- పదేండ్లుగా ప్రధాని ఎన్నడూ నిజం మాట్లాడలేదు: జైరామ్ రమేశ్
- దేశం ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోరుకుంటున్నది
- కాంగ్రెస్ పార్టీ వాటినే ప్రజల ముందు పెట్టిందని వెల్లడి
- ‘మోదీ కి గ్యారంటీ’లు ఉచితాలు కావా: మనీశ్ తివారీ
న్యూఢిల్లీ: గత పదేండ్లుగా జుమ్లాలో మునిగిపోయిన ప్రధాని మోదీ ఏ ఒక్క రోజు కూడా నిజం మాట్లాడలేదని కాంగ్రెస్ సీనియర్నేత జైరామ్ రమేశ్ ఆరోపించారు. మనస్సనేదే లేని మోదీ ఇతరులను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ బూటకపు వాగ్దానాలు చేస్తున్నదని మోదీ చేసిన విమర్శలపై శనివారం జైరామ్ ఘాటుగా స్పందించారు. చెప్పే మాటలకు.. చేసే పనులకు మధ్య అసలేమాత్రం పొంతన ఉండని మోదీ సుద్దులు చెప్పడం, కాంగ్రెస్ పార్టీపై ఉపన్యాసాలు దంచడం హాస్యాస్పదమన్నారు. దేశప్రజలు ఆర్థిక, సామాజిక న్యాయం కోరుకుంటున్నారని.. కాంగ్రెస్ పార్టీ వాటినే ప్రజల ముందుకు పెట్టిందని తెలిపారు.
ప్రజలు కులగణన కోరుకుంటున్నరు
‘భారత ప్రజలకు ఇప్పుడు కోరుకుంటున్నది సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ఇదే మేం ప్రజల ముందు ఉంచాం. మూడు, నాలుగేండ్లు ఆలస్యంగా సెన్సెస్ నిర్వహిస్తున్నారు. ప్రజలు కులగణన చేయాలని కోరుతున్నరు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నరు. ఇందుకోసం రాజ్యాంగ సరవరణ చేయాలి.
వీటిపై మీరేం చేస్తారోనని మేం నిశితంగా గమనిస్తున్నం” అని జైరామ్ రమేశ్ అన్నారు. మరోవైపు కాంగ్రెస్ హామీలపై మోదీ కామెంట్లు ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని మనీశ్తివారీ అన్నారు. ‘‘2024 పార్లమెంటు ఎన్నికల కోసం బీజేపీ ‘మోదీ కి గ్యారెంటీ’ అనే పేరుతో రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో అనేక ఉచిత హామీలు ఇచ్చారు. మరీ వాటికి ఖజానా నుంచి ఖర్చు కావడం లేదా?” అని ‘ఎక్స్’లో ప్రశ్నించారు.