విశ్లేషణ: కాంగ్రెస్‌‌ ముక్త్‌‌ భారత్‌‌ నిజమవుతదా?

విశ్లేషణ: కాంగ్రెస్‌‌ ముక్త్‌‌ భారత్‌‌ నిజమవుతదా?

కాంగ్రెస్‌‌ ముక్త్‌‌  భారత్‌‌.. బీజేపీ నినాదమిది. ఇదే లక్ష్యంతో ఆ పార్టీ 2014 నుంచి పనిచేస్తోంది. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు తృణమూల్‌‌ కాంగ్రెస్‌‌ చీఫ్​ మమతా బెనర్జీ. బీజేపీ, టీఎంసీ దారులు వేరైనా ఈ రెండు పార్టీలు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. కాంగ్రెస్‌‌ను పునాదుల్లోంచి పెకిలించేయాలన్నదే వారి టార్గెట్. దేశమంతటా తన పునాదులను పటిష్టం చేసుకున్న బీజేపీకి కాంగ్రెస్‌‌ పోటీ ఇస్తుందనే అనుమానం కొంచెం కూడా లేదు. కానీ, ప్రధాన ప్రతిపక్షం నుంచి కాంగ్రెస్‌‌ను తప్పించి తన పార్టీని రీప్లేస్‌‌ చేయాలన్న కోరికతో మమత ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీయేతర పార్టీల నేతలను వరుసగా కలుస్తున్నారు. ఈ రోజు కాకపోతే రేపైనా వారంతా తనతో కలిసి వస్తారనే నమ్మకంతో ఆమె ఉన్నారు. ఆమె ప్రయత్నాలు సక్సెస్​ అయితే మాత్రం కాంగ్రెస్​ పార్టీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు.

కాంగ్రెస్‌‌ను సమూలంగా తుడిచిపెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మరో వైపు పార్లమెంట్‌‌లో ప్రతిపక్ష స్థానం నుంచి కాంగ్రెస్‌‌ను పడగొట్టి తన పార్టీతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని వ్యూహ రచన చేస్తున్నారు తృణమూల్‌‌ కాంగ్రెస్‌‌ చీఫ్​ మమతా బెనర్జీ. పట్టుదలతో మమత వేస్తున్న అడుగులు చూస్తుంటే కాంగ్రెస్‌‌ స్థానంలో ఆమె ప్రతిపక్షంగా నిలిచేట్టే కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన బెంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌‌ 214 సీట్లు గెలిచింది. మూడోసారి పగ్గాలు చేపట్టడంతో మమతలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దీంతో బీజేపీని ప్రత్యర్థిగా జాతీయ స్థాయిలో తన పార్టీని నిలబెట్టేందుకు ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే బెంగాల్​లో మాదిరిగా జాతీయ స్థాయిలో ఆమె ఫలితాలు సాధిస్తారని ఇప్పుడే చెప్పలేం. కానీ ఆమె తన ఆశయం దిశగా ముందుకు సాగుతోంది. 2024లో కాకపోయినా రాబోయే ఐదేండ్లలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగేందుకు ఆమె ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తన కల నెరవేర్చుకునేందుకు కాంగ్రెస్‌‌ను తుడిచిపెట్టి, తన పార్టీతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కృషి చేస్తోంది.

నార్త్‌‌లో పట్టు అంత ఈజీ కాదు..

ఇటీవల మేఘాలయలో 17 మంది కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యేల్లో 12 మందిని తృణమూల్‌‌లోకి లాక్కోవడం చూస్తుంటే, ప్రధాన ప్రతిపక్ష పీఠం నుంచి కాంగ్రెస్‌‌ను దించాలనే ఆతృతలో మమత ఉన్నారని అర్థమవుతోంది. మేఘాలయలోనే కాకుండా, గోవాలో మాజీ సీఎం లూయిజిన్హో ఫలేరో, త్రిపురలో మహిళా కాంగ్రెస్‌‌ అధ్యక్షురాలు సుస్మితా దేబ్‌‌, పశ్చిమ బెంగాల్‌‌లోని చాలా మంది ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకున్నారు. ఈశాన్య ప్రాంతం పశ్చిమ బెంగాల్‌‌కు సమీపాన ఉన్నందున అక్కడ ఆమె విజయం సాధించినా, నార్త్‌‌లోని ఇతర పెద్ద రాష్ట్రాల్లో పట్టు సాధించడం ఆమెకు అంత ఈజీ కాదని చెప్పవచ్చు.

బీజేపీకి కలిసొచ్చే అంశాలు ఎన్నో

ప్రస్తుత కాంగ్రెస్‌‌ పరిస్థితి చూస్తే బీజేపీ కంగారు పడాల్సిన అవసరం కనిపించడం లేదు. కాంగ్రెస్‌‌ దిజారుతున్న స్థితిలో ఉండి, ప్రతిపక్షం అస్తవ్యస్తంగా ఉండటం వల్ల బీజేపీ ఆందోళన పడాల్సిన పనిలేదు, పైగా ఇది ఆ పార్టీకి కలిసొచ్చే అంశమే. ఉత్తరప్రదేశ్‌‌లో ప్రతిపక్షం చిన్నాభిన్నం అయిన కారణంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే లాభం చేకూరేలా ఉంది. ఎన్నికలు జరగబోయే పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌‌ల్లో పరిస్థితి ఇదే విధంగా ఉంది. పంజాబ్‌‌ విషయానికొస్తే గతంలో అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండగా, ఇప్పుడు ఆమ్ ఆద్మీ  కూడా ఎన్నికల బరిలోకి దిగి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. ఉత్తరాఖండ్‌‌లో మళ్లీ కాంగ్రెస్‌‌పై బీజేపీదే పై చేయిగా ఉండగా, గోవాలో కాంగ్రెస్‌‌ను ఢీ కొట్టాలని మమత విశ్వప్రయత్నం చేస్తున్నారు. మణిపూర్‌‌ విషయానికొస్తే 60 స్థానాలున్న శాసనసభలో 25 నుంచి 30 సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంత పార్టీనే సరిదిద్దుకోలేక సతమతమవుతున్న పరిస్థితిలో పడింది. ఇది చూస్తుంటే ప్రధాని మోడీ కల అయిన కాంగ్రెస్‌‌ ముక్త్‌‌ భారత్‌‌ నెరవేరే రోజు మరెంతో దూరంలో లేదేమో అనిపిస్తోంది.

కాంగ్రెస్‌‌ తన పంథా మార్చుకోవాలి

రాజకీయాల్లో పట్టు నిలుపుకోవాలంటే కాంగ్రెస్‌‌ తన పంథా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపై భావజాలం అనే ప్రశ్నే లేదు. ఎందుకంటే తృణమూల్‌‌ కాంగ్రెస్‌‌, సమాజ్‌‌ వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌‌దళ్, బహుజన సమాజ్‌‌వాదీ పార్టీ, నేషనలిస్ట్‌‌ కాంగ్రెస్‌‌ పార్టీ, వామపక్షాలు కూడా లౌకికవాద భావజాలం కలిగినవే. లౌకికవాదులం అని ఊదరగొట్టడానికి బదులు, పార్టీలోని నాయకులను కట్టడి చేసి, వారిని ఐకమత్యంగా ఉంచేందుకు కాంగ్రెస్‌‌ నాయకత్వం సరికొత్త వ్యూహాలు రచించాలి. ఎన్నో ఏండ్లుగా పార్టీలో ఉన్న పంజాబ్‌‌ మాజీ సీఎం అమరీందర్‌‌‌‌ సింగ్‌‌ను బయటకు నెట్టడం కాంగ్రెస్‌‌ చేసిన అతి పెద్ద తప్పు. దానికి ఆ పార్టీనే పూర్తి బాధ్యత వహించి తీరాలి. ఆయన్ని అవమానించడం, అనాలోచితంగా పార్టీ నుంచి బయటకు పంపడం వంటి పనులతో కాంగ్రెస్‌‌ నవ్వులపాలైంది. పీసీసీ చీఫ్​ నవజ్యోత్‌‌ సింగ్‌‌ సిద్ధూ, సీఎం చరణ్​జీత్‌‌ సింగ్‌‌ చన్నీ ఓపెన్​గా తిట్టుకుంటున్న ఏకైక రాష్ట్రం పంజాబ్. సిద్ధూకు అనవసర ప్రాముఖ్యత ఇస్తూ రాజకీయ ఆత్మహత్యకు పాల్పడుతున్న రాహుల్‌‌, ప్రియాంకాగాంధీ రాబోయే ఎన్నికల్లో ఆమ్‌‌ ఆద్మీ పార్టీకి ప్రయోజనం చేకూరుస్తున్నారు. 

సొంత రాష్ట్రాలనైనా నిలుపుకోవాలె

కేంద్రంలో బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయినా, కనీసం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనైనా నిలుపుకునేందుకు కాంగ్రెస్​​ ప్రయత్నిస్తే బెటర్‌‌‌‌. ఛత్తీస్‌‌గఢ్‌‌, రాజస్థాన్‌‌, పంజాబ్‌‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే వారికి అధికారం ఉంది. ఛత్తీస్‌‌గఢ్​, రాజస్థాన్‌‌ సీఎంలకు రెబల్స్‌‌ సృష్టిస్తున్న ఇబ్బందులను చూస్తుంటే అక్కడ కూడా కాంగ్రెస్​ అంత మంచి స్థితిలో ఉన్నట్లు కనిపించడంలేదు. ట్విట్టర్‌‌‌‌లో యాక్టివ్‌‌గా ఉండటానికి బదులు, కాంగ్రెస్‌‌ నాయకత్వం రాజకీయ వ్యూహాలను రచించడానికి సమయం వెచ్చిస్తే మంచిది. మమతా బెనర్జీ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ, ముఖ్యమంత్రులను కలుస్తుంటే కాంగ్రెస్‌‌ నాయకత్వం ఆ పని ఎందుకు చేయట్లేదు? యూపీఏని రీప్లేస్‌‌ చేసి కొత్త ఫ్రంట్‌‌ను ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా మమత ఢిల్లీ సీఎం అరవింద్‌‌ కేజ్రీవాల్‌‌, ఎన్‌‌సీపీ లీడర్‌‌‌‌ శరద్‌‌ పవార్‌‌‌‌, శివసేన నేతలు ఆదిత్య థాక్రే, సంజయ్‌‌ రౌత్‌‌ వంటి వారితో చర్చలు జరపడంలో తనమునకలై ఉన్నారు. ఈ నేతలంతా ఆమెతో కలిసి కొత్త కూటమి ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపితే, సమీప భవిష్యత్తులో యూపీఏ అనేది చరిత్రలో కలిసిపోతుంది.

రాహుల్‌‌కు ఇదే సరైన టైమ్‌‌

కాంగ్రెస్‌‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ నాయకత్వాన్ని చేపట్టేందుకు బయటివారిని ఎవరినీ అనుమతించరనే విషయం తెలిసిందే. కానీ పీఠాన్ని ఎక్కాలంటే రాహుల్‌‌ గాంధీకి ఇదే సరైన టైమ్‌‌. ప్రస్తుతం అధ్యక్షుడిగా పార్టీని నడపాలంటే చిక్కులతో కూడుకున్న పనే. దీన్ని ఎవరూ సీరియస్‌‌గా తీసుకోకపోవచ్చు. ఒక కార్యక్రమాన్ని డిజైన్‌‌ చేసినప్పుడు ఎవరూ ఆదేశాలను స్వీకరించకపోవచ్చు. ఎందుకంటే నాయకులంతా మరో సెక్యులర్‌‌‌‌ పార్టీలో చేరడానికి సిద్ధపడవచ్చు. ప్రతిపక్షంగా తన సొంత కార్యకలాపాలు నిర్వహిస్తూ డబుల్‌‌ గేమ్‌‌ ఆడుతున్న తృణమూల్‌‌ కాంగ్రెస్‌‌ పట్ల జీజేపీకంటే కాంగ్రెస్‌‌  పార్టీనే జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు కాంగ్రెస్​ను అధిగమించాలనే తన ప్రయత్నాల వల్ల ప్రధాని కావాలనే తన అతిపెద్ద ఆశయాన్ని మమత వదులుకోవాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చివరిగా వచ్చే సాధారణ ఎన్నికల్లో సెక్యులర్‌‌‌‌ పార్టీలన్నీ కలసి పోరాడినా బీజేపీని ఓడించే అవకాశం చాలా కొద్దిగా మాత్రమే ఉండొచ్చు.

అందరూ ప్రధాని పీఠం ఎక్కాలని కలలు కనేవాళ్లే..

మహారాష్ట్ర శివసేన, కాంగ్రెస్‌‌, ఎన్​సీపీ కూటమి అధికారంలో ఉంది. ఇటీవల 3 రోజుల పాటు 
మమత ముంబైలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం బాలేదనే సాకుతో సీఎం ఉద్ధవ్‌‌ థాక్రే ఆమెను కలవలేదు. అయితే, సోనియా గాంధీ నేతృత్వంలో ఏర్పాటైన యూపీఏకు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌‌ను ఏర్పాటు చేసే ఆలోచనను ఎన్‌‌సీపీ చీఫ్​ శరద్‌‌ పవార్‌‌‌‌ ఆమెకు సూచించారు. పవార్‌‌‌‌ గత ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంటరెస్ట్‌‌ చూపించనప్పటికీ, ఇంకా ఆయన రాజకీయాలను విడిచిపెట్టకపోవడం ఆయనలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ప్రధాని పీఠం ఎక్కాలనే ఆశ ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రధాన మంత్రి పదవిని ఆశించేవారు చాలామందే ఉన్నా, దేన్నీ లెక్కచేయని మనస్తత్వమున్న మమతకు మాత్రం ఇది ఏమాత్రం కష్టం కాకపోవచ్చు. యూపీ నుంచి సమాజ్‌‌ వాదీ పార్టీ లీడర్‌‌‌‌ అఖిలేశ్​​ యాదవ్‌‌, బీఎస్‌‌పీ లీడర్‌‌‌‌ మాయావతి, తెలంగాణ సీఎం కేసీఆర్‌‌‌‌ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా సెక్యులర్‌‌‌‌ ఫ్రంట్‌‌కు నాయకత్వం వహించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో టీడీపీ లీడర్‌‌‌‌ చంద్రబాబు కూడా దీనికి ఆసక్తి చూపగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన ఈ రేసులో వెనుకబడ్డారు.

- అనితా సలూజా

పొలిటికల్​ కామెంటేటర్