‘ఉక్రెయిన్‌లో శాంతిని కోరుకుంటున్నాను.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో జరుగుతున్న అత్యంత ఘోరమైన సంఘర్షణను ముగించడానికి కాల్పుల విరమణ సాధించడానికి న్యూఢిల్లీ సిద్ధంగా ఉంది..’ గతేడాది కాజన్‌లో జరిగిన బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత ప్రధాని మోదీ అన్న మాటలివి. ఒక దశలో రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడం ఒక్క మోదీ వల్లే సాధ్యమని, అదే జరిగితే ఆయనకు నోబుల్ పీస్ ప్రైజ్ ఖాయమనే వార్తలొచ్చాయి. మరి ఇలాంటి శాంతిదూత తన దేశంలో మావోయిస్టులు, ఆదివాసులు అనబడే సొంత ప్రజల్ని ఎందుకు చంపుతున్నట్టు? ఆ మాత్రం శాంతి చర్చలు మావోయిస్టులతో జరపడం మోదీకి ఎందుకు సాధ్యం కావడం లేదు?
2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ దండకారణ్యంలో నెత్తుటేర్లు పారిస్తున్నది. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అబూజ్మడ్కొండల్లో మావోయిస్టుల కంచుకోటను కూకటివేళ్లతో పెకిలించడమే లక్ష్యంగా గతేడాది జనవరిలో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. ఏకంగా 40 బెటాలియన్ల సీఆర్పీఎఫ్ దళాలు.. చత్తీస్‌గఢ్‌కు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీఆర్జీ), కోబ్రా దళాలతోపాటు ఒడిశాలోని స్పెషల్ గ్రూప్ ఆపరేషన్స్ టీంలతో కలిసి మావోయిస్టులను డ్రోన్ల సాయంతో వేటాడుతున్నాయి.
మానవ రహిత విమానాల ద్వారా మావోయిస్టు గుంపులపై బాంబు దాడులకు తెగబడడమేగాక రాకెట్లాంఛర్లను సైతం ప్రయోగిస్తున్నాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. కనీవిని ఎరగని ఈ ఊచకోతతో వందలాది నక్సల్స్ ప్రాణాలు కోల్పోతుండగా, మిగిలిన కొద్దిమంది మావోయిస్టులు, వారి నాయకులు చెల్లాచెదురవుతున్నారు.
చత్తీస్‌గఢ్‌లో దక్షిణాన మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుగా విస్తరించిన అబూజ్‌మఢ్.. మావోయిస్టులకు చాలా ఏండ్ల నుంచి ప్రధాన స్థావరంగా ఉంది. అన్ని రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు అగ్రనేతలంతా ఇక్కడే తలదాచుకుంటున్నారు. తాజా ఆపరేషన్‌తర్వాత ఆ అగ్రనేతల్లో ఎంతమంది బతికున్నారో తెలియని పరిస్థితి. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏడాది కాలంలో వివిధ ఎన్కౌంటర్లలో సుమారు 260 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
వీరిలో సగానికి పైగా సామాన్యులు ఉన్నారని పౌరహక్కుల సంఘాలు వేసిన నిజనిర్ధారణ కమిటీలు తేల్చాయి. నక్సల్స్ ఏరివేత పేరుతో1996 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్లలో సుమారు 14వేల మంది చనిపోగా, అందులో 5వేలకు పైగా మావోయిస్టులు, 3వేల వరకు జవాన్లు, పోలీసులున్నారు. మిగిలిన 6వేల మంది సామాన్య పౌరులేనని వివిధ నివేదికలు చెప్తున్నాయి. మరి ఈ భారత పౌరుల జీవించే హక్కును సర్కారు ఎందుకు హరిస్తున్నట్టు?
మావోయిస్టులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారా?
గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయకుండా, స్కూళ్లు, హాస్పిటళ్లు కట్టకుండా, ఇతర మౌలిక వసతులు కల్పించకుండా మావోయిస్టులు అడ్డుకుంటున్నారనేది కేంద్రంలోని బీజేపీ, దాని మద్దతుదారుల వాదన. ఇందులో వాస్తవమెంతో ఒక్కసారి చూద్దాం. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచిపోయినా సుమారు 98వేల గ్రామాలకు నేటికీ రోడ్డు కనెక్టివిటీ లేదు. ఈ విషయంలో జాతీయ సగటు(15శాతం)తో పోల్చినప్పుడు చత్తీస్‌గఢ్(62.65) కన్నా రాజస్థాన్(64.37) లాంటి రాష్ట్రాలే అధ్వానంగా ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే చత్తీస్‌గఢ్‌లో పక్కా రోడ్లు లేని గ్రామాలు కేవలం 1,488 ఉండగా, బీజేపీ ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 5,518 గ్రామాలకు, మధ్యప్రదేశ్‌లో 4,054 గ్రామాలకు, రాజస్థాన్‌లో 4,301 గ్రామాలకు పక్కా రోడ్లు లేవు. మరి మావోయిస్టుల ప్రభావం ఏమాత్రం లేని ఈ రాష్ట్రాల్లో రోడ్లు వేయడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు? దేశవ్యాప్తంగా ఇప్పటికీ 10వేలకుపైగా గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు లేవు. కేవలం 21 శాతం గ్రామాల్లో అప్పర్ ప్రైమరీ, 7శాతం గ్రామాల్లో మాత్రమే హైస్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో ఏటా లక్షలమంది చిన్నారులు మధ్యలోనే బడి మానేస్తున్నారు.
వైద్యం విషయానికి వస్తే ప్రతి వెయ్యి మందికి కనీసం 3 బెడ్లు అందుబాటులో ఉండాలని డబ్ల్యూ హెచ్‌వో చెప్తుంటే మన దేశంలో ప్రతి 5వేల మందికి మాత్రమే 3 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఆ బెడ్లలో 60శాతం ప్రైవేట్ సెక్టార్లోనే ఉన్నాయి. దేశంలో సుమారు 60 కోట్ల మందికి స్వచ్ఛమైన తాగునీరు, 68 కోట్ల మందికి టాయిలెట్స్అందుబాటులో లేవు. ఇప్పటికీ14 కోట్ల మంది వాళ్ల ఇండ్లలో కరెంట్ వెలుగులకు నోచుకోలేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా132 జిల్లా కేంద్రాలకు ఇప్పటికీ ట్రైన్ కనెక్టివిటీ లేదు. బస్సులు లేని గ్రామాల సంగతి చెప్పనక్కర్లేదు.
బీజేపీ ఏలుబడిలోని యూపీలో చూసినా 5వేల గ్రామాలకు బస్సు ఫెసిలిటీ లేదు. పట్టణాలు, నగరాల్లో మౌలిక వసతుల సంగతి చూస్తూనే ఉన్నాం. సరైన రోడ్లు, డ్రైనేజీలు లేక, తాగునీరు రాక జనం నరకం చూస్తున్నారు. దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 70 దాకా ఉన్నాయి. ఈ జిల్లాల్లో అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకుంటున్నారని కాసేపు అనుకుందాం. మరి, మిగిలిన 730 జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనను ఎవరు అడ్డుకుంటున్నారో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా చెప్పాలి.
కార్పొరేట్లకు లైన్ క్లియర్ చేస్తున్నారా?
దేశంలో ఇంకా దోపిడీకి గురికాకుండా పుష్కలమైన సహజవనరులతో అలరారుతున్న రాష్ట్రం చత్తీస్‌గఢ్ మాత్రమే! భారతప్రభుత్వం అంచనా ప్రకారం ప్రస్తుతం మావోయిస్టు ప్రభావిత దండకారణ్యంలో సుమారు 100 బిలియన్ డాలర్లు అంటే సుమారు 8.7లక్షల కోట్ల విలువైన ఐరన్‌ఓర్, కోల్, బాక్సైట్, మాంగనీస్ నిల్వలున్నాయి. వీటిని తవ్వి తరలించేందుకు మోదీ ఇచ్చే పర్మిషన్ల కోసం ఆయన కార్పొరేట్ మిత్రులు కాచుకొని ఉన్నారు. వాస్తవానికి చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మావోయిస్టుల ఏరివేతకు ‘అపరేషన్ గ్రీన్‌హంట్’ మొదలైంది.
