కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పద్మారెడ్డి మృతి

బెల్లంపల్లి, వెలుగు: కాంగ్రెస్​ సీనియర్ ​నేత, మహిళా నాయకురాలు కంకణాల పద్మా రెడ్డి(61) తీవ్ర ఆదివారం గుండెపోటుతో చనిపోయారు. మంచిర్యాల పట్టణంలోని ఇస్లాంపురలో నివసిస్తున్న పద్మారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబీకులు మంచిరాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ చనిపోయారు.

బెల్లంపల్లి పట్టణంలోని బూడిదగడ్డ బస్తీకి చెందిన పద్మా రెడ్డి 2000 నుంచి 2010 వరకు మంచిర్యాల జిల్లా సీడీఎస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. గతేడాది ఆమె కొడుకు తోడ వంశీకృష్ణారెడ్డి సైతం తీవ్ర అనారోగ్యంతో మృతిచెందగా, నాలుగేండ్ల క్రితమే ఆమె భర్త బాపురెడ్డి సైతం అనారోగ్యంతో చనిపోయారు. 

ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ సంతాపం

కంకణాల పద్మా రెడ్డి మృతిచెందిన విషయం తెలియగానే బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి తదితరులు ఆమె పార్థివదేహం వద్దకు చేరుకొని ఆమె కుటుంబానికి సంతాపం తెలియజేశారు. పద్మా రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని అన్నారు.  వారి వెంట  మునిమంద రమేశ్, దూడపాక బలరాం, దావ రమేశ్ బాబు తదితరులున్నారు.