హిందీ భాషా వారధి వినయ్ వీర్ : బి.నర్సన్

హిందీ భాషా వారధి వినయ్ వీర్ : బి.నర్సన్

దక్షిణాన హిందీ భాషను, సాహిత్యాన్ని వ్యాప్తి చేసేందుకు ఎక్కడో పుట్టిన కుటుంబం భాగ్యనగరంలో అడుగుపెట్టి తమ కృషిని నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. ఎనభై ఏండ్ల క్రితం హైదరాబాద్ మోజాంజాహి మార్కెట్ లోని ఓ భవంతిలో మొదలైన పత్రిక అందుకు బీజం వేసింది. దానికి ఆద్యులు యుధ్ వీర్, ఆయన భార్య సీతాదేవి.  ఇరువురు స్వాతంత్య్ర సమరయోధులు. వారి వారసత్వంగా ‘డైలీ​ హిందీ మిలాప్’ బాధ్యతను 1991లో వారి పుత్రుడు వినయ్ వీర్  చేపట్టారు. తన హయాంలో ఆ పత్రికను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దిన వినయ్ వీర్ 2024 ఏప్రిల్ 28న కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన వినయ్ వయసు 72 ఏండ్లు. 

వినయ్ వీర్ స్వతహాగా సౌమ్యుడు.  పత్రికకు సంపాదకుడు, ప్రచురణకర్త అయినా సిబ్బందితో  ఎంతో కలివిడిగా ఉండేవారు. కేవలం పత్రిక నిర్వహణకే పరిమితమైన ఆయన ఎన్నడూ ప్రచారాన్ని కోరుకోలేదు. తన గురించి,   తమ కుటుంబం గురించి గానీ వారి పత్రికలో ప్రస్తావనకు ఒప్పుకునేవారుకారు. అరుదుగా తాను హాజరయ్యే కార్యక్రమాల వార్తల్లోనూ తన గురించి రాకుండా జాగ్రత్తపడేవారు.  సంపాదకుడిగా ఉన్నంత కాలం మిలాప్ పత్రికలో తన ఫొటో వేయవద్దని కచ్చితంగా ఉండేవారు. చివరకు ఆయన మరణవార్తతోనే   ‘డైలీ హిందీ మిలాప్’ ఆయన ఫొటోను ప్రచురించింది. 

హిందీ భాషా, సాహిత్యాలపై మక్కువ

హిందీ భాషా, సాహిత్యాలపై ఆయనకెంతో మక్కువ. పత్రికా మాధ్యమంగా ఆయన ఆ దిశగా ఎంతోసేవ చేశారు. 18 పేజీల పత్రికలో భాషా, సాహిత్యాలకు ప్రోత్సాహంగా ఎన్నో శీర్షికలను, ఫీచర్స్ ని ప్రవేశపెట్టారు. 'మిలాప్ మజా' పేరుతో ఆదివారం ప్రత్యేక అనుబంధాన్ని పుస్తకరూపంలో అందించారు. అందులో కథలు, కవితలకు పెద్దపీట వేశారు. రచనల పోటీలను కూడా నిర్వహించేవారు.  హైదరాబాద్ నగరంలోని హిందీ భాషీయులకు, భాషా ప్రియులకు ఈ పత్రిక ఎంతో ప్రీతిపాత్రంగా నిలుస్తోంది. ఉత్తర భారతం నుంచి వచ్చే హిందీ దినపత్రికల కన్నా ఎక్కువగా, పేజీల కొద్దీ స్థానిక వార్తలు హిందీలో లభ్యం కావడంతో  దీనికి ఎంతో జనాదరణ ఉంది. హైదరాబాదీ హిందీ భాష వాడకంతో ఇతరులు కూడా ఈ పత్రికను తేలిగ్గా చదవగలుగుతారు.  ఇలా తెలుగు రాష్ట్రాల ప్రజల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని లోకల్ టచ్ ఉండేలా వినయ్ పత్రికను తీర్చిదిద్దారు.
 
పాక్ నుంచి హైదరాబాద్​కు..

వినయ్ వీర్ తండ్రి యుధ్ వీర్ కుటుంబం స్వాతంత్య్రానికి కొంతకాలం ముందే పాకిస్తాన్ సింధ్ ప్రాంతం నుంచి హైదరాబాద్​కు వలస వచ్చారు. 1950లో యుధ్ ఉర్దూలో మిలాప్ అనే వార పత్రికను ఆరంభించారు. ఆ తర్వాత 1962లో దాన్ని దినపత్రికగా మార్చి హిందీలో తెచ్చారు. వినయ్ వీర్ తల్లి సీత వీర్ రెండు మార్లు రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. 1991లో యుధ్ వీర్ మరణం తర్వాత పత్రిక బాధ్యతలను వినయ్ స్వీకరించి ముప్పై ఏండ్లకు పైగా సంపాదకుడిగా కొనసాగారు. తండ్రి జ్ఞాపకార్థంగా యుధ్ వీర్ ఫౌండేషన్ స్థాపించి  ఆయన జన్మదినమైన ఏప్రిల్ 30న సామాజిక సేవకులకు జీవన సాఫల్య పురస్కారాలను అందజేస్తున్నారు.

ఈసారి అదే 30 ఏప్రిల్  రోజున యుధ్ వీర్ పురస్కార ప్రదానంతో పాటు వినయ్ వీర్ సంతాప సభ ఏకకాలంలో ఒకే వేదికపై జరగడం ఓ విషాద సన్నివేశం. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ మెంబర్​గా, ఏపీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్​కు చైర్మన్ గా ఉన్నారు. దక్షిణ భారతంలో హిందీ ఉనికి కోసం  జర్నలిజం ద్వారా, పత్రిక ద్వారా ఎంతో కృషి చేశారు. హైదరాబాద్ పత్రిక చరిత్రలో వినయ్ వీర్ సేవలు చిరస్మరణీయంగా మిగులుతాయి.

- బి.నర్సన్,
సీనియర్​ జర్నలిస్ట్​