ముంబై : ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ సైబర్ మోసానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిజ్జా, డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేసిన వృద్ధురాలు దాదాపు రూ. 11 లక్షలు పోగొట్టుకుంది. బ్యాంక్ అకౌంట్ నుంచి తనకు తెలియకుండానే భారీ మొత్తం డ్రా అయినట్లు తెలుసుకున్న ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముంబై సబర్బన్ అంధేరీకి చెందిన ఓ వృద్ధురాలు గతేడాది జులైలో ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేసింది. దాదాపు రూ. 9,999 ఆమె ఖాతా నుంచి డెబిట్ అయినప్పటికీ ఆర్డర్ మాత్రం రాలేదు. అక్టోబర్ 29న మరోసారి ఆన్లైన్లో డ్రై ఫ్రూట్ ఆర్డర్ చేయగా రూ.1,496లు అకౌంట్ నుంచి కట్ అయ్యాయి. కానీ ఆర్డర్ చేసిన డ్రై ఫ్రూట్స్ మాత్రం అందలేదు. దీంతో గూగుల్లో వెతికిన ఆమెకు కాల్ సెంటర్ నెంబర్ దొరికింది. సదరు నెంబర్కు ఫోన్ చేయగా.. సైబర్ నేరగాడు ఆ మొత్తం తిరిగి అకౌంట్ లోకి రావాలంటే ఓ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించాడు. అతను చెప్పినట్లుగానే యాప్ డౌన్ లోడ్ చేసుకున్న సదరు మహిళ బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు పాస్వర్డ్ను ఆ కేటుగాడికి చెప్పింది. అకౌంట్ వివరాలన్నీ తెలుసుకున్న సైబర్ నేరగాడు త్వరలోనే డబ్బులు తిరిగి వస్తాయని ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత గతేడాది నవంబర్ 14 నుంచి డిసెంబర్ 1 మధ్య ఆమె ఖాతా నుంచి రూ.11 లక్షల 78 వేలు మాయం చేశాడు. తన అకౌంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బు విత్ డ్రా అయినట్లు శనివారం గుర్తించిన వృద్ధురాలు బీకేసీ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ 420తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి..