2011 జనవరి 29... హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదిక. వేటూరి జయంతి.. ‘గురూజీ మళ్లీ ఎప్పుడు కలుద్దాం’.. పుస్తకావిష్కరణ. సాయంత్రం 5 గంటలకు ప్రోగ్రాం మొదలు కావాలి. అంతకు పది పదిహేను నిమిషాల ముందే అక్కడికి వచ్చి కూర్చున్నారు కె.విశ్వనాథ్ . కార్యక్రమానికి ముఖ్య అతిథి, పుస్తకావిష్కర్త ఆయనే. అప్పటికీ ఇంకా మేము ఫ్లెక్సీ లు కూడా కట్టడం మొదలు పెట్టలేదు. అక్కడ ఉదయం నుంచి జరుగుతున్న వేరేవాళ్ల ప్రోగ్రాం కంటిన్యూ అవడం వల్ల మా చేతికి హాల్ రావడానికి ఆరు దాటింది. మా ప్రోగ్రాం కోసం వచ్చిన అతిథుల్లో కొందరు వచ్చినట్టే వచ్చి అట్లా వెనక్కి వెళ్లిపోవడంతో మా అందరిలో టెన్షన్ స్టార్టయింది. ఆ గెస్టులకు తెలుగు యూనివర్సిటీలోని నా తోటి స్టూడెంట్లు, నా సహచర జర్నలిస్టు మిత్రులు నచ్చజెప్పే పనిలో పడ్డారు. నేను, స్ఫూర్తి సాంస్కృతిక సంస్థ కార్యదర్శి చుండి మధుసూదన్, ఇంకొందరు దోస్తులం కార్యక్రమ ఏర్పాట్లలో మునిగిపోయాం. ప్రోగ్రాం ఆలస్యమవుతున్నా ఆయనలో ఇసుమంత కూడా విసుగు కనిపించలేదు. పైగా, మా టెన్షన్‌ను దూరం నుంచి గమనిస్తూ.. ‘ఏం పర్వాలేదు.. కానివ్వండి’ అన్నట్లుగా చిరునవ్వులు చిందించారు. ఏడున్నరకు అనుకుంటా ప్రోగ్రాం మొదలైంది. రెండుగంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తర్వాత వేదికపైకి అతిథుల ఆహ్వానాలు, పుస్తకావిష్కరణ, పుస్తక సమీక్ష, ప్రసంగాలు.. ఇదీ మా షెడ్యూల్. గంటకుపైగా వేటూరి గీతాలాపన జరిగింది. తర్వాత వేటూరి పాటకు కళాకారుల ఆట మొదలవగా.. అప్పటికే కొందరు గెస్ట్‌లు.. ‘ఇంకా ఎప్పుడయ్యా పుస్తకావిష్కరణ’ అంటూ గొణుక్కోవడం మొదలుపెట్టారు. అందులో కొందరు కాస్త కటువుగానే ముఖం మీద అనేశారు. వారు అనడంలో ఏమాత్రం తప్పులేదు. ఇలాంటి కార్యక్రమాలు చూడటం తప్ప.. నిర్వహించిన అనుభవం మాకు లేదు. కార్యక్రమం లేటవుతుంది.. పెద్దాయన ఏమనుకుంటున్నారోనన్న బెరుకు మా అందరిలో. పరిస్థితిని అర్థం చేసుకున్న.. ఆయన మమ్మల్ని దగ్గరికి పిలిచి.. ‘టెన్షన్ పడకండి నాయనా.. కార్యక్రమం మొత్తం అయ్యేవరకు ఉంటాలే’ అన్నారు. ఆ మాట మాకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది. మా పరిస్థితి ఏ మాత్రం బయటకు కనిపించకుండా నా ఫ్రెండ్, వ్యాఖ్యాత శ్రీరాము మాటలతో మేనేజ్ చేశాడు. హాలుతోపాటు వేదిక కిక్కిరిసిపోయింది. వేటూరి సుందరరామమూర్తితో ఉన్న అనుబంధాన్ని అతిథులంతా తమ ప్రసంగాల్లో గుర్తుకుతెచ్చుకున్నారు. పుస్తకావిష్కరణ ఇట్ల జరిగిందో లేదో.. ఒకరొకరుగా అందరూ వేదిక దిగివెళ్లిపోయారు. కానీ, చివరి వరకు అంటే రాత్రి పదకొండున్నర వరకు మా వెంటనే, మాతోనే విశ్వనాథ్ ఉన్నారు. అప్పటికే ఆయన వయసు ఎనిమిది పదులు దాటింది. పైగా అది ఎముకలు కొరికే చలికాలం. వెళ్తూ వెళ్తూ.. మా అందరినీ మరోసారి విశ్వనాథ్ పిలిచి.. ‘‘మంచి కార్యక్రమం చేశారు నాయనా.. పుస్తకం బాగొచ్చింది. దీర్ఘాయుష్మాన్ భవ” అంటూ భుజం తట్టి ఆశీస్సులు అందించారు. అంతకుముందు పదిపదిహేను రోజుల నుంచి పడిన మా కష్టం, ఆపసోపాలు, ప్రోగ్రాం రోజు ఎదురైన అవాంతరాలు, గందరగోళాలు విశ్వనాథుడి ఆ చల్లని ఆశీస్సులతో పటాపంచలయ్యాయి. అది ఓ చెరగని జ్ఞాపకం!!
‘‘కార్యక్రమం మొదలైంది సార్... మీరు రావడమే ఆలస్యం” అని పదిసార్లు ఫోన్ చేస్తే కానీ, వర్తమానం పంపితే కానీ రాని ముఖ్య అతిథులతో సభలు, సమావేశాలు నడుస్తున్న కాలంలో 81 ఏండ్ల (2011 నాటికి) విశ్వనాథ్ కమిట్మెంట్కు శిరస్సానమామి. పుస్తకావిష్కరణకు రావాలని ఆయనను కలిసినప్పుడు.. ‘‘నాకు చెన్నై వెళ్లే పని ఉంది. అది ముగించుకొని రావడానికి ప్రయత్నిస్తా”అన్నారు. ప్రయత్నించడమే కాదు.. వచ్చేశారు. అదీ టైమ్‌కి. పైగా చివరి వరకు మాతో ఉండి నడిపించి.. ఆశీస్సులు అందించారు.
ఓ కళాతపస్వీ.. యశస్వి..!
నీ యాదిలో గుండె బరువైతున్నది.
- అంబట్ల రవి,
సీనియర్ జర్నలిస్ట్