తాగునీటికి మట్టికుండే మేలు : జి. యోగేశ్వరరావు

తాగునీటికి మట్టికుండే మేలు : జి. యోగేశ్వరరావు

ఎండలు ఊహించని రీతిలో మండిపోతున్న వేళ తాగునీటి వాడకం ఎక్కువ అవుతోంది. కొందరు సీసాల్లో నీళ్లు నింపి బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు అతికించి వివిధ పేర్లతో అమ్మకాలు సాగిస్తున్నారు. ఇలాంటి నీటిని తాగి చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో అమ్ముతున్న వాటర్ బాటిల్లో నీరు శుద్ధి చేసి ఉందో లేదో  తెలుసుకోవడం కూడా కష్టమే. 

ఎం డకు తాళలేక నోరు తడుపుకోవాలన్న ఆతృతతో ఆ నీళ్లు తాగేస్తుంటాం. వినియోగదారుల బలహీనతను కనిపెట్టి నకిలీ నీళ్ల బాటిళ్లు తయారుచేసే కంపెనీలు మార్కెట్లో ఎక్కువయ్యాయి. ఈ దందా ఏటికేడు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అరికట్టే అధికారులు ఈ మాయను తెలుసుకుని పరిస్థితిని గాడిలో పెట్టకపోతే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. సంబంధిత అధికారులు ఎక్కడికక్కడ ప్రక్షాళన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మినరల్ వాటర్ పేరుతో మోసాలు పెరుగుతున్నాయి.  

పేద, మధ్య తరగతి కుటుంబాలు సైతం  ఇళ్లకు వాటర్ క్యాన్లు రప్పించుకుంటున్నారు. బయటకు వెళ్లేవారు బాటిల్ నీళ్లు కొనుక్కొని తాగక తప్పదు.   నీటి వ్యాపారం చేస్తున్న వాటిలో 70 శాతం వ్యాపార సంస్థలకు అనుమతులు లేవు.యాజమాన్యాలు కనీస నిబంధనలు పాటించడం లేదు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం సాగుతున్న  అక్రమ నీటి వ్యాపారంపై అధికారులు దృష్టిపెట్టాలి. నిజానికి కాచి, చల్లార్చిన నీళ్లే శుద్ధమైన తాగునీరు. వేసవి కాలంలోనూ  కాచిన నీళ్లను మళ్లీ కూల్​ చేసుకొని తాగొచ్చు. అపుడు మినరల్​ వాటర్​ అవసరం ఉండదు.

తాగునీటికి ప్లాస్టిక్​ బాటిళ్లు వాడొద్దు

లీటరు వాటర్ బాటిల్లో రెండు లక్షలకు పైగా ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని ఒక అధ్యయనం వెల్లడించింది. నీటి సీసాల్లో మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉండటం అత్యంత సహజం. కొలంబియా రట్జర్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం చేసి లీటరు వాటర్ బాటిల్లో రెండు లక్షలకు పైగా ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్టు గుర్తించారు. సరికొత్త లేజర్ సాంకేతికతను వినియోగించి చేసిన ఈ పరిశోధనలో నీళ్లలోనే చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఉన్నయని తెలుసుకున్నారు. ఎండకు బాటిళ్లు వేడెక్కి లోపల రసాయనాలు కరిగి వ్యాధులు వ్యాపిస్తాయనీ,హార్మోన్ల సమస్యతోపాటు కాలేయానికి తీవ్ర నష్టం తప్పదని అంటున్నారు. ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగడం ఆపి సురక్షిత మార్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఒకసారి ఖాళీ చేశాక బయట విసిరి వేయాల్సిన బాటిళ్లను మళ్లీ మళ్లీ వాడటం కూడా మంచిది కాదని చెబుతున్నారు.

స్టీల్​ బాటిల్, మట్టికుండ నీళ్లు తాగడం మంచిది 

ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీళ్లు తాగడం ఆపి స్టెయిన్​లెస్ స్టీల్ సీసాలు వాడితే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. స్టెయిన్​లెస్ స్టీల్ సీసాల్లో హానికర రసాయనాలు, విష పదార్థాలు ఉండవు. నీటి రుచి కూడా మెరుగ్గా ఉంటుంది. స్టీల్ తుప్పు పట్టదు. అదే ప్లాస్టిక్ బాటిల్​ అయితే  మనం కనిపెట్టలేని విధంగా ప్లాస్టిక్​ రేణువులు ఉంటాయి. నీటి రుచిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా తీవ్ర ఉష్ణోగ్రతలు ఉన్న సందర్భాల్లో ప్లాస్టిక్ వినియోగం అసలు మంచిది కాదు. పునర్ వినియోగ సీసాలు వివిధ డిజైన్లలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

స్టెయిన్​లెస్ స్టీల్ వాడకం ఆరోగ్యానికి అన్నివిధాలా శ్రేయస్కరం అని, పైగా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునే వీలుంటుందని వైద్యులు చెపుతున్నారు. సరైన పాత్రలో నీరు తాగడం  అనేది ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశం. గాజు పాత్రలో నీళ్లుతాగడం మంచి నిర్ణయమే అవుతుంది. అది నీటి నాణ్యతను ఏమాత్రం ప్రభావితం చేయదు.పైగా పారదర్శకంగా ఉంటుంది. నీరు ఎంత శుభ్రంగా ఉందో తెలిసిపోతుంది. అలాగే రాగి మూలకాలు ఉన్న నీరు తాగడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. మట్టికుండలో  నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అసిడిటీ,  ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు.  రాగి, మట్టి, గాజు పాత్రల్లో నీళ్లు తాగడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

-జి. యోగేశ్వరరావు,సీనియర్​ జర్నలిస్ట్​