70 ఏళ్లు పైబడిన వారికి గుడ్ న్యూస్.. రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స

70 ఏళ్లు పైబడిన వారికి గుడ్ న్యూస్.. రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స

70 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఆయుష్మాన్ భారత్ (పీఎం జన్ ఆరోగ్య యోజన) కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తామని తెలిపింది. బుధవారం(సెప్టెంబర్ 11) ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వంఈ నిర్ణయం తీసుకుంది.

క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు యూనివర్సల్ హెల్త్ కవరేజీ, ఆయుష్మాన్ భారత్ పీఎం జన్ ఆరోగ్య యోజన కింద వర్తింపజేయాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. 

"ఇది చాలా పెద్ద నిర్ణయం. మానవతా దృక్పథం తీసుకున్నాం. 70 ఏళ్లు పైబడిన వారికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ఇది దేశంలోని దాదాపు 4.5 కోట్ల కుటుంబాలకు వర్తిస్తుంది. ఇందులో దాదాపు 6 కోట్ల మంది సీనియర్లు ఉన్నారు.." అని అశ్విని వైష్ణవ్ అన్నారు. 

కాగా ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా (AB PMJAY) పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో  ప్రారంభించారు. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు వైద్యసేవలు ఉచితం.