- ఉత్సాహంగా ఆటలు, పాటలు, డ్యాన్సులు
- 25 ఓల్డేజ్ హోమ్స్ నుంచి 300 మంది రాక
హైదరాబాద్ సిటీ, వెలుగు: పిల్లలు పట్టించుకోక కొందరు.. ఛీత్కారాలు, చీదరింపులతో ఇంకొందరు.. మానసిక ప్రశాంతత కోసం ఇంట్లో ఉండలేక మరికొందరు.. ఇలా పలు కారణాలతో చాలా మంది వృద్ధులు ఓల్డ్ ఏజ్హోమ్స్లో చేరుతుంటారు. వీరికి బయటి ప్రపంచం తెలియదు. కష్టాలు, కన్నీళ్లు ఏమున్నా.. ఆ నాలుగ్గోడల మధ్యే. అలాంటి వారు ఆదివారం దుండిగల్‌లో జరిగిన పెద్దల జాతరలో ఉత్సాహంగా గడిపారు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను.
హరి హరి, గున్న గున్న మామిడి పాటలకు డ్యాన్సులు చేసి ఆనందంగా గడిపారు. కాంపిటీషన్స్, గేమ్స్, యాక్టివిటీస్, స్టేజ్ఫర్మామెన్స్, స్పోర్ట్స్...ఇలా ఇరవై రకాల ఆటలతో ఈ ఆదివారాన్ని అద్భుతంగా మలుచుకున్నారు. బెంగళూరుకు చెందిన ‘వీ ద వలంటీర్స్’(వీటీవీవో) హైదరాబాద్ లో పెద్దల జాతర పేరుతో ఓల్డేజ్హోమ్స్లో ఉండే సీనియర్సిటిజన్స్ను ఒక్క చోటికి చేర్చింది. దుండిగల్బౌరంపేటలోని శిఖర ఇంటర్నేషనల్‌స్కూల్ ఫెస్ట్ నిర్వహించగా, 60 ఏండ్ల వృద్ధులంతా చిన్న పిల్లలై జోష్‌గా గడిపారు.
25 హోమ్స్.. 300 మంది సీనియర్ సిటిజన్స్
సిటీలోని దాదాపు 25 ఓల్డేజ్హోమ్స్నుంచి 300 మంది సీనియర్సిటిజన్స్పెద్దల జాతరకు వచ్చారు. వీటీవీవోకు చెందిన 400 మంది వలంటీర్లు వారిని హోమ్స్నుంచి బస్సుల్లో తీసుకువచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వారిని ఉత్సహపరిచేలా డ్యాన్సులు చేయించారు. పాటలు పాడించారు. డ్రాయింగ్స్వేయించారు. నెయిల్‌పాలిష్, లిప్ స్టిక్పెట్టడంతో కొంతమంది బామ్మలు సిగ్గుపడిపోయారు. ముగ్గుల పోటీలు, చెస్, స్పూన్బాల్, పాట్పెయింటింగ్ లాంటి గేమ్స్‌తో ఉత్సాహపరిచారు. ఇందులో గెలుపొందినవారికి మెడల్స్ఇచ్చి ప్రోత్సహించారు. వలంటీర్లను చూస్తే తమకు తమ మనువరాళ్లు, మనవళ్లు గుర్తుకొస్తున్నారని, మరికొందరు తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని సంబురపడిపోయారు.
చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి..
ఓల్డేజ్ హోమ్‌లో చేరి ఏడాదవుతోంది. అక్కడ నేను వీల్ చైర్‌కే పరిమితం. చాలా రోజుల తర్వాత ఈ రోజే ఈ ప్రొగ్రాం వల్ల బయటకు వచ్చా. ఈ కార్యక్రమం నాలో నిరుత్సాహాన్ని దూరం చేసింది. అందరూ చిన్నపిల్లలై ఆడిపాడారు. నేను చాలా ఆనందంగా ఉన్నా. పాట్ పెయిటింగ్‌లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి.
– లీలావతి, రాజేశ్వరి ఓల్డేజ్ హోమ్, కూకట్ పల్లి
వాళ్ల ఆటలు..పాటలు ఎనర్జీ ఇచ్చింది.
నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి వీటీవీవోలో వలంటీర్‌గా చేరా. మార్నింగ్ బస్సు దిగినప్పటి నుంచి వీళ్లంతా నవ్వుతూనే ఉన్నారు. వాళ్ల డ్యాన్సు, ఆటలు పాటలు మాకు ఎనర్జీ ఇస్తాయి. ఇంకా వారి కోసం పని చేయాలనే తపన కలిగిస్తాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్‌లో వలంటీర్‌గా పని చేయడం నా అదృష్టం.
– లావణ్య, వలంటీర్, కొండాపూర్
వారి ఆనందం కోసం మరిన్ని కార్యక్రమాలు చేస్తం
వృద్ధుల కళ్లల్లో ఆనందం చూడడానికి వీద వలంటీర్స్ సంస్థను 2012లో బెంగళూరులో ప్రారంభించాం. వారితో పాటు పిల్లల్లో కూడా ఉత్సాహాన్ని పెంచడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు చెన్నై, బెంగళూరులో నిర్వహించాం. ఆదివారం సిటీలో కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సీనియర్ సిటిజన్స్ వారి కష్టాలు మరిచి ఆనందంగా గడిపేలా చేయడమే మా ప్రయత్నం. ఈ విషయంలో ఈ రోజు మేము సక్సెస్ అయ్యాం అనుకుంటున్నాం. మున్ముందు మరిన్ని హోంలతో కలిసి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తం.
– సురేంద్రన్ ఎం. కృష్ణన్,
వీ ద వలంటీర్స్ వ్యవస్థాపకుడు