కానీ, కేంద్ర ప్రభుత్వానికి అక్కడి పోలీసుల నుంచి పూర్తిస్థాయి సహకారం లేకపోవడం వల్ల కార్పొరేట్లు ఆశించినంత వేగంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగలేదు. 2023 డిసెంబర్లో చత్తీస్‌గఢ్‌లో బీజేపీ సర్కారు కొలువు దీరడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. కార్పొరేట్ల కల నెరవేర్చేందుకు కేంద్రం జెట్ స్పీడ్‌తో రంగంలోకి దిగింది. అధికారంలోకి వచ్చి నెలరోజులు తిరక్కుండానే 2024 జనవరిలో ‘అపరేషన్ కగార్’ పేరుతో మావోయిస్టులపై యుద్ధం ప్రకటించింది. అప్పటికే ఉన్న డీఆర్జీ, కోబ్రా దళాలకు తోడు ఏకంగా40వేల మంది సాయుధ జవాన్లను దండకారణ్యంలోకి దింపింది. వీరి శిక్షణ శిబిరాల ఏర్పాటు కోసమే ఏకంగా లక్షా 30వేల ఎకరాల భూమిని కేటాయించిందంటే ఈ యుద్ధాన్ని కేంద్రం ఎంత సీరియస్‌గా తీసుకున్నదో అర్థం చేసుకోవచ్చు.
ఈ మిషన్లో భాగంగా అబూజ్‌మడ్ (బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, కొండగావ్) లో ప్రతీ 6 కిలోమీటర్లకు ఒకటి చొప్పున సుమారు 400 కు పైగా పారా మిలిటరీ క్యాంపులు ఏర్పాటు చేయగా దండకారణ్యంలోని మావోయిస్టుల గెరిల్లా జోన్లన్నీ వీటి పరిధిలోకి వెళ్లాయి. దీంతో మావోయిస్టులు, ఆదివాసులకు ఊపిరి ఆడడం లేదు. నిజానికి ఈ దేశంలో ఖనిజ నిక్షేపాలు ఉన్న గనులన్నింటినీ ప్రభుత్వాలు యుద్ధ క్షేత్రాలుగా మారుస్తున్నాయి. గనుల ద్వారా అక్కడి ఆదివాసులు, స్థానికుల ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగుపడాలి. కానీ, అలా జరగకపోగా గాలి, నీరు, ఇతర వనరులు కలుషితమై స్థానికుల మనుగడే ప్రశ్నార్థకమవుతోంది.
వాస్తవానికి చత్తీస్గఢ్రాష్ట్ర అడవులను అందులోని ఖనిజ సంపదను, భూమిని, పర్యావరణాన్ని, జీవనోపాధిని కాపాడుకుంటున్నది అక్కడి ఆదివాసులే! ఇందుకోసం వారు చేస్తున్న జీవన్మరణ పోరాటానికి మావోయిస్టులు కేవలం మద్దతుదారులు మాత్రమే. ఇప్పుడు ఆ మద్దతుదారులను నిర్మూలించడం ద్వారా సహజసంపదను స్వాధీనం చేసుకోవాలని మోదీ, అమిత్‌షా కలలు గంటున్నారు. కానీ, మహిళలు, పిల్లలు సహా ఆదివాసులందరినీ చంపితేగానీ ఆ కల నెరవేరదు. అప్పటిదాకా ఈ యుద్ధం ఆగదు. మరి ప్రజల్ని చంపి తెచ్చే అచ్చేదిన్ ఎవరి కోసం మోదీజీ?
చిల్ల మల్లేశం, సీనియర్ జర్నలిస్ట్