పది రూపాయల కోసం లొల్లి..రిటైర్డ్ ఐఏఎస్​పై కండక్టర్ దాడి

జైపూర్ : సీనియర్ సిటిజన్, రిటైర్డ్​ఐఏఎస్ అధికారిపై బస్‌ కండక్టర్ దాడి చేసిన ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో చోటుచేసుకుంది. బస్సు ఆగిన స్టేజీ వివరాలు చెప్పాల్సిన కండక్టర్ ఆ విషయం పట్టించుకోకపోవడంతో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన మీనా తాను దిగాల్సిన స్టాప్ లో దిగలేకపోయాడు. ఆ స్టాప్ దాటిపోవడంతో తర్వాతి స్టాప్ లో దిగాలని చెప్పిన కండక్టర్ ఘనశ్యామ్ శర్మ.. అందుకు రూ.10 ఇచ్చి టికెట్ తీసుకోవాలని అన్నాడు. దీనికి మీనా నిరాకరించాడు. బస్సు ఆగిన స్టేజీ పేరు చెప్పలేదు కాబట్టి కండక్టర్ దే తప్పని.. అతడి తప్పుకు తానెందుకు డబ్బు చెల్లించాలని ప్రశ్నించాడు. దీనిపై మాటామాటా పెరిగింది. మీనాను కండక్టర్ నెట్టివేయగా.. మీనా కోపం పట్టలేక కండక్టర్ చెంపపై కొట్టాడు.

దీంతో రెచ్చిపోయిన కండక్టర్.. మీనాపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తోటి ప్రయాణికులు ఆపినా ఆగకుండా, వృద్ధుడని కూడా చూడకుండా పిడిగుద్దులు కురిపించాడు. బస్సులోనే ఉన్న ఓ ప్రయాణికుడు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. తనపై జరిగిన దాడిపై కనోటా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు.. సదరు కండక్టర్ ను గుర్తించామని, విచారణ జరుపుతున్నామని వివరించారు. కాగా, విశ్రాంత ఐఏఎస్ పై దాడి చేసిన కండక్టర్ ను సస్పెండ్ చేసినట్లు జైపూర్ సిటీ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ పేర్కొంది.