టికెట్లు ఆశించి భంగపడ్డ వారంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు దక్కని కొందరు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండగా.. మరికొందరు మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. తాజాగా సూర్యాపేట సీటు కాంగ్రెస్ లో చిచ్చు రేపుతోంది. సూర్యాపేట టికెట్ ను కాంగ్రెస్ సీనియర్ నేత పటేల్ రమేష్ రెడ్డి ఆశించారు. కానీ.. ఆయనకు టికెట్ ఇవ్వలేదు. సూర్యాపేట టికెట్ ని రాంరెడ్డి దామోదర్ రెడ్డికి ఇచ్చారు. టికెట్ తనకు రాకపోవడంతో పటేల్ రమేష్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డిని ఖరారు చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో టికెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేష్ రెడ్డి పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు హైదరాబాద్ - విజయవాడ రహదారిపై జనగాం క్రాస్ రోడ్ వద్ద రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఆందోళనలు చేసిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి.. స్టేషన్ కు తరలించారు. వరుసగా రెండవసారి కూడా టికెట్ ఇవ్వకపోవడంతో పటేల్ రమేష్ రెడ్డి పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ కోసం రాత్రి, పగలు కష్టపడితే కాంగ్రెస్ ఇచ్చే ప్రతిఫలం ఇదేనా...? అంటూ పటేల్ రమేష్ రెడ్డి భార్య లావణ్య రెడ్డి ప్రశ్నించారు.