సీపీఐ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మ‌ల్లేశ్ క‌న్నుమూత‌

హైద‌రాబాద్ : మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియ‌ర్ నాయ‌కుడు గుండా మ‌ల్లేశ్(75) క‌న్నుమూశారు. గ‌త‌కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌‌.. మంగళవారం నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండా మ‌ల్లేశ్ మృతిప‌ట్ల సీపీఐ పార్టీ నాయ‌కులు సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం గుండా మ‌ల్లేశ్ భౌతిక‌కాయాన్ని నారాయ‌ణ‌గూడ‌లోని మ‌క్దూమ్ భ‌వ‌న్‌కు త‌ర‌లించ‌నున్నారు. అనంత‌రం మ‌ల్లేశ్ భౌతిక‌కాయాన్ని బెల్లంప‌ల్లికి త‌ర‌లించ‌నున్నారు.

గుండా మ‌ల్లేశ్ స్వ‌స్థ‌లం ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామం. మెట్రిక్యులేషన్ చదివిన మ‌ల్లేశ్.. బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్‌పోర్టులో క్లీనర్‌గా, డ్రెవర్‌గా పనిచేశారు. సింగరేణిలో కార్మికుడిగా చేరి సీపీఐలో సభ్యత్వం తీసుకుని.. 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న ఆయన 1983లో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌ల్లేశ్‌ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.