మాజీ మంత్రి పి.నర్సారెడ్డి మృతితో నిర్మల్ జిల్లాలో విషాద ఛాయలు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామానికి చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రెవెన్యూ, ఇరిగేషన్ మంత్రి, మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు, కురువృద్ధుడు పి.నర్సారెడ్డి(93) మరణంతో నిర్మల్​ జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకొని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియలకు హైదరాబాద్​కు తరలివెళ్లారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్​లోని తన నివాసంలో కన్నుమూశారు. నిర్మల్ నియోజకవర్గానికి మూడు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1989 లో ఆదిలాబాద్ లోక్ సభ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. మంత్రిగానూ జిల్లాకు విశేష సేవలందించారు. నీతి, నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకునే నర్సారెడ్డిని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అందరూ ప్రేమతో నర్సన్న బాపుగా పిలుచుకునేవారు.

మొదటి నుంచి తెలంగాణ వాదిగా ముద్రపడ్డ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలనలో పలుసార్లు తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రత్యేకంగా నిలిచారు. నిర్మల్ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. ముఖ్యంగా సారంగాపూర్, నిర్మల్ మండల రైతుల కోసం పదివేల ఎకరాలకు సాగు నిరందించే లక్ష్యంతో ఆయన హయాంలో స్వర్ణ ప్రాజెక్టును నిర్మించారు. ధోనిగామ ప్రాజెక్టు సైతం ఆయన హయాంలోనే పూర్తయ్యింది.

ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సాగునీటి పథకాలు, కాలువల నిర్మాణాలకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించారు. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అమల్లోకి వచ్చిన సీలింగ్ యాక్ట్ ఆధారంగా తనకు వారసత్వంగా వచ్చిన 100 ఎకరాల భూమిని గ్రామ పేద ప్రజల కోసం విరాళంగా అందజేసి గొప్ప మనసు చాటుకున్నారు. దీంతోపాటు నిర్మల్ లో బస్టాండ్ నిర్మాణానికి తనకున్న ఎకరం భూమిని విరాళంగా అందించారు.

నిర్మల్​లో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీల ఏర్పాటు ఆయన కృషితోనే జరిగాయి. వీటితోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నర్సారెడ్డి  అంత్యక్రియలు హైదరాబాద్​లో జరగ్గా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్, ఖానాపూర్ ఎమ్మెల్యే లు  మహేశ్వర్ రెడ్డి,  బొజ్జు పటేల్, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు కె.శ్రీహరిరావు ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహానికి నివాళులు అర్పించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు.