
- ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఎక్స్‌లో వరుస పోస్టులు
- ఇప్పటికే కంచ గచ్చిబౌలి ఇష్యూలో మార్ఫింగ్ ఫొటోలు రీ ట్వీట్
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లాంటివాళ్లు ఫేక్ ఫొటోలు తొలగించినా స్మిత మాత్రం తగ్గట్లే
- మార్ఫింగ్ ఫొటో పోస్టు చేయడంపై ఇప్పటికే ఆమెకు పోలీసుల నోటీసులు
- తాజాగా మరో మూడు పోస్టులు రీట్వీట్ చేసిన స్మిత
- 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలతో ఉన్న ఫొటో కూడా రీపోస్ట్
- స్మితా సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ
హైదరాబాద్, వెలుగు: సీనియర్ఐఏఎస్ ఆఫీసర్స్మితా సబర్వాల్తీరు ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాలనలో ఐఏఎస్‌లు భాగమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడ్తున్నట్టు ఆమె ఇటీవల సోషల్‌మీడియాలో పెడ్తున్న పోస్టులు, రీ ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. కంచ గచ్చిబౌలి భూముల ఇష్యూలో మార్ఫింగ్ఫొటోను రీ ట్వీట్‌చేసిన స్మితాకు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇవ్వగా.. వాటికి ఆమె నుంచి సమాధానం రాలేదు. పైగా సర్కారు చర్యలను తప్పుపట్టేలా ఉన్న మరో రెండు మూడు పోస్టులను తాజాగా స్మితా సబర్వాల్ రీ ట్వీట్చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
నోటీసులు ఇచ్చినా..!
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల ద్వారా తప్పుడు ప్రచారం చేసినవారిపై సర్కారు సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలోనే పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. మార్ఫింగ్ ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్, రీ ట్వీట్ చేసినవారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి లాంటి ఒకరిద్దరు ప్రజాప్రతినిధులతో పాటు పలువురు బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఉన్నారు.
అధికారుల్లో ఒక్క స్మితా సబర్వాల్ తప్ప మిగిలిన వారెవరూ ఆ ఇష్యూ జోలికి పోలేదు. స్మిత ప్రస్తుతం ప్రభుత్వంలో యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. మార్చి 31న ‘హాయ్ హైదరాబాద్’ అనే ఎక్స్ హ్యాండిల్‌లో పోస్టు చేసిన గిబ్లీ ఫొటోను స్మిత రీ ట్వీట్‌చేశారు. అది కంచ గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్ల ముందు నెమళ్లు, జింకలు ఉన్నట్లుగా సృష్టించిన మార్ఫింగ్ ఫొటో కావడంతో కలకలం రేగింది.
మార్ఫింగ్ ఫొటోల ఇష్యూలో పోలీసులు కేసుల నమోదు ప్రారంభించగానే.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి , ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సహా పలువురు తమ సోషల్‌మీడియా అకౌంట్ల నుంచి మార్ఫింగ్ ఫొటోలను తొలగించారు. కానీ, ఐఏఎస్ఆఫీసర్ స్మితా సబర్వాల్ మాత్రం తన ట్విటర్ ఖాతా నుంచి మార్ఫింగ్ ఫొటోను తొలగించలేదు. దీంతో కంచ గచ్చిబౌలి పోలీసులు ఈ నెల11న ఆమెకు నోటీసులు జారీ చేశారు.
దీనికి నేరుగా ఎక్కడా స్పందించని స్మిత.. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఉన్న ఓ మూడు ఎక్స్ పోస్టులను తాజాగా రీ ట్వీట్‌చేశారు. ‘‘తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులిస్తరా? ఇది దేనికి సంకేతం?’’ అంటూ ఓ ఇద్దరు మహిళలు పెట్టిన పోస్టులతోపాటు, ‘‘కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వం తొలగించిన 100 ఎకరాలను పునరుద్ధరించాలనే ప్లాన్‌తో రండి. లేదంటే అధికారులు జైలుకు వెళ్లకతప్పదు’’ అన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉన్న ‘లైవ్‌లా’ పోస్ట్‌ను కూడా స్మితా రీ ట్వీట్చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. మొదటి రెండు పోస్టుల్లో ఎప్పట్లాగే ఏఐతో క్రియేట్ చేసిన బుల్డోజర్లు, నెమళ్లు, జింకలు ఉండడం గమనార్హం.
మిస్ వరల్డ్ పోటీల బాధ్యతలు చూస్తూ..!
కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించిన మార్ఫిం గ్ ఫొటోలు ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసినందుకు గాను ఈ నెల 11న స్మితాకు గచ్చిబౌలి పోలీసులు బీఎన్‌ఎస్ 179 సెక్షన్ కింద నోటీసులిచ్చారు. రీ పోస్ట్ చేసిన ఫొ టోలకు సంబంధించిన సమాచారం అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బుధవారమే పోలీసుల ముందు విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఆమె అటెండ్ కాలేదు. కాగా, మరోసారి ఇలాంటి పోస్టులే పెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటన్న చర్చ ఐఏఎస్ వర్గాల్లో జరుగుతున్నది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంవో సెక్రటరీగా స్మితా కీలక పాత్ర పోషించారు. కాళేశ్వరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టులనూ పర్యవేక్షించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఐఏఎస్ ఆఫీసర్లంతా వచ్చి సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లినా స్మితా మాత్రం చాలా రోజులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్తారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా, ఆ తర్వాత యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది.
మేలో హైదరాబాద్‌లో జరిగే ప్రతిష్టాత్మక మిస్‌వరల్డ్ పోటీల బాధ్యతలను పూర్తిగా స్మితానే చూసేలా కీలక బాధ్యతలు అప్పగించింది. ఇలాంటి టైమ్‌లో ఆమె వ్యవహార శైలి, సోషల్ మీడియా పోస్టులు ఐఏఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.