విద్యార్థులకందిస్తున్న భోజనాన్ని చూసి సీనియర్ సివిల్ జడ్జి ఆగ్రహం

విద్యార్థులకందిస్తున్న భోజనాన్ని చూసి  సీనియర్ సివిల్ జడ్జి ఆగ్రహం

‘జైళ్లలో ఇంతకంటే నాణ్యమైన భోజనం అందిస్తారు..మీ ఇంట్లో పిల్లలకు ఇలాంటి భోజనమే పెడతారా’ ? అంటూ సిబ్బందిపై రంగారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలకంటే ఇక్కడ దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. మరోసారి గురుకులాన్ని తనిఖీ చేస్తానని..మళ్ళీ పరిస్థితులు ఇలాగే ఉంటే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని విద్యారణ్యపురి గురుకులంలో గురువారం విద్యార్థులకు పెట్టిన పొంగల్​(బ్రేక్​ఫాస్ట్)​లో కప్ప వచ్చింది. దీనిని తిన్న 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.  ఈక్రమంలో.. సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి గురుకులానికి వెళ్లి తనిఖీ చేశారు.

విద్యార్థులకు ఆహారాన్ని అందించే డైనింగ్ హల్, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కల్పిస్తున్న సౌకర్యాలను..పుడ్ మెనూ.. బోధనా విధానాలపై సిబ్బందిని ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని చూసి ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. విద్యారణ్యపురి గురుకులంలో 600 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉదయం 11 గంటల తర్వాత ఈ విషయం బయటకు పొక్కడంతో తహశీల్దార్​రాంబాబు స్కూల్​ను సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఘటనకు కారణమైన వంట సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రిన్సిపాల్​వేణుగోపాల్ ​వెల్లడించారు.