కొందరు సీనియర్లు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. ఎలాగైన గెలవాలని చూస్తున్నారు. ఏది కావాలంటే అది చేస్తామని హామీలు ఇస్తున్నారు. తమకు ఈ ఎన్నికలే ఆఖరివని, మరోసారి పోటీ చేయబోమని కొందరు సీనియర్లు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు దగ్గరగా ఉంటూ అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. ఇదే సమయంలో యువనాయకులకు అనుభవం ఉండదని, వారివల్ల అభివృద్ధి జరగదని పేర్కొంటున్నారు.

For More News..

ఇంటర్నల్ క్యాంపెయిన్​ షురూ.. వాట్సాప్​ మెసేజ్, ఫేస్​బుక్​‌లే కీలకం

గ్రేటర్ బెట్: ఏ పార్టీకి ఎన్ని సీట్లోస్తయ్.. రూ. 2 వేల నుంచి రూ. 10 లక్షల దాకా బెట్టింగ్

బీజేపీ క్యాండిడేట్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి!