రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి: రాహుల్ గాంధీ

రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి: రాహుల్ గాంధీ
  • గత పదేండ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయి: రాహుల్​గాంధీ 
  • ప్రజలను సామాజిక మాధ్యమాలు, రాజకీయాలు విడదీస్తున్నాయి 
  • మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారు..ప్రతిపక్షాన్ని అణచివేస్తున్నరు..  
  • పాత ఆలోచనలు వదిలేయాలి.. కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలి
  • అందరికీ అవకాశాలు కల్పించే ఆశయంతో ప్రపంచాన్ని నిర్మిద్దాం
  • ఉగ్రదాడికి వ్యతిరేకంగా మాతో కలిసి నిలబడినందుకు కృతజ్ఞతలు
  • భారత్​ సమిట్-2025​లో కాంగ్రెస్​ అగ్రనేత ప్రసంగం

హైదరాబాద్, వెలుగు : రాజకీయాల్లోకి కొత్తతరం రావాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్​సభ  ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ ఆకాంక్షించారు. అప్పుడే కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చి, దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పారు. హైదరాబాద్​లోని హెచ్ఐసీసీలో  నిర్వహిస్తున్న భారత్​ సమ్మిట్–2025 సదస్సులో శనివారం రాహుల్​గాంధీ పాల్గొని, ప్రసంగించారు.  ప్రపంచవ్యాప్తంగా పాలిటిక్స్​, మీడియా, సోషల్ మీడియా, ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు.‘‘పదేండ్ల క్రితం రాజకీయ సాధనాలు ఇప్పుడు పనిచేయడం లేదు. ఆధునిక మీడియా, సోషల్ మీడియా, ధనికుల ప్రభావాన్ని ఎదుర్కోవడం సాధ్యం కావడం లేదు. పాత రాజకీయవేత్త మరణించాడు. కొత్త రకం రాజకీయ నాయకుడిని సృష్టించాల్సిన సవాల్​ మన ముందుంది. మనం పాత ఆలోచనలను వదిలేసి, కొత్తగా కలిసి పనిచేసే ఆలోచనలతో ముందుకు వెళ్లాలి’’ అని అన్నారు. ఈ కొత్త శకంలో విద్య, ఆరోగ్యం, అంతరిక్ష పరిశోధనల్లో కొత్త ఆవిష్కరణలు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ వంటి అంశాలపై కొత్త ఆలోచనలు రావాలని  సూచించారు.

ప్రజల మాటలు వినడంలో లీడర్లు ఫెయిల్​

 సామాజిక మాధ్యమాలు, రాజకీయాలు ప్రజలను విడదీస్తున్నాయని రాహుల్​ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ రోజు మనం కలుస్తున్న ప్రపంచం రోజురోజుకూ విడిపోతున్నది. రాజకీయాలు, మీడియా, సామాజిక మాధ్యమాలు ప్రజల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి.  రాజకీయాలు మారడం, మీడియా, సామాజిక మాధ్యమాల్లో అధికారం ఒకచోట చేరడం.. బహిరంగంగా మాట్లాడే అవకాశాలు తగ్గిస్తున్నాయి. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నాయి. ఇవన్నీ కలిసి  ప్రతిపక్షాన్ని సంభాషించడం ఆపేసి.. ద్వేషించడం,  అణచివేయడంపై దృష్టి పెడుతున్నాయి.  అయినా, నేను ఒక కొత్త ఉద్యమం పుట్టుకొస్తుందని నమ్ముతున్నా. అది జాలి, ఒక్కటవడం, ప్రజల మాట వినడంపై ఆధారపడిన ఉద్యమం” అని రాహుల్​ గాంధీ పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ప్రజలు చెప్పాలనుకుంటున్న దాన్ని వినడంలో విఫలమయ్యారని అన్నారు. ఈ విషయాన్ని తాను జోడో యాత్ర ద్వారా తెలుసుకున్నట్లు వివరించారు. ‘‘2023 కంటే ముందు  కాంగ్రెస్ పార్టీ పూర్తి ఒంటరిగా, ఆంక్షల్లో చిక్కుకున్నట్లు అనిపించింది. కొత్త రాజకీయాలు దూకుడుగా మారాయి. ప్రతిపక్షంతో సంభాషణ కాదు, దాన్ని అణచివేయడమే లక్ష్యంగా మారింది. మీడియా, సామాజిక వాతావరణం మమ్మల్ని మా విధంగా పనిచేయనివ్వలేదు. అందుకే మేం చరిత్రలోకి వెనక్కి వెళ్లి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడవాలని నిర్ణయించాం’’ అని రాహుల్ వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు కన్యాకుమారి నుంచి సుమారు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు గుర్తు చేసుకున్నారు. పాదయాత్రకు ముందు చాలా ఆలోచించానని, అయితే, మొదలు పెట్టిన తర్వాత వెనకడుగు వేయలేదని అన్నారు. ఆ తర్వాత లక్షల మంది తనతో కలిసి నడవడం మొదలు పెట్టినట్లు చెప్పారు.

అందరం ఒక్కటవుదాం..

జోడో యాత్ర సందర్భంగా తనకు ఒక చిన్నారి ఐ లవ్​ యూ అని చెప్పిందని, తాను కూడా ఐ లవ్​ యూ టూ అని చెప్పానని రాహుల్​గాంధీ గుర్తు చేసుకున్నారు. ఇలా తనతో ప్రేమను పంచుకున్న వారందరికీ తిరిగి చెప్పానని,  ప్రేమ, ఆప్యాయతను ప్రజలతో పంచుకోవడం మొదలు పెట్టానని తెలిపారు. పాదయాత్రలో అనేక మందిని కలిసిన తర్వాత విద్వేషపు బజారులో ప్రేమ దుకాణాన్ని తెరిచాననే స్లోగన్ తీసుకున్నానని చెప్పారు. ‘‘ఈ రోజు నేను కలిసే ప్రతి వ్యక్తితో.. నీ మాట వింటున్నాను, నీవు నాకు ముఖ్యమని చెబుతున్నాను. ఈ చిన్న సంబంధం సమాజాలను మార్చగలదు” అని రాహుల్​ గాంధీ తెలిపారు.  ‘‘సామాజిక మాధ్యమాలు,  రాజకీయాలు తరచూ విడిపోవడాన్ని, భయాన్ని, కోపాన్ని పెంచుతాయి. కానీ, జాలి, అర్థం చేసుకునే మనసు ఉండేలా మనం తయారు చేయాలి.   మా జోడో యాత్ర ఉద్యమం  ప్రజలు ఒక్కటైతే ఎంత పెద్ద సమస్యలనైనా గెలవగలరని చూపించింది.  ఇది ఒక నాయకుడి గురించి కాదు.. ఒక దేశం గురించి కాదు.. ఇది మన అందరి గురించి. ప్రతి వ్యక్తి.. వారెవరైనా వినబడాలి.. విలువైనవారిగా గౌరవించబడాలి.. అప్పుడే  ఎన్ని సమస్యలు ఎదురైనా, న్యాయం, సమానత్వంతో కూడిన రేపటిని నిర్మించగలం.  అధికారం లేదా డబ్బు కోసం కాక, అందరికీ అవకాశాలు కల్పించే ఆశయంతో కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం. విడిపోయే రాజకీయాలను వదిలేసి, ఒక్కటవడం అనే ఆలోచనను స్వీకరిద్దాం” అని అని  రాహుల్​ గాంధీ పిలుపునిచ్చారు. ‘‘కొన్ని రోజుల కింద జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా మాతో కలిసి నిలబడినందుకు కృతజ్ఞతలు. మొదటి రోజే (శుక్రవారం)  నేను ఇక్కడ ఉండాలి.  కానీ ఉగ్రవాదుల దాడిలో  గాయపడిన కొందరిని కలవడానికి వెళ్లాల్సి వచ్చింది. వారి ధైర్యం నన్ను ఆకర్షించింది. ప్రపంచం నలుమూలల నుంచి మాకు అందిన మద్దతుకు కృతజ్ఞతలు” అని సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులనుద్దేశించి రాహుల్​గాంధీ వ్యాఖ్యానించారు.


జోడో యాత్ర నన్ను పూర్తిగా మార్చేసింది

జోడో యాత్ర తనను పూర్తిగా మార్చేసిందని రాహుల్​ గాంధీ తెలిపారు. ‘‘నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల మాటలు వినడం కంటే మాట్లాడటానికే ప్రాధాన్యత ఇచ్చా. కానీ యాత్ర సమయంలో 'వినడం' అంటే ఏమిటో నేర్చుకున్నా. యాత్రలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశా. యాత్ర ప్రారంభంలో నా మనసులో సంభాషణలు కొనసాగుతూ ఉండేవి. క్రమేణా అవి నిశ్శబ్దంగా మారి ఎదుటివారు చెప్పేది మాత్రమే వినడం అలవాటైంది” అని పేర్కొన్నారు. సమాజంలో సానుభూతి, ప్రేమ, కరుణ వంటి విలువలు పరివర్తనను తీసుకొస్తాయని చెప్పారు. ‘‘జోడో యాత్ర సందర్భంగా  ఒక మహిళ నాతో చెప్పుకున్న సమస్య నన్ను ఎంతగానో కదిలించింది.  ఒక మహిళ భయం నిండిన కళ్లతో నా వద్దకు వచ్చింది. తన భర్త నుంచి ఇంట్లో హింసను ఎదుర్కొంటున్నానని చెప్పింది.  తన సమస్యను  చెప్పడానికి వచ్చానని అన్నది. ‘నీవు ఏం చేయాలనుకుంటున్నావు’ అని అడిగితే, ‘ఈ హింస జరుగుతోందని అందరూ తెలుసుకోవాలి’ అని ఆమె అన్నది. ఆ క్షణంలో ఆమె, మౌనంగా బాధపడుతున్న లక్షల మహిళల గొంతుకగా నాకు కనిపించింది”అని  రాహుల్​ గాంధీ తెలిపారు.