కామారెడ్డి జిల్లా : రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు రాష్ట్రంలో మంచి స్పందన లభించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చెప్పారు. రాష్ట్రంలో 11 రోజుల పాటు 8 జిల్లాల్లో 319 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిందని చెప్పారు. దక్షిణ భారత్ లోని ఐదు రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని, ఈరోజు మహారాష్ట్రలోకి చేరుకుంటుందన్నారు. నేటితో దక్షిణ భారత్ లో పాదయాత్ర ముగిసిందని, రేపటి నుంచి ఉత్తర భారత్ లో పాదయాత్ర మొదలవుతుందన్నారు. రాహుల్ పాదయాత్ర ఉపన్యాసాలు ఇచ్చే మన్ కీ బాత్ లాంటిది కాదని, ప్రజలు తమ సమస్యలను వినిపించుకునే పాదయాత్ర అని చెప్పారు. హైదరాబాద్ లోనూ ‘భారత్ జోడో యాత్ర’కు విశేష స్పందన లభించిందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో రాహుల్ పాదయాత్ర నూతనోత్సాహం నింపిందన్నారు. రాష్ట్రంలో ‘భారత్ జోడో యాత్ర’ ప్రభావం లేదని ఎవరెన్ని మాట్లాడినా తాము పట్టించుకోమన్నారు.
మునుగోడు తీర్పుపై పార్టీలో సమీక్షిస్తాం
మునుగోడులో ఓట్ల ఎన్నిక జరగలేదని, నోట్ల ఎన్నిక జరిగిందని జైరాం రమేష్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేసి, మద్యం, డబ్బుతో టీఆర్ఎస్ గెలిచిందని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా తమ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి బాగా కష్టపడ్డారని, ప్రత్యర్థి అభ్యర్థులపై పోరాడారని చెప్పారు. తాము మునుగోడులో ఓడిపోయినందుకు ఏ మాత్రం బాధపడడం లేదన్నారు. మునుగోడులో కాంగ్రెస్ ఓటమిని, ప్రజల తీర్పును అంగీకరిస్తామన్నారు. ఉప ఎన్నికలో ఎందుకు ఓడిపోయామనే దానిపై ఆత్మపరిశీలనతో పాటు పార్టీలో సమీక్షించుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
తమకు ఇతర రాష్ర్టాల్లో బీజేపీ ప్రత్యర్థి అయితే.. తెలంగాణ రాష్ర్టంలో మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ తో పాటు MIM కూడా ప్రత్యర్థి పార్టీలని జైరాం రమేష్ చెప్పారు. తెలంగాణలో కాంట్రాక్టులు, కాంట్రాక్టర్ల చుట్టే ఎన్నికలు తిరుగుతున్నాయని ఆరోపించారు. దేశమంతా ఆహార భద్రత కోసం చూస్తుంటే.. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు ‘జాతీయ మద్యం భద్రత’ను ప్రజలపై రుద్దుతున్నట్టు కనిపిస్తోందని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక తీరుపై ఎన్నికల కమిషన్ సమీక్షించాలని కోరారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నోటీసులు జారీ చేశామని, ఆయన నుంచి వివరణ రాకపోతే చర్యలు ఉంటాయని చెప్పారు.