15 లక్షలు కడితే.. 10వేల చొప్పున పెన్షన్

15 లక్షలు కడితే.. 10వేల చొప్పున పెన్షన్
  • 2020 మార్చి 31 వరకు PMVVY గడువు

కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. రిటైర్మెంట్ తర్వాత వారి సొమ్ముకు సరైన భద్రత.. మంచి వడ్డీ, సురక్షితమైన రిటర్న్స్‌తో ఓ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రధాన మంత్రి వయా వందన యోజన స్కీంను 2017 మే4న ప్రారంభించింది. దీనిలో 2020 మార్చి 31 వరకు ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తూ 2018-19 బడ్జెట్ సమయంలో కేంద్రం ప్రకటన చేసింది. దీని ప్రకారం వృద్ధులు వాళ్ల శక్తి కొద్ది గరిష్ఠంగా 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టి 10 ఏళ్ల పాటు పెన్షన్ రూపంలో రిటర్నులు పొందవచ్చని పేర్కొంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ద్వారా కేంద్రం ఈ స్కీమ్‌ను అందిస్తోంది. కనీసం లక్షా 50 వేల నుంచి గరిష్ఠంగా 15 లక్షల వరకు వృద్ధులు ఈ స్కీంలో తమ సొమ్ము పెట్టుకోవచ్చు. ఈ సొమ్మును ఒకసారి ఆన్‌లైన్ ద్వారా LICలో పెట్టిన తర్వాతి నెల నుంచే రిటర్నులు పొందొచ్చు.

స్కీం రూల్స్:

  • కనీస వయసు: 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ ఎంతైనా ఉండొచ్చు.
  • పాలసీ పరిమితి: పదేళ్లు మాత్రమే.
  • స్కీం తీసుకోవడానికి ఎంత మొత్తం ఉండాలి: రూ.లక్షా 50 వేల నుంచి 15 లక్షల వరకు ఎంతైనా ఓకే.
  • వడ్డీ రేటు: మార్కెట్ రేట్లతో సంబంధం లేకుండా పదేళ్ల పాటు ఏడాదికి 8 శాతం చొప్పున వడ్డీ వస్తుంది.

రిటర్న్ ఎలా: కనీసం నెలకు రూ.1000, మూడు నెలలకోసారి అయితే 3000, ఆరు నెలలకోసారి అయితే 6000, ఏడాదికోసారైతే రూ.12000 రిటర్న్ పొందవచ్చు.

అదే గరిష్ఠంగా అయితే రూ.10 వేలు, రూ.30 వేలు, రూ.60 వేలు, రూ.1,20,000 చొప్పున పెన్షన్ పొందవచ్చు. నెలా, మూడు నెలలకు, ఆరు నెలలకు, లేదా ఏడాదికోసారి ఎలా కావాలని పెన్షన్ కోరుకుంటే అలా చెల్లిస్తుంది ప్రభుత్వం.

డెత్ బెనిఫిట్: పాలసీ టర్న్ పూర్తయ్యే లోపు పెన్షనర్ మరణిస్తే పెట్టుబడి పెట్టిన మొత్తం సొమ్ము వెనక్కి వస్తుంది.

మెచ్యూరిటీ అమౌంట్: పెన్షనర్ పదేళ్ల తర్వాత జీవించి ఉంటే పెట్టుబడి పెట్టిన మొత్తం సొమ్ముతో పాటు చివరి విడత రిటర్న్ కూడా పొందవచ్చు.

లోన్ సౌలభ్యం: పాలసీ తీసుకున్న తర్వాత మూడేళ్లు నిండితే పెన్షనర్ లోన్ కూడా పొందవచ్చు. 75 శాతం సొమ్ము రుణంగా తీసుకోవచ్చు. పెన్షన్‌గా వచ్చే రిటర్న్ నుంచే లోన్ వడ్డీని మినహాయించుకుంటారు.

క్యాన్సిల్ చేసుకునే అవకాశం: పాలసీ కండిషన్లు నచ్చకపోతే పెన్షనర్ స్కీం తీసుకున్న 15 రోజుల్లోగా దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుని ఉంటే 30 రోజుల వరకూ ఈ అవకాశం ఉంటుంది. స్టాంప్ చార్జీలు లాంటివి మినహాయించుకుని మిగిలిన సొమ్మును ఎల్ఐసీ తిరిగి ఇస్తుంది.

అనారోగ్యం వస్తే మెచ్యూరిటీకి ముందే కట్టిన సొమ్ము వెనక్కి కావాలని అనుకుంటే 98 శాతం డబ్బు వెనక్కి వస్తుంది.

సవరణ: పోస్టులో వచ్చిన తప్పును సవరిస్తూ ఈ పోస్టును ప్రచురిస్తున్నాము.