బెంగళూరు సిటీలో నైటింగేల్స్ మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది. ఈ జాబ్ మేళా విశేషం ఏంటంటే.. 60 ఫ్లస్.. అంటే సీనియర్ సిటిజన్స్ స్పెషల్. లాంగ్ ఫోర్ట్ రోడ్ లోని సెయింట్ జోసెఫ్ యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు ఎవరు వస్తారులే అనుకున్నారు.. నిర్వహకుల అంచనాలకు భిన్నంగా.. అక్షరాల 13 వందల మంది సీనియర్ సిటిజన్స్ ఉద్యోగాల కోసం క్యూ కట్టారు. తమ తమ రెజ్యూమ్ అప్ డేట్ చేసుకుని.. ఇప్పటికీ మాకు సత్తా ఉంది.. ఉద్యోగం చేస్తామంటూ తరలివచ్చారు.
ఈ జాబ్ మేళాలో ఇంజినీరింగ్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, సూపర్ వైజరీ, సెక్యూరిటీ వంటి వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఊహించని విధంగా వెయ్యి ఉద్యోగాలు ఇస్తామంటూ.. ఏకంగా 72 కంపెనీలు ముందుకు రావటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక సీనియర్ సిటిజన్స్ సైతం 13 వందల మంది వచ్చారు. ఆయా కేటగిరీ కింద క్యూలో నిల్చొని మరీ తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
సీనియర్ సిటిజన్స్ గా హాయిగా ఇంట్లో ఉండొచ్చు కదా.. మళ్లీ ఉద్యోగం ఎందుకు చేయాలి అని అనుకుంటున్నారు అంటూ చాలా మందిని ప్రశ్నించగా.. ఒక్కొక్కరూ ఒక్కో దీన గాధ చెప్పుకొచ్చారు... అందులో కొన్ని మీ కోసం..
Also Read :- ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు
>>> నేను ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ రిటైర్ అయ్యాను. నా కొడుకు, కుమార్తెపై ఆధారపడటం ఇష్టం లేదు.. అందుకే ఏదో ఒక ఉద్యోగం చేయాలని ఈ జాబ్ మేళాకు వచ్చాను ఓ సీనియర్ సిటిజన్ చెప్పుకొచ్చారు.
>>> నా భర్త ఓ ఆప్టికల్ షాపులో పని చేస్తూ రిటైర్ అయ్యారు.. నేను కూడా ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేశాను.. మాకు పిల్లలు లేరు.. ఇప్పుడు ధరలు పెరిగిపోయాయి.. ఇంటి ఖర్చుల కోసం మళ్లీ ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాం అని 63 ఏళ్ల మహిళ తమ బాధలు వివరించింది.
>>> నా వయస్సు 66 ఏళ్లు.. నేను ప్రభుత్వ టీచర్ గా రిటైర్ అయ్యాను.. ఆర్థికంగా ఇబ్బంది లేకున్నా.. ఇంట్లో ఖాళీగా కూర్చోలేకపోతున్నాను..ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని.. ఏదో ఒక పని చేయాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళాకు వచ్చాను అని వివరించారు మరో సీనియర్ సిటిజన్.
>>> మేం ఇద్దరు సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ రిటైర్ అయ్యాం. సామాజిక బాధ్యత, సామాజిక కోణంలో పని చేసే సంస్థల్లో పని చేయాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళాకు వచ్చాం అని ఇద్దరు రిటైర్డ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు చెప్పటం విశేషం.
>>> నేను ఓ ప్రైవేట్ కంపెనీలో 25 ఏళ్లు పని చేసి రిటైర్ అయ్యాను.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మళ్లీ ఉద్యోగానికి వచ్చాను అని మరో సీనియర్ సిటిజన్ చెప్పుకొచ్చారు.
ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణంగా మళ్లీ ఉద్యోగం చేయాలని సీనియర్ సిటిజన్స్ ఉత్సాహం చూపటం విశేషం. జాబ్ మేళాకు వచ్చిన 13 వందల మందిలో.. 80 శాతం మంది ప్రైవేట్ కంపెనీల్లో పని చేసి రిటైర్ అయిన వారే అని.. ఆర్థిక పరిస్థితుల కారణంగా మళ్లీ ఉద్యోగం చేయాలని భావిస్తున్నట్లు నిర్వహకులు వెల్లడించారు.
అన్నీ బాగానే ఉన్నా.. ఆయా కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు చేసిన వారికి మాత్రం ఇది పెద్ద సవాల్ గా మారింది. వారి అనుభవం.. వారి వ్యవహారశైలి.. వారి వయస్సు రీత్యా.. ఈ నాటి యంగ్ హెచ్ఆర్ లు ఇంటర్వ్యూను చాలా కష్టంగా పూర్తి చేసినట్లు ఓ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు.
2011 నుంచి నైటింగేల్స్ మెడికల్ ట్రస్ట్ సీనియర్ సిటిజన్స్ కు జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉంది. ఇప్పటి వరకు 3 వేల 500 మందికి ఉద్యోగాలు ఇప్పించింది. 2024, ఆగస్ట్ 25వ తేదీ ఆదివారం నిర్వహించిన జాబ్ మేళా మాత్రం చాలా స్పెషల్.. ఎందుకంటే.. ఏకంగా 13 వందల మంది హాజరుకావటం అనేది ఇదే ఫస్ట్ అంటున్నారు. యంగ్ ఇండియాకు ధీటుగా.. సీనియర్ సిటిజన్స్ జాబ్ మేళాకు తరలిరావటం చూస్తుంటే.. ఆర్థిక ఇబ్బందులు.. ఆత్మగౌరవం సమస్య తీవ్రంగా ఉన్నట్లు స్పష్టం అవుతుందని.. ఆ ట్రస్ట్ నిర్వహకుల్లో ఒకరు వ్యాఖ్యానించారు.