
- ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం విమర్శ
- దీక్ష పేరుతో నిమ్స్‌లో డ్రామా ఆడిండు
- ఆయన కూతురు కవిత పక్కనే కూర్చుని జ్యూస్ ఇచ్చేదని ఎద్దేవా
ఖైరతాబాద్, వెలుగు: ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ప్రాణ త్యాగం చేస్తే.. కేసీఆర్ కుటుంబం దాని ఫలితాన్ని అనుభవించిందని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్‌నేత గజ్జెల కాంతం చెప్పారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా ప్రాణాత్యాగం చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, తెలంగాణ ఉద్యమకారుల సంఘం, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన ఫొటోకు నివాళులర్పించారు.
అనంతరం గజ్జెల కాంతం మాట్లాడుతూ.. కేసీఆర్ నిరాహార దీక్ష పేరుతో అప్పట్లో నిమ్స్‌లో డ్రామా ఆడారని విమర్శించారు. ఆయన కూతురు కవిత పక్కనే కూర్చుని జ్యూస్ఇచ్చేదని.. ఆ తతంగం పూర్తయ్యేవరకు లోపలకు ఎవరినీ వెళ్లనిచ్చేవారు కాదని ఆరోపించారు. ప్రజల త్యాగాల ఫలితంతోనే తెలంగాణ సిద్ధించిందన్నారు. అధికారంలో ఉన్న పదేండ్లు కేసీఆర్కుటుంబం రూ.3లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. ఆయన కూతురు, కొడుకు, అల్లుడు వేలాది ఎకరాలు కూడగొట్టుకున్నారని మండిపడ్డారు.
ప్రాణ త్యాగం చేసేందుకు శ్రీకాంతాచారికి పెట్రోలు, అగ్గిపెట్టె దొరికితే.. హరీశ్‌రావుకు పెట్రోలు మాత్రమే దొరికిందని ఎద్దేవా చేశారు. ఎస్సీ కార్పొరేషన్మాజీ చైర్మన్పిడమర్తి రవి మాట్లాడుతూ.. కేవలం కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణ తెచ్చిందన్నట్టు సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులతోనే తెలంగాణ వచ్చిందన్నారు.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని, ఉద్యమకారులకు ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సమావేశంలో జైగౌడ సంఘం అధ్యక్షుడు వట్టికూర రామారావుగౌడ్, రజక సంఘం అధ్యక్షుడు ముప్పు భిక్షపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ గుడిపల్లి రవి, ఓయూ జేఏసీ నాయకులు రహీం, బద్రి, దర్శనం జాన్, బోరెల్లి సురేశ్, తదిరులు పాల్గొని మాట్లాడారు.
శ్రీకాంతాచారి ఫొటోకు నివాళి
ముషీరాబాద్: ఆత్మ బలిదానంతో శ్రీకాంతాచారి తెలంగాణలో ఉద్యమ జ్వాలను రగిలించారని బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి చెప్పారు. మంగళవారం సైనిక్‌పురిలోని జేఏసీ ఆఫీసులో శ్రీకాంతాచారి వర్ధంతి నిర్వహించారు. గణేశ్‌చారి పాల్గొని శ్రీకాంతాచారి ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి మంటల్లో కాలిపోతుంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గుండెలు పగిలాయన్నారు. అతని త్యాగం మరువలేనిదన్నారు. శ్రీకాంతాచారి తల్లిదండ్రుల్లో ఒక్కరికైనా ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని కోరారు